వైసీపీలో విషాదం.. క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్ కన్నుమూత..
శివరాత్రి సమయంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో విషాదం నెలకొంది.. ఏపీ క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్, ఉండి మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు గత అర్ధరాత్రి కన్నుమూశారు.. ఆయన వయస్సు 72 సంవత్సరాలు. భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. 2004 ఎన్నికల్లో ఉండి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయన విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు.. ఇక, 2009లో మళ్లీ అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసినా విజయం సాధించలేకపోయారు.. ఆ తర్వాత వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు పాతపాటి సర్రాజు.. 2014లో వైసీపీ అభ్యర్థిగా ఉండి నుంచి పోటీ చేసినా ఓటమి తప్పలేదు.. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కలేదు. అయితే, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి.. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత పాతపాటి సర్రాజును ఏపీ క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించారు. శుక్రవారం రాత్రి భీమవరంలో ఓ వివాహ వేడుకకు హాజరైన పాతపాటి సర్రాజు.. రాత్రి 10 గంటల తర్వాత తన నివాసానికి చేరుకున్నారు.. అయితే, ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలారు. వెంటనే అప్రమత్తమై.. ఆయనను భీమవరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.. ఆయన, 1954లో కాళ్ల మండలం జక్కవరం గ్రామంలో జన్మించారు. కాంగ్రెస్ పార్టీలో చేరడంతో రాజకీయాల్లో అడుగుపెట్టిన ఆయన.. ఆ తర్వాత వైసీపీలో చేరారు.. 17 జులై 2021న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. 14 ఆగష్టు 2021న ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు.. ఇక, పాతపాటి సర్రాజు మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. సర్రాజు కుటుంబసభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు భీమవరం సర్రాజు గారి స్వగృహంలో ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించనున్న సీఎం జగన్.. కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.
శివయ్య భక్తులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు
మహాశివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాలకు వెళ్లే భక్తులకు శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ).. శివరాత్రిని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా 3,800 ప్రత్యేక బస్సులను నడుపుతోంది.. ఈ విషయాన్ని ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు.. మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి శైవక్షేత్రాలకు 3,800 ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని ఆయన పేర్కొన్నారు.. ఈ ప్రత్యేక బస్సుల్లో కోటప్పకొండకు 675, శ్రీశైలానికి 650, కడప జిల్లా పొలతలకు 200, పట్టిసీమకు 100 బస్సులు నడుపుతున్నామని వెల్లడించారు. అయితే, ప్రత్యేక బస్సులు అనగానే వెంటనే ప్రత్యేక చార్జీలు కూడా గుర్తుకు వస్తాయి.. కానీ ప్రత్యేక బస్సుల్లోనూ సాధారణ ఛార్జిలే వసూలు చేయనున్నట్టు ఆర్టీసీ ఎండీ తెలిపారు.. ఇక, ఏపీలోని 101 శైవక్షేత్రాలకు 25 లక్షల మంది భక్తులు వస్తారనే అంచనా ఉందని.. భక్తులకు ఇబ్బంది లేకుండా ఆయా శైవక్షేత్రాల్లో తాత్కాలిక బస్‌స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు..
