ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ స్టాండ్ ఇదే.. క్లారిటీ ఇచ్చిన బొత్స
ఉపరాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థి ఎన్నిక ఏకగ్రీవం చేయాలని భావించిన బీజేపీ.. ఎన్డీఏ కూటమితో పాటు.. ఇతర పార్టీల నేతలతోనూ సంప్రదింపులు జరిపింది.. అయితే, ఇండియా కూటమి అభ్యర్థిని ప్రకటించడంతో.. ఎన్నికలు అనివార్యం అయ్యాయి.. ఇక, ఇప్పటికే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్.. ఇవాళ రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ.. కీలక వ్యాఖ్యలు చేశారు.. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ స్టాండ్ పై క్లారిటీ ఇచ్చారు.. రాజ్యాంగ బద్ధమైన పదవులకు నెంబర్ గేమ్ ఉండకూడదనేది వైసీపీ విధానమని స్పష్టం చేశారు బొత్స.. పార్టీ ఆవిర్భావం నుంచి ఇదే విధానాన్ని కొనసాగిస్తున్నాం.. గతంలో కాంగ్రెస్ హయాంలో రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీకి జగన్ మద్దతు ఇచ్చారు.. ఇప్పుడు అదే విధంతో ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మద్దతిస్తాం అని స్పష్టం చేశారు.. అయితే, తెలుగు అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన అభ్యర్థన పరిగణలోకి తీసుకునేది కాదని కొట్టిపారేశారు.. అలాగైతే ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి దక్షిణాదికి చెందినవారు కదా? అని ప్రశ్నించారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ..
ఏపీ రెవెన్యూ శాఖకు జాతీయ స్థాయిలో గుర్తింపు.. రెండు ప్రతిష్టాత్మక అవార్డులు సొంతం
ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.. ఏపీ రెవెన్యూ శాఖకు రెండు స్కోచ్ అవార్డులు సొంతం చేసుకుంది.. 2025 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక స్కోచ్ సమ్మిట్ లో అవార్డుల ప్రదానం జరిగిందని తెలిపారు రాష్ర్ట రెవెన్యూ, రిజిస్ర్టేషన్ మరియు స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్.. ORCMS (ఆన్ లైన్ కోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్), రీసర్వే 2.0కు స్కోచ్ అవార్డులు వచ్చాయని వెల్లడించారు.. వచ్చే నెల 20వ తేదీన ఢిల్లీలో అవార్డుల ప్రదానోత్సవం ఉంటుందని తెలిపారు అనగాని.. ప్రజలకు మెరుగైన సేవలు అందించినందుకు ఏపీ రెవెన్యూ శాఖకు స్కోచ్ అవార్డులు వచ్చాయని వివరించారు మంత్రి అనగాని.. రెవెన్యూ వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న విప్లవాత్మక సంస్కరణలకు పెద్ద పీట వేసిన ప్రతిష్టాత్మక స్కోచ్ సమ్మిట్ అన్నారు.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో అమలు చేస్తున్న రెవెన్యూ సంస్కరణలకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం ఆనందకరం అన్నారు.. రెవెన్యూ పరిపాలనను ప్రజలకు చేరువ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న ఉత్తమ విధానాలకు ఈ అవార్డులు నిదర్శనం అన్నారు.. రెవెన్యూ శాఖ ఉద్యోగులు, అధికారులు చేసిన కృషి కారణంగానే అవార్డులు దక్కాయని పేర్కొన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్..
