పవన్ కల్యాణ్ మరో కానుక.. 10 వేల మంది పిఠాపురం ఆడపడుచుల కోసం..!
తాను ప్రాతినిథ్యం వహిస్తోన్న పిఠాపురం నియోజకవర్గం ఆడపడుచులకు.. ఇతర వ్యక్తులకు సందర్భాన్ని భట్టి ఏదో ఓ కానుకలు ఇస్తూనే ఉంటారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అంతేకాదు, ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనులకు తన తోటలో పండిన మామిడి పళ్లు, చెప్పులు, దుప్పట్లు.. ఇలా ఏవి పంపించినా ఆయనకే చెల్లింది.. ఇక, ఇప్పుడు పిఠాపురం ఆడపడుచులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శ్రావణ శుక్రవారం కానుక సిద్ధం చేస్తున్నారు.. శక్తిపీఠం పురుహూతిక అమ్మవారి ఆలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతానికి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.. 10 వేల మంది ఆడపడుచులకు పసుపు, కుంకుమ, చీరలు పంపిణీ చేయబోతున్నారు పవన్ కల్యాణ్.. 22వ తేదీ ఉదయం 5 గంటల నుంచి ఈ వరలక్ష్మీ వ్రతాలు ప్రారంభం కాబోతున్నాయి.. మొత్తం 5 విడతలుగా వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు.. ఒక్కో బ్యాచ్ కు ఒక్కో అమ్మవారి పేరునా అంబిక, భ్రమరాంబ, చాముండి, దుర్గ, ఈశ్వరి అని నామకరణం చేశారు.. అంబిక భక్త బృందం ఉదయం 5 గంటల నుంచి 6.30 గంటల వరకు, భ్రమరాంబ భక్త బృందం 6.30 గంటల నుంచి 8 గంటలు వరకు, చాముండి భక్త బృందం 8 గంటల నుంచి 9.30 గంటల వరకు, దుర్గ భక్త బృందం 9.30 నుంచి 11 గంటల వరకు, ఈశ్వరి భక్త బృందం 11 నుంచి 12.30 గంటల వరకు వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు..
రౌడీషీటర్ శ్రీకాంత్ ప్రియురాలు.. నెల్లూరు లేడీ డాన్ అరెస్ట్..
రౌడీషీటర్ శ్రీకాంత్ ప్రియురాలు.. అతడికి పెరోల్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించడమే కాదు.. అతడి సహకారంతో నేరాలకు పాల్పడుతోందనే ఫిర్యాదులతో రౌడీషీటర్ శ్రీకాంత్ ప్రియురాలు అరుణను కోవూరు పోలీసులు అరెస్ట్ చేశారు. లేడీ డాన్, కిలాడీ లేడీ నిండిగుంట అరుణపై కేసులు నమోదు చేశారు.. అరుణపై CR No: 246/2025 U/sec 127(2), 140(3), 308(5), 115(2) r/w 3(5) BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసుల.. అరుణతో పాటు మరో ముగ్గురిని ముద్దాయిలుగా చేర్చారు.. ఏ 1-నిడిగుంట అరుణ, ఏ 2- పల్లం వేణు, ఏ 3- అంకెం రాజ, ఏ 4- సీరం ఎలిష.. ఇలా నలుగురిని ఈ కేసులో ముద్దాయిలుగా పేర్కొన్నారు పోలీసులు.. మునగ వెంకట మురళి కృష్ణమోహన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.. అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ అద్దెకు తీసుకొని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయమని మురళీ కృష్ణను కత్తితో బెదిరించినట్టు ఫిర్యాదు అందడంతో.. అరుణను అరెస్ట్ చేసిన పోలీసుల.. వైద్య పరీక్షలు నిర్వహించి నెల్లూరు కోర్టుకు తరలించారు.
స్కూల్ ఎప్పుడు కూలుతుందో తెలియన భయం.. పీర్ల కొట్టం, గణేష్ మండపంలో పాఠాలు..!