భారత్‌కు మరో 12 చీతాలు
భారత్‌లో 1948లో అంతరించిపోయిన చీతాలను మళ్లీ పెంచేందుకు .. మోడీ సర్కార్ నడుంబిగించింది. నమీబియా నుంచి దాదాపు పదేళ్లపాటు .. ఏటా 12 చీతాలను తీసుకొచ్చి అడవుల్లో వదిలేయాలని భావిస్తోంది. ఇందులో బాగంగా నమీబియా నుంచి ఇవాళ 12 చీతాలు భారత్‌కు రానున్నాయి. చీతాలను తెచ్చాక వాటిని ఉంచేందుకు .. మధ్యప్రదేశ్‌లోని కూనో జాతీయ పార్కులో.. 10 క్వారంటైన్ ఎన్‌క్లోజర్‌లను సిద్ధంచేశారు. ఈసారి ఏడు మగ, ఐదు ఆడ చీతాలను తీసుకొస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నమీబియా నుంచి ఇప్పటికే 8 చీతాలను తెప్పించింది. మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో ఎన్‌క్లోజర్‌లో ఉంచారు. అక్కడి వాతావరణానికి అవి అలవాటు పడ్డాక వాటిని బయటకు వదులుతున్నారు. ప్రస్తుతం ఈ 8 చీతాలు ఆరోగ్యంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఇప్పుడు మరో 12 చీతాలను సౌతాఫ్రికా నుంచి వస్తున్నాయి. సౌతాఫ్రికా, నమీబియా, బోత్స్‌వానాలో దాదాపు 7 వేల చీతాలున్నాయ్. ఇందులో నమీబియాలోనే అత్యధికంగా చీతాలున్నాయి. భారత్‌లో చీతాలు పూర్తిగా అంతరించిపోవడంతో అక్కడి నుంచి తెప్పిస్తోంది కేంద్రం ప్రభుత్వం. 1948లో చివరిసారి భారత్‌లో.. ఛత్తీస్‌గఢ్‌లోని కొరియా జిల్లాలో సల్ అడవుల్లో కనిపించింది. అప్పటి నుంచి ఏటా 12 చీతాలను దేవానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పదేళ్ల పాటు ఇదే కొనసాగుతుందని కేంద్రం తెలిపింది. నమీబియా నుంచి వచ్చిన చీతాలను మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో సంరక్షిస్తున్నారు. ఇందుకోసం కేంద్రం.. 9 మంది సభ్యులతో టాస్క్‌ఫోర్స్‌ని నియమించింది. చీతాలను సరైన విధంగా సంరక్షించుకునే బాధ్యతల్ని…ఈ టాస్క్‌ఫోర్స్ తీసుకుంది. చీతాల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించడం, క్వారంటైన్‌లో ఎలా ఉంటున్నాయో పరిశీలించడం, చీతాలకు అనుకూలమైన వాతావరణం సృష్టించటం లాంటివి చేస్తున్నారు.
బీబీసీ లావాదేవీలపై ఐటీశాఖ రిపోర్ట్.. కీలక అంశాల ప్రస్తావన
బీబీసీ ఆఫీసుల్లో ఐటీ అధికారులు జరిపిన సర్వేలో కీలక ఆధారాలు దొరికాయని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు తెలిపింది. ప్రైసింగ్ డాక్యుమెంటేషన్ బదిలీకి సంబంధించి వ్యత్యాసాలు, అవకతవకలు జరిగినట్లు ఐటీ అధికారులు గుర్తించారని పేర్కొంది. పన్ను చెల్లింపు అంశంలోనూ అక్రమాలు జరిగాయని స్పష్టం చేసింది. ఢిల్లీ, ముంబైలోని బీబీసీ ఆఫీసుల్లో దాదాపు 10 మందికిపైగా ఐటీ అధికారులు 60 గంటల పాటు సర్వే చేశారు. దీనిపై సీబీడీటీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. బీబీసీలో ఆదాయం, లాభాలు భారతదేశంలోని కార్యకలాపాల స్థాయికి అనుగుణంగా లేవని తెలిపింది. ఐటీ అధికారుల సర్వేలో ఉద్యోగుల స్టేట్‌మెంట్లు, డిజిటల్ డాక్యుమెంట్ల ద్వారా కీలక ఆధారాలు