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. 33 అజెండా అంశాలకు ఆమోదం..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. మొత్తం 33 అజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.. జలవనరులశాఖ పనులకు సంబంధించి మరో 11 అంశాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మంత్రివర్గం.. ఏపీ సర్క్యులర్ ఎకానమీ, వేస్ట్ రీసైక్లింగ్ పాలసీ (4.0) 2025-30కి ఆమోదం తెలపగా.. పర్యాటక ప్రాజెక్టులకు ప్రభుత్వ భూముల కేటాయింపు మార్గదర్శకాలకు ఆమోదముద్ర వేసింది.. అధికారిక భాష కమిషన్ పేరు మార్పునకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ‘మండలి వెంకట కృష్ణారావు అధికారిక భాష సంఘం….’గా మార్పునకు ఆమోదముద్ర పడింది.. సాగుభూమిని వ్యవసాయేతరంగా మార్పునకు నాలా చట్ట సవరణలకు ఆమోదం తెలిపింది కేబినెట్.. 51వ సీఆర్డీఏ సమావేశం ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.. రాజధాని పరిధి 29 గ్రామాల్లో రూ.904 కోట్లతో మౌలిక వసతుల కల్పనకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. సీఆర్డీఏ పరిధిలో సంస్థలకు భూకేటాయింపునకు ఆమోదం లభించగా.. మంత్రి వర్గ ఉపసంఘం సిఫార్సులకు కేబినెట్ ఆమోదం తెలిపింది..
కేటీఆర్ పై మంత్రి కోమటి రెడ్డి ఫైర్.. మా పార్టీ గురించి నీ తండ్రిని అడుగు అంటూ..
కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. కోమటి రెడ్డి మాట్లాడుతూ.. భారత దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీని డర్టీ పార్టీ అని మాట్లాడడం కేటీఆర్ అహంకారానికి నిదర్శనం.. తెలంగాణ ఇచ్చిన పార్టీ నీకు థర్డ్ గ్రేడ్ పార్టీలా కనిపిస్తుందా..?.. నీ తండ్రిని అడుగు మా పార్టీ గురించి చెప్తాడు.. నీ తండ్రి కేసిఆర్, నువ్వు నీ కుటుంబం తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ దగ్గర గ్రూప్ ఫోటో దిగింది మర్చిపోయారా..? మా పార్టీ పెట్టిన ఉప రాష్ట్రపతి అభ్యర్థిని దేశం మొత్తం హర్షిస్తుంది.. సుదర్శన్ రెడ్డి సుప్రీం కోర్టు జడ్జిగా ఉంటూనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం గళం ఎత్తిన న్యాయ కోవిదుడు.
నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ తీపికబురు.. సీసీఎల్ ఏలో 217 పోస్టులు.. త్వరలో నోటిఫికేషన్
నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. సీసీఎల్ ఏలో 217 పోస్టులను మంజూరు చేసింది రేవంత్ సర్కార్. కొత్త 15 రెవెన్యూ మండలల్లో 189 పోస్టులను భర్తీ చేయనున్నారు. కొత్తగా ఏర్పడిన 2 రెవెన్యూ డివిజన్‌ల కోసం 28 పోస్టులు మంజూరు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేసింది తెలంగాణ సర్కార్. ఈ పోస్టులను ఆదిలాబాద్ జిల్లా, మహబూబ్‌నగర్, వనపర్తి, కామారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, నల్గొండ, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో భర్తీ చేయనున్నారు. భర్తీ చేసేందుకు ప్రభుత్వం త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనుంది.
కొంప ముంచిన గూగుల్ మ్యాప్స్.. చెరువులో పడ్డ కారు
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ నుంచి నలుగురు స్నేహితులు కారులో అంబాలలోని షహాబాద్ పట్టణం మహర్షి మార్కండేశ్వర్ ఆలయానికి వెళ్తున్నారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వారిలో ఎవరికి కూడా మహర్షి మార్కండేశ్వర్ ఆలయానికి దారి తెలియదు. దీంతో గూగుల్ మ్యాప్స్ సహాయంతో ముందుకు వెళ్తున్నారు. ఊహించని విధంగా వారి కారు చెరువులో పడిపోయింది. అదృష్టవశాత్తూ ఆ నలుగురు స్నేహితులు కిందమీద పడి ఏదో విధంగా చెరువులో నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. తరువాత వాళ్లు ఈ విషయాన్ని పోలీసులకు చెప్పగా వాళ్లు చెరువులో పడ్డ కారును బయటకు తీస్తున్నారు.మీరట్‌లోని చౌదరి చరణ్ సింగ్ విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థి నాయకుడు సూర్య తన స్నేహితులు ఆదిత్య, అనుజ్ అశుతోష్‌లతో కలిసి కారులో షహాబాద్ పట్టణంలోని మహర్షి మార్కండేశ్వర్ ఆలయాన్ని దర్శించుకోడానికి వెళ్తున్నారు. తెలియని దారి కావడంతో గూగుల్ మ్యాప్స్ సాయంతో ముందుకు వెళ్తుంటే ఒక్కసారి వారి కారు చెరువులో పడిపోయింది. వెంటనే వాళ్లు కారు అద్దాలను ధ్వంసం చేసుకొని చెరువులో నుంచి బయటపడ్డారు.