వికారాబాద్ జిల్లా పూడూరు మండలం రాకంచెర్ల గ్రామంలో గత 30 ఏళ్ల క్రితం నిర్మించిన స్కూల్ భవనం, అదే మండలానికి చెందిన మేడికొండ గ్రామంలో 30 సంవత్సరాల కిందట నిర్మించిన బిల్డింగ్‌లు ఉన్నాయి.. ఈ స్కూల్ భవనాలు వర్షం సమయంలో కురుస్తున్నాయి … రాకంచెర్ల ప్రైమరీ స్కూల్ భవనంలో భారీ వర్షాలకు స్కూల్ భవనం స్లాబ్ పూర్తిగా నానిపోయి.. నీటి చుక్కలు క్లాస్ రూమ్‌లో కారుతూ తడిగా మారిపోయింది. స్కూల్‌లోని ఫ్యాన్లలోకి సైతం ఆ నీరు చేరింది.. ఎక్కడ షాక్ కొడుతుందో, స్కూల్ భవనం ఎక్కడ కూలుతుందో తెలియని పరిస్థితిలో స్కూల్ పక్కనే ఉన్న పీర్ల కొట్టంలో రేకుల షెడ్డు కింద విద్యార్థులకు విద్యాబోధనలో చేస్తున్నారు.. ఇదిలా ఉంటే అదే మండలానికి చెందిన మరో గ్రామం మేడికొండలోని ప్రైమరీ స్కూల్‌లో కూడా అదే దుస్థితి. ఈ స్కూల్ కూడా వర్షానికి నాని పెచ్చులు ఊడి కింద పడుతున్నాయి.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే స్కూల్ భవనం చెట్టు పైన కవర్ కప్పండి నీళ్లు కురవకుండా ఉంటాయని సలహా ఇచ్చినట్లు సమాచారం. ఆ భవనం ఎప్పుడు కూలుతుందో కూడా తెలియని భయంతో పక్కనే ఉన్న గణేష్ మండపంలో విద్యార్థులను కూర్చొబెట్టి పాఠాలు చెబుతున్నారు..
పదేళ్ల లో రాని సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చింది
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరో కాంగ్రెస్ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. గత రెండు నెలలు గా యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల రైతులు దయనీయ పరిస్థితుల్లో ఉన్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు. కేసీఆర్ హయాంలో ఆరు నెలల ముందే ఎరువుల బస్తాలు సిద్ధంగా ఉంచేవారని, ఇప్పుడు ఒక ప్రణాళిక కూడా చేయట్లేదని ఆయన అన్నారు. అంతేకాకుండా.. కాంగ్రెస్ పార్టీ దున్నపోతు మీద వాన కురిసిన విధంగా వ్యవహరిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. ఢిల్లీకి రాహుల్ గాంధీని కలవడానికి వెళ్లి రేవంత్ రెడ్డి ఎదో ఒక పేపర్ ఇచ్చి వస్తున్నారని, ఇక్కడ పోలీసులను పెట్టి ఎరువుల బస్తాలు అమ్మే పరిస్థితి వచ్చిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
బెట్టింగ్ యాప్స్ పై కేంద్రం నిర్ణయం.. సజ్జనార్ ఏమన్నారంటే..?
ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌పై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిషేధ నిర్ణయాన్ని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ హర్షించారు. ఇప్పటికే ఈ యాప్స్ కారణంగా దేశవ్యాప్తంగా ఎంతోమంది అమాయకులు మోసపోయారని, ఆర్థికంగా కూలిపోయారని గుర్తుచేశారు. ఈ తరహా వ్యసనపరచే యాప్స్ వల్ల కుటుంబాలు నాశనం కావడంతోపాటు సమాజంలో తీవ్ర సమస్యలు తలెత్తుతున్నాయని ఆయన పేర్కొన్నారు. సజ్జనార్ మాట్లాడుతూ.. బెట్టింగ్ యాప్స్‌పై నిషేధం విధించడం సమాజ రక్షణ దిశగా తీసుకున్న ముఖ్యమైన అడుగు అని అయన అభిర్ణించారు. అయితే కేవలం కొన్ని యాప్స్‌నే కాకుండా, ఇలాంటి దారుణ ప్రభావం చూపే మరికొన్ని యాప్స్‌పైనా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి అని ఆయన అన్నారు. అలాగే, ఈ యాప్స్ ఏ రూపంలోనూ దేశంలోకి రాకుండా చూడటం కేంద్ర ప్రభుత్వంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అని ఆయన అన్నారు.