సేకరించినట్టు వెల్లడించింది. అవసరాన్ని బట్టి మరిన్ని వివరాలు సేకరిస్తామని ప్రకటించింది. ఢిల్లీ మరియు ముంబైలోని బీబీసీ కార్యాలయాలలో ఆదాయపు పన్ను శాఖ యొక్క “సర్వేలు” ముగిసిన ఒక రోజు తర్వాత, ఏజెన్సీ బ్రిటిష్ బ్రాడ్‌కాస్టర్‌పై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. బీబీసీ చూపిన ఆదాయం, లాభాలు “భారతదేశంలో కార్యకలాపాల స్థాయికి అనుగుణంగా లేవు అని పేర్కొంది.. వివిధ భారతీయ భాషలలో కంటెంట్ యొక్క గణనీయమైన వినియోగం ఉన్నప్పటికీ, వివిధ గ్రూప్ సంస్థలు చూపుతున్న ఆదాయం/లాభాలు భారతదేశంలోని కార్యకలాపాల స్థాయికి అనుగుణంగా లేవని సర్వే వెల్లడించిందని ఐటీశాఖ పేర్కొంది. సంస్థ యొక్క కార్యకలాపాలకు సంబంధించిన సాక్ష్యాలను సేకరించినట్లు ఏజెన్సీ తెలిపింది, ఇది “సమూహానికి చెందిన విదేశీ సంస్థలు భారతదేశంలోని ఆదాయంగా వెల్లడించని నిర్దిష్ట చెల్లింపులపై పన్ను చెల్లించబడలేదుఅని సూచిస్తుంది. పత్రాలు మరియు ఒప్పందాలను సమర్పించమని అడిగినప్పుడు బీబీసీ సిబ్బంది ఆలస్యం చేసే ప్రయత్నాలు చేసిందని ఆరోపించింది. సర్వే సమయంలో, ఆదాయపు పన్ను శాఖ “సెకంటెడ్ ఉద్యోగుల సేవలు ఉపయోగించబడిందని, దీని కోసం భారతీయ సంస్థ సంబంధిత విదేశీ సంస్థకు రీయింబర్స్‌మెంట్ చేసింది. అలాంటి చెల్లింపులు విత్‌హోల్డింగ్ ట్యాక్స్‌కు లోబడి ఉండవలసి ఉంటుంది. బదిలీ ధర డాక్యుమెంటేషన్‌కు సంబంధించి ఐటీ సర్వే అనేక వ్యత్యాసాలు, అసమానతలను గుర్తించింది. ఈ సర్వే ఆపరేషన్‌లో “ఉద్యోగుల స్టేట్‌మెంట్, డిజిటల్ సాక్ష్యాలు మరియు పత్రాల ద్వారా కీలకమైన సాక్ష్యాలు బయటపడ్డాయని, వాటిని తదుపరి సమయంలో పరిశీలిస్తామని” ఆదాయపు పన్ను శాఖ తెలిపింది.
చట్టాలను గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉంది.. చంద్రబాబు సైకోలా మారాడు..!
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ఆంధ్రప్రదేశ్ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ.. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు సైకోలా ప్రవర్తిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. చంద్రబాబుకు మతిస్థిమితం తప్పింది, అందుకే ప్రజలు విస్మరించారని వ్యాఖ్యానించారు.. అయితే, చట్టాలను గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉంది.. కానీ, వాటిని గౌరవించకుండా సంఘ విద్రోహ చర్యలకు నువ్వు పాల్పడుతున్నావు అంటూ చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇక, ప్రతిపక్ష పార్టీని ప్రజలు ఛీకొడుతున్నారని తెలిపారు. మరోవైపు, ప్రజాస్వామ్యంలో ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.. కానీ, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్లు వ్యవహరిస్తే మాత్రం కుదరని వార్నింగ్ ఇచ్చారు మంత్రి వేణుగోపాల కృష్ణ.
కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. సజ్జల షాడో సీఎం..!
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. వైసీపీ నెల్లూరు అధ్యక్షుడు తాటి వెంకటేశ్వర రావుతో పాటు రఘు, జావేద్‌లను అరెస్ట్ చేశారన్న ఆయన.. షాడో ముఖ్యమంత్రి సజ్జల ఆదేశాల మేరకే ఈ అరెస్టులు జరుగుతున్నాయని ఆరోపించారు.. అన్ని అంశాలు వదిలి నెల్లూరు రూరల్‌పై సజ్జల దృష్టి పెట్టారని మండిపడ్డారు.. అరెస్ట్‌లపై పోలీసులు సరైన సమాచారం ఇవ్వలేదన్నారు.. నేను వేదాయపాలెం స్టేషన్‌కు వెళ్తే.. అక్కడ వెంకటేశ్వరరావు లేకపోవడంతో పోలీసులను నిలదీశాను.. 24 గంటల్లో న్యాయస్థానంలో ప్రవేశ పెడతామని డీఎస్పీ హామీ ఇవ్వడంతో నిరసన విరమించానని తెలిపారు. ఏదేమైనా నేతల అరెస్ట్ చేసిన తీరు సరికాదని హితవుపలికారు. హైవేపై రాత్రి 11.30 గంటల వరకూ తిప్పారు.. సజ్జల ఆదేశాలను పోలీసులు అమలు చేస్తున్నారని విమర్శించారు. నన్ను మానసికంగా వేధించాలని చూస్తున్నారు.. కానీ, నా అనుచరులు ఎవరూ భయపడరు.. నా డ్రైవర్ కూడా పట్టించుకోడని వార్నింగ్ ఇచ్చారు కోటంరెడ్డి. విద్యార్థి దశలోనే ఆన్నీ చూశాను.. నోటీసులు ఇవ్వకుండా భయభ్రాంతులు గురిచేసే రీతిలో అరెస్ట్ చేయడం సరికాదని హితవుపలికారు కోటంరెడ్డి.. మరోవైపు, 24 గంటల్లోగా న్యాయస్థానంలో ప్రవేశ పెడతామని హామీ ఇచ్చి అమలు చేశారు.. ఈ విషయంలో పోలీసు యంత్రాంగానికి ధన్యవాదాలని పేర్కొన్నారు. నాతో పాటు పదకొండు మందిపై కేసు నమోదు చేశారు.. నాలుగు నెలల క్రితం జరిగిన ఘటన.. అప్పుడు కేసు కాదు.. కానీ, ఇప్పుడు మాత్రం కేసు ఎందుకు? అని నిలదీశారు. ఇదంతా ఎందుకు? నన్ను కూడా అరెస్ట్ చేయండి.. న్యాయ పోరాటం చేస్తాం అంటూ సవాల్ విసిరారు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.. ఇక, ఇవాళ మీడియాతో మాట్లాడిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..
సూర్యున్ని చూపిస్తూ కారులో కవిత.. అక్కడికి వెలుతున్న అంటూ ట్విట్
మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్‌లోని బాలబ్రహ్మేశ్వర స్వామిని ఎమ్మెల్సీ కవిత జోగులాంబ దర్శించుకున్నారు. బాలబ్రహ్మేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి చేరుకున్న కవితకు అర్చకులు స్వాగతం పలికారు. దర్శనానంతరం అర్చకులు ఎమ్మెల్సీ కవితకు వేద అనువాదాన్ని అందించారు. అధికారులు ప్రసాదాలు అందజేశారు. అయితే స్వామిని దర్శించుకునేందుకు ఎమ్మెల్సీ కవిత కారులో ఉదయం పయనమయ్యారు. ఉదయం సూర్య కిరణాలను తన మొబైల్ బంధించి కారులో ప్రయాణిం చేస్తూనే చూపిస్తూ వీడియో తీశారు. ఆ ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. సోషల్ మీడియాలో ప్రయాణం చేస్తున్న వీడియోను పోస్ట్ చేస్తూ మహా శివరాత్రి సందర్భంగా అలంపూర్ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయానికి బయలుదేరారు !! మీ అందరికీ, సంతోషం చేరుకూరాలని కోరుకుంటూ.. మహా శివ రాత్రి శుభాకాంక్షలు !! అంటూ పోస్ట్ చేశారు. సూర్య కిరణాలు తన వేలుతో చూపిస్తూ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
ఆర్సీబీ కెప్టెన్‌గా మంధానా.. ప్రకటించిన కోహ్లీ, డుప్లెసిస్
విమెన్స్ ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ టీమ్‌కు టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధానా కెప్టెన్‌గా వ్యవహరించనుంది. ఐపీఎల్ చరిత్రలో తొలిసారి నిర్వహిస్తున్న ఈ లీగ్‌లో ఐదు జట్లు పోటీపడుతుండగా ఇటీవలే ప్లేయర్ వేలం పూర్తయింది. ఈ మెగావేలంలో మంధానాను ఆర్సీబీ రూ 3.4 కోట్ల ధరకు కొనుగోలు చేసింది. తాజాగా ఆమెకు సారథ్య బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధమైంది. ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ప్రస్తుత కెప్టెన్ డుప్లెసిస్‌తో మంధాన కెప్టెన్‌గా నియమితురాలైన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది మేనేజ్‌మెంట్. స్మృతికి ఆల్ ది బెస్ట్ చెబుతూ వీరిద్దరు ఇచ్చిన సందేశానికి సంబంధించిన వీడియోను ఫ్రాంఛైజీ ట్విట్టర్‌లో షేర్ చేసింది. దీంతో ఆర్సీబీ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇక, ఈ విషయంపై స్పందించిన టీమిండియా ఓపెనర్ స్మృతి మంధానా.. ఆర్సీబీ మహిళా జట్టు కెప్టెన్‌గా ఎంపికకావడం అద్భుతమైన ఫీలింగ్ అని సంతోషం వ్యక్తం చేసింది. విరాట్, డుప్లెసిస్ సారథ్యంలో జట్టు ఇప్పటికే తామేంటో నిరూపించుకుందన్న స్మృతి.. తాను కూడా ఆర్సీబీని విజయవంతంగా ముందుకు నడిపిస్తానని పేర్కొంది. మేనేజ్‌మెంట్ తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని.. ఇందుకు అభిమానుల మద్దతు కూడా కావాలని కోరింది.
ఆ హిట్ సినిమాకి రీమేక్ అనౌన్స్ చేసిన శివన్న…
కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా సినిమా అనౌన్స్ అయ్యింది. సూపర్ స్టార్ శివన్న హీరోగా నటిస్తున్న ఈ మూవీని మహా శివరాత్రి సంధర్భంగా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ‘భైరతీ రణగళు’ అనే టైటిల్ తో శివన్న సినిమాని అనౌన్స్ చేశాడు. ఒక పోస్టర్ ని కూడా రిలీజ్ చేసిన శివన్న, ఆ పోస్టర్ లో ‘బ్లాక్ షర్ట్, బ్లాక్ లుంగీ’ కట్టుకోని కుర్చీలో కూర్చోని ఉన్నాడు. ఈ పోస్టర్ చూడగానే అందరికీ గతంలో శివన్న నటించిన ‘మఫ్టీ’ సినిమా గుర్తు రావడం గ్యారెంటీ. ఆ సినిమాలోని శివన్న లుక్ నే గోపీచంద్ మలినేని ‘వీర సింహా రెడ్డి’ సినిమాలో బాలయ్యకి పెట్టాడు. ప్రశాంత్ నీల్ శిష్యుడు నర్తన్ డైరెక్ట్ చేసిన మఫ్టీ సినిమా కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో సూపర్ హిట్ అయ్యింది. ఇందులో సాంగ్స్, యాక్షన్ ఎపిసోడ్స్, ఎలివేషన్ సీన్స్ సూపర్బ్ గా ఉంటాయి. చాలా రోజుల తర్వాత శివన్నకి కమర్షియల్ గా సూపర్ హిట్ ఇచ్చింది మఫ్టీ సినిమా. మఫ్టీ మూవీలో శివన్న టీం పేరు ‘భైరతి రణగళు’, ఈ మూవీలో శివన్నని పట్టుకోవడానికి వచ్చిన పోలిస్ గా శ్రీమురళి నటించాడు. అతని క్యారెక్టర్ కూడా చాలా మంచి పేరొచ్చింది. పర్ఫెక్ట్ కమర్షియల్ సినిమాల ఉండే మఫ్టీ సినిమాకి సీక్వెల్ గానే ‘భైరతి రణగళు’ అనౌన్స్ అయ్యింది. ఈ ఒక్క అనౌన్స్మెంట్ తో శివన్న పేరు KFIలో మారుమోగుతోంది. ఈ పాన్ ఇండియా సినిమాని శివన్న తన సొంత బ్యానర్ ‘గీత పిక్చర్స్’ ప్రొడక్షన్ నంబర్ 2గా ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఆల్రెడీ మఫ్టీ సినిమా సూపర్ హిట్ అయ్యింది కాబట్టి ఈ సీక్వెల్ పై అంచనాలు భారీగా ఉంటాయి. ఆ ఎక్స్పేక్టేషన్స్ ని నర్తన్, శివన్నలు ఎంతవరకూ అందుకుంటారో చూడాలి.
అన్నను కత్తితో పొడిచి చంపిన తమ్ముడు.. ఇంటి అద్దె చెల్లించే విషయంలో..
అద్దె చెల్లింపు విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవ తారాస్థాయికి చేరింది. నువ్వంటే నువ్వు అద్దె చెల్లించాలని ఒకరిపై మరొకరు దూషించుకున్నారు. అయితే తన చేతిలో వున్న చపాతీ కర్రతో తమ్ముడిని అన్న కొట్టాడు. దీంతో తీవ్ర ఆవేశానికి గురైన తమ్ముడు అన్నను కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి చంపేశాడు. చివరకు జైలు పాలయ్యాడు. ఈఘటన హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాగ్యనగరంలోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో హత్య తీవ్ర కలకలం రేపింది. గౌతమ్ నగర్ కమ్యూనిటీ హాల్ సమీపంలో నివస్తున్న అస్సాంకి చెందిన ఇద్దరు అన్నదమ్ములు ఉంటున్నారు. అయితే నిన్న రాత్రి ఇంటి అద్దె చెల్లించే విషయంలో ఘర్షణకు దిగారు. అన్న అంజన్ బోరాకి, తమ్ముడు రంజన్ బోరాకి మద్య గొడవ తారాస్థాయికి చేరింది. ఇంటి అద్దె విషయంలో నువ్వుంటే నువ్వు అని డబ్బులపై చిన్న మాటల ఒకరిపై మరొకరు దాడి చేసుకునేంతగా వెళ్లాయి. ఇద్దరి మధ్య ఘర్షణ పెద్దదవడంతో తమ్ముడిని చపాతీ కర్రతో అన్న కొట్టారు. దీంతో ఆవేశానికి లోనైన తమ్ముడు రంజన్ బోర అక్కడే వున్న కూరగాయల కత్తితో అన్నను కడుపులో పొడిచాడు. అన్నను కత్తితో అతికిరాతకంగా పొడివడంతో అంజన్ అక్కడికక్కడే చనిపోయాడు. ఒకతల్లికి పుట్టిన సొంత అన్ననే అనేది కూడా మరిచి కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు తమ్మడు. కత్తితో పొడవడంతో.. అన్న అంజన్, తమ్ముడు రంజన్ ని చూస్తూనే కన్ను మూశాడు. అయితే స్థానికులు ఈఘటనపై పోలీసులకు సమచారం అందించండంతో పోలీసులు హుటా హుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. విగత జీవిగా పడివున్న అంజన్ బోరా మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. తమ్ముడి రంజన్ బోరాని అదుపులో తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
మహా శివరాత్రి కానుకగా ‘శాకుంతలం’ కొత్త పోస్టర్…
లేడీ సూపర్ స్టార్ సమంతా నటించిన లేటెస్ట్ మూవీ ‘శాకుంతలం’. అభిజ్ఞాన శాకుంతలం నవల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాని గుణశేఖర్ డైరెక్ట్ చేశాడు. శకుంతల దేవి, దుష్యంత మహారాజుల కథగా రాయబడిన ఈ కథలో ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయి. వాటిని బాలన్స్ చేస్తూ గుణశేఖర్ 3Dలో శాకున్తలంస్ సినిమాని తెరకెక్కించాడు. ఈ మూవీ టీజర్, ట్రైలర్, సాంగ్స్ ని చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఫిబ్రవరి 17న సమంతా శాకుంతలం సినిమాతో పాన్ ఇండియా హిట్ కొడుతుంది అని అందరూ భావించారు. పోస్ట్ ప్రొడక్షన్ డిలే అవుతున్న కారణంగా శాకుంతలం సినిమాని ఏప్రిల్ 14కి వాయిదా వేశారు. ఇటివలే కొత్త రిలీజ్ డేట్ ని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. తాజాగా మహా శివరాత్రి పండగ సంధర్భంగా శాకుంతలం సినిమా నుంచి పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో సమంతా, శివపూజా చేస్తూ కనిపించింది.