ఇమ్రాన్ ఖాన్ కు బెయిల్ మంజూరు చేసిన పాక్ సుప్రీంకోర్టు.. మాజీ ప్రధాని జైలు నుంచి బయటకు వస్తారా?
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు ఊరట లభించింది. జియో న్యూస్ నివేదిక ప్రకారం.. మే 9న జరిగిన హింసకు సంబంధించిన ఎనిమిది కేసుల్లో పాకిస్తాన్ మాజీ ప్రధాని, తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్‌కు పాక్ సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2023లో దేశవ్యాప్త నిరసనలు, ప్రభుత్వ, సైనిక సంస్థలపై దాడుల నేపథ్యంలో ఖాన్‌పై నమోదైన అనేక కేసుల విచారణ సందర్భంగా ఈ నిర్ణయం వెలువడింది. పాకిస్తాన్ ప్రధాన న్యాయమూర్తి యాహ్యా అఫ్రిది నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం, జస్టిస్ ముహమ్మద్ షఫీ సిద్ధిఖీ, జస్టిస్ మియాంగుల్ హసన్ ఔరంగజేబ్‌లతో పాటు ఈ పిటిషన్లను విచారించింది.
బీఎస్‌ఎన్‌ఎల్ అదిరిపోయే ఆఫర్.. రూ.400కే ట్రిపుల్ ప్లే సర్వీసెస్..
ప్రైవేట్ టెలికం సంస్థలతో పోటీపడి మరీ సర్వీసులు అందించే ప్రయత్నాలు చేస్తోంది ప్రభుత్వ టెలికం రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్ఎల్).. ఇప్పటికే ప్రైవేట్ టెలికం సంస్థల బాదుడు తట్టుకోలేక ఎంతో మంది బీఎస్ఎల్‌ఎల్ నెట్‌వర్క్‌కు మారుతున్నట్టు ట్రైయ్ లెక్కలు తేల్చాయి.. ఇక, ట్రిపుల్ ప్లే సర్వీసెస్‌లోకి అడుగు పెడుతుంది బీఎస్ఎన్ఎల్.. తక్కువ ధరలోనే వినియోగదారులకు ఈ సర్వీసు అందుబాటులోకి తీసుకురానుంది.. ట్రిపుల్ ప్లే సర్వీసెస్ అంటే బ్రాడ్‌బ్యాండ్, ల్యాండ్‌లైన్ మరియు టీవీ కోసం ఒకే ప్యాకేజీ అని అర్థం. అయితే, కర్నూలులో బీఎస్ఎన్ఎల్‌లో 400 రూపాయలకే ట్రిపుల్ ప్లే సర్వీసు ప్రారంభించారు టెలికాం ప్రిన్సిపల్ జీఎం రమేష్. రూ.400 కే హై స్పీడ్ ఇంటర్నెట్, 400 టీవీ ఛానళ్లు , 9 ఓటీటీలు.. అపరిమితమైన వాయిస్ కాలింగ్ కల్పిస్తామని వెల్లడించారు జీఎం రమేష్. మరోవైపు, కేవలం ఒక్క రూపాయికే ఫ్రీడమ్ ప్లాన్ సిమ్ కార్డు ఇస్తామని, 30 రోజుల పాటు ప్రతిరోజు 2 జీబీ డేటా, అపరిమితమైన కాల్స్ .. 100 ఎస్ఎంఎస్ లు ఉచితంగా పొందవచ్చని పేర్కొన్నారు.. ఆత్మనిర్భర భారత్ లో భాగంగా బీఎస్ఎన్ఎల్ పూర్తి స్వదేశీ సాంకేతికతతో 4జీ సేవలను ప్రారంభించిందన్నారు టెలికాం ప్రిన్సిపల్ జీఎం రమేష్..
టీడీపీ అధికారంలో ఉంటేనే సినిమాలు.. నారా రోహిత్ క్లారిటీ
సీఎం నారా చంద్రబాబు నాయుడు తమ్ముడి కొడుకు అయినా నారా రోహిత్ చాలా ఏళ్ల తర్వాత మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చేశాడు. గత మే నెలలోనే భైరవం సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఇప్పుడు ఆయన హీరోగా సుందరకాండ అనే సినిమా వస్తోంది. వెంకటేష్ నిమ్మలపూడి తెరకెక్కిస్తుండగా.. సందీప్ పిక్చర్ ప్యాలెస్ బ్యానర్‌పై సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు రోహిత్. ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేశాడు. చాలా రోజుల నుంచి రోహిత్ మీద ఓ అలిగేషన్ ఉంది. ఏపీలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే ఆయన మెయిన్ హీరోగా సినిమాలు చేస్తారనే ప్రచారం ఉంది. ఒకవేళ టీడీపీ అధికారంలో లేకపోతే హీరోగా కాకుండా గెస్ట్ రోల్స్ లాంటివి చేస్తాడనే టాక్ ఉండేది. దానిపై నారా రోహిత్ క్లారిటీ ఇచ్చారు. ఇది నేను కూడా ఎప్పటి నుంచో వింటున్నాను. అదేంటో నాకు కూడా అర్థం కాదు. సుందరకాండ సినిమాను మేం 2023లో మొదలు పెట్టాం. అది ఇప్పుడు పూర్తి అయింది. మేం మొదలు పెట్టినప్పుడు టీడీపీ అధికారంలో లేదు కదా. అలాగే ప్రతినిధి సినిమా కూడా నేను 2012లో మొదలు పెట్టాను. అది 2014లో వచ్చింది. చాలా సినిమాలు మేం స్టార్ట్ చేసిన ఏడాదిలోనే రావు కదా అండి. అందుకే లేట్ అవుతుంది. అందరూ రిలీజ్ అవుతున్న డేట్లు మాత్రమే చూస్తారు. కానీ అవి ఎప్పుడు స్టార్ట్ చేశామో వారికి తెలియదు కదా. అందుకే ఇలా అనుకోవడంలో పెద్ద అనుమానమేమీ లేదు అని చెప్పుకొచ్చారు నారా రోహిత్.
అల్లు అర్జున్ కు షాక్.. రోజుకు కోటిన్నర నష్టం..?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు భారీ షాక్ తగిలిందా అంటే అవుననే అంటున్నారు సినిమా మేథావులు. మనకు తెలిసిందే కదా.. పుష్ప-2 తర్వాత అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీతో భారీ సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గానే ఈ మూవీ షూటింగ్ ముంబైలో స్టార్ట్ అయింది. భారీ షెడ్యూల్ ను ఇక్కడే ప్లాన్ చేశారు. అందుకే ముంబైలో భారీగా సెట్లు కూడా వేసేసి.. టెక్నీషియన్లు, ఆర్టిస్టుల డేట్లు తీసేసుకున్నారు. కానీ ఇదే టైమ్ లో టాలీవుడ్ లో సినీ కార్మికులు సమ్మెకు దిగారు. ఇప్పటికే 16 రోజులు అయిపోయాయి. మొదట్లో ఈ మూవీ షూటింగ్ కు కొంత మంది టెక్నీషియన్లు, కార్మికులు వచ్చారు. కానీ సమ్మె ఉధృతం కావడంతో ఈ మూవీ షూటింగ్ కు టాలీవుడ్ నుంచి ముందే మాట్లాడుకున్న వారెవరూ రావట్లేదని తెలుస్తోంది.