మేడారం జాతర కోసం తెలంగాణ ప్రభుత్వం భారీ నిధుల మంజూరు
ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన మేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరను వచ్చే ఏడాది ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో గిరిజన సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేస్తూ రూ.150 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులను మేడారం మహా జాతర ఏర్పాట్లతో పాటు శాశ్వత నిర్మాణాల పనులకు వినియోగించనున్నారు. జాతరకు వచ్చే లక్షలాది భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా ప్రభుత్వం ముందడుగు వేసింది.
ఎన్టీఆర్ కోసం జపాన్ నుంచి వచ్చిన అమ్మాయి..
జూనియర్ ఎన్టీఆర్ కు మన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో అభిమానులు ఉన్నారు. అందులోనూ జపాన్ లో ఎన్టీఆర్ కు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. త్రిబుల్ ఆర్, దేవర సినిమాలతో అక్కడ భారీగా అభిమానులను సంపాదించుకున్నాడు ఎన్టీఆర్. దేవర సినిమాను స్పెషల్ గా అక్కడ రిలీజ్ చేశారు. ఆ టైమ్ లో ఓ అభిమాని ఎన్టీఆర్ కోసం ఏకంగా తెలుగు నేర్చుకుని మాట్లాడింది. ఆ వీడియోను ఎన్టీఆర్ స్పెషల్ గా పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఓ మహిళా అభిమాని జపాన్ నుంచి ఇండియాకు వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో తెగ పోస్ట్ చేసి షేర్ చేసేస్తున్నారు.
నాగ వంశీ కూడా మాస్ జాతర అప్డేట్ ఇవ్వలేదేంటి?
మీడియాలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ప్రొడ్యూసర్స్‌లో నాగ వంశీ ఒకరు. ఈ మధ్యకాలంలో వార్ 2 తెలుగు హక్కులు దక్కించుకున్న ఆయన, అనూహ్యంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. ఆయన మీద మీమ్స్ కూడా చేసి వదులుతున్నారు మెంబర్లు. ఈ నేపథ్యంలో, గత కొంతకాలంగా ఆయన సోషల్ మీడియా అకౌంట్ నుంచి అయితే ఆక్టివ్‌గా లేరు. కానీ, తాజాగా ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక ట్వీట్ చేశారు. అది ఇప్పుడు వైరల్ అవుతుంది. “ఏంటి, నన్ను చాలా మిస్ అవుతున్నట్టు ఉన్నారు. వంశీ అది, వంశీ ఇది అని చాలా గ్రిప్పింగ్ నేరేటివ్ నడుస్తున్నాయి. పర్లేదు, ట్విట్టర్‌లో మంచి రైటర్స్ ఉన్నారు. కానీ, మిమ్మల్ని అందరిని డిసప్పాయింట్ చేస్తున్నందుకు సారీ. నేను ఇంకా సినీ ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోవడానికి పది, పదిహేనేళ్లు పడుతుంది. సినిమాల కోసం సినిమాలతో సిద్ధంగానే ఉంటాను,” అని పేర్కొన్న ఆయన, తమ సంస్థ నుంచి వస్తున్న మాస్ జాతర సినిమాతో కలుద్దామని చెప్పుకొచ్చారు. అయితే, రవితేజ హీరోగా భాను భోగవరపు డైరెక్షన్‌లో రూపొందుతున్న మాస్ జాతర సినిమా ఆగస్టు 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే, ఆ సినిమా రిలీజ్ వాయిదా పడే అవకాశం ఎక్కువగా ఉందని అంటున్నారు. కొంత షూటింగ్ పెండింగ్ ఉండడంతో పాటు, మరికొన్ని కారణాలతో సినిమా రిలీజ్ వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, ఈ విషయం మీద అధికారికంగా ఇప్పటివరకు ప్రకటన రాలేదు. ఇప్పుడు నాగవంశీ ట్వీట్‌లో కూడా ఆ విషయాన్ని ప్రస్తావించకపోవడంతో, వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు.