ప్రాణం తీసిన డీజే.. భార్యతో ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన భర్త..
ఇప్పటికే ఎంతో మంది డీజే సౌండ్స్‌తో ప్రాణాలు విడిచారు.. డీజే భారీ శబ్ధాల మధ్య హుషారుగా డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి కన్నుమూస్తున్నారు.. ఇక, డీజేలకు పర్మిషన్ లేదని ఎప్పటికప్పుడు పోలీసులు స్పష్టం చేస్తున్నా.. అక్కడ ఇంకా వాడుతూనే ఉన్నారు.. తాజాగా విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో విషాదాన్ని నింపింది డీజే.. పెందుర్తిలో డీజే సౌండ్స్‌కు డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి ఓ వ్యక్తి ప్రాణాలు విడిచాడు.. దీంతో, స్థానికంగా విషాదం నెలకొంది.. దుర్గాదేవి నిమజ్జనం కార్యక్రమంలో డీజే ఏర్పాటు చేశారు.. ఈ ఉత్సవాల్లో డ్యాన్స్ చేస్తూ అక్కడికక్కడే కుప్పకూలిన త్రినాథ్ (56) అనే వ్యక్తి మృతిచెందాడు.. దుర్గాదేవి నిమజ్జనం కార్యక్రమంలో భార్యతో కలిసి ఉత్సాహంగా డ్యాన్స్ చేశాడు త్రినాథ్.. కొద్దిసేపటి తర్వాత డ్యాన్స్ చేస్తూ పక్కకు వెళ్లి నేలకొరిగాడు త్రినాథ్.. పెందుర్తి సమీపంలోని పెదగాడిలో ఈ ఘటన జరిగింది.. దీంతో, ఆ గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.. అయితే, డీజే సౌండ్‌కి ఎటువంటి అనుమతులు లేవని చెబుతున్నారు పోలీసులు.
రౌడీషీటర్‌కు 6 నెలల పాటు జిల్లా బహిష్కరణ.. కలెక్టర్ ఉత్తర్వులు..
కరుడు గట్టిన రౌడీషీటర్ కు 6 నెలల పాటు జిల్లా బహిష్కరణ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి.. జిల్లా బహిష్కరణ ఉత్తర్వుల పత్రాన్ని రౌడీషీటర్ ఎస్సీ బాబుకు అందించారు కోవెలకుంట్ల సీఐ హనుమంత నాయక్.. రౌడీషీటర్ ఎస్సీ బాబుపై వివిధ పోలీస్ స్టేషన్ లలో అనేక కేసులు ఉన్నట్లు వెల్లడించారు పోలీసులు. నంద్యాల జిల్లా సంజామల మండలం ఆల్వ కొండ కు చెందిన కరుడుగట్టిన రౌడీషీటర్ అందనం బాబు అలియాస్ ఎస్సీ బాబు (51)అనే వ్యక్తికి 6 నెలలపాటు జిల్లా బహిష్కరణ విధిస్తూ జిల్లా కలెక్టర్ రాజ కుమారి గనియా ఉత్తర్వులు జారీ చేశారు.. రౌడీషీటర్ ఎస్సీ బాబును కోవెలకుంట్ల సీఐ హనుమంత నాయక్ పోలీస్ సర్కిల్ కార్యాలయానికి పిలిపించి జిల్లా కలెక్టర్ జారీ చేసిన బహిష్కరణ ఉత్తర్వుల పత్రాన్ని అందజేశారు. ఎస్సీ బాబు తరచూ నేరాలకు పాల్పడుతూ ఆల్వ కొండ గ్రామంతో పాటు సంజామల మండలంలోని ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ తరచూ నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. రౌడీ షీటర్ ఎస్సీ బాబుపై వివిధ పోలీస్ స్టేషన్లలో అనేక కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. శాంతిభద్రలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారికైనా జిల్లా బహిష్కరణ తప్పదని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ జారీ చేసిన ఈ ఉత్తర్వుల ప్రకారం 6 నెలల వరకు రౌడీ షీటర్ ఎస్సీ బాబు జిల్లాలో అడుగు పెట్టడానికి వీలులేదని.. ఈ ఉత్తర్వులు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీసులు వెల్లడించారు.
అప్పు చేసి బైక్ కొనిచ్చిన తల్లిదండ్రులకు కడుపుకోత.. రోడ్డు ప్రమాదంలో 19 ఏళ్ల కొడుకు మృతి..
విశాఖపట్నంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహారాణిపేటలో నివాసం ఉంటున్న ఆటో డ్రైవర్ శ్రీనివాసరావు దంపతులకు హరీష్ (19) అనే కుమారుడు.. ఇంటర్ వరకు చదివిన హరీష్.. ప్రస్తుతం ఖాళీగా ఉండగా.. ఇటీవల బైక్ కావాలని ఇంట్లో అడిగాడు.. అయితే, డబ్బులు లేవని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు శ్రీనివాసరావు.. అయినా కుమారుడు వినకుండా అలిగి.. మొండిపట్టు పట్టడంతో చివరికి రూ.3లక్షలు అప్పు చేసి దసరా రోజున బైక్‌ను కొనిచ్చాడు.. ఇక, టిఫిన్ చేయడానికి ద్వారకానగర్ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్దకు స్నేహితుడు వినయ్‌తో కలిసి కొత్త బైక్ పై వెళ్లిన హరీష్.. టిఫిన్ చేసిన తర్వాత వినయ్‌ని అతడి ఇంటి వద్ద దించడానికి బయల్దేరాడు.. అసలే కొత్త బైక్ కావడంతో.. అతివేగంతో బైక్‌పై దూసుకెళ్లారు ఇద్దరు స్నేహితులు.. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి మితిమీరిన వేగంతో వెళ్తుండగా సిరిపురం దత్ ఐలాండ్ మలుపు వద్ద అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది హరీష్ బైక్.. ఈ ప్రమాదంలో హరీష్‌కు తీవ్ర గాయాలు కాగా.. అతడి స్నేహితుడు వినయ్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.. హరీష్‌ను వెంటనే 108 అంబులెన్స్‌లో కేజీహెచ్‌కు తరలించారు.. కానీ, చికిత్స పొందుకు హరీష్ మృతిచెందాడు.. వినయ్ ప్రాణాలతో బయటపడ్డాడు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై చంద్రబాబు ఫోకస్.. మద్దతు ఎవరికి..?
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిపోతున్నాయి.. ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం.. నవంబర్ 11వ తేదీన ఉప ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరగనుండగా.. నవంబర్ 14వ తేదీన కౌంటింగ్ నిర్వహించి ఫలితాన్ని ప్రకటించనున్నారు.. అయితే, ఈ నెల 13న నోటిఫికేషన్ విడుదల కానుండగా.. ఈ నెల 13 నుంచి 21వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.. 22న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు 24వ తేదీ వరకు అవకాశం కల్పించారు. అయితే, అన్ని పార్టీలు జూబ్లీహిల్స్‌పై ఫోకస్ పెట్టాయి.. ఇప్పటికే బీఆర్‌ఎస్ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత గోపీనాథ్ పేరును ప్రకటించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఇక, ఇవాళో.. రేపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు అనేది తేలిపోనుంది.. ఇంకో వైపు.. బీజేపీ కూడా తమ అభ్యర్థిని పెట్టేందుకు సమావేశాలు నిర్వహిస్తోంది.. ఇప్పుడు అనూహ్యంగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తెరపైకి వచ్చింది.. ఇవాళ తెలంగాణకు చెందిన టీడీపీ నేతలతో సమావేశం కానున్నారు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. ఈ సమావేశంలో ప్రధానంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపైనే చర్చ సాగనుంది.. దీంతో, టీడీపీ తమ అభ్యర్థిని బరిలోకి దింపనుందా? లేదు ఏ పార్టీకైనా మద్దతు పలుకుతుందా? అనేది చర్చగా మారింది.. అయితే, జూబ్లీహిల్స్ సిట్టింగ్ ఎమ్మెల్యే గోపీనాథ్ మృతిచెందిన నేపథ్యంలో ఈ ఉపఎన్నిక జరుగుతోన్న విషయం విదితమే కాగా.. మాగంటి గోపీనాథ్ టీడీపీలో గెలిచి బీఆర్ఎస్‌లోకి వెళ్లిన వ్యక్తే కావడం.. మరోసారి అదే ఫ్యామిలీకి టికెట్ ఇవ్వడంతో.. బీఆర్ఎస్ అభ్యర్థికే చంద్రబాబు మద్దతు ప్రకటిస్తారా? అనేచర్చ సాగుతోంది.. మరోవైపు, బీజేపీ కూడా అభ్యర్థిపై కసరత్తు చేస్తోన్న నేపథ్యంలో.. ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న చంద్రబాబు.. ఇక్కడ బీజేపీ వైపు మొగ్గు చూపుతారా? అనే మరో చర్చ కూడా సాగుతుంది.. మొత్తంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ స్టాండ్ పై ఈ రోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది..
గుడిసెల్లో బ్రతికే పేదలకు ఇళ్లు ఇచ్చే బాధ్యత నాది..
ఖమ్మం నగరంలో రోడ్లు, డ్రైనేజీలకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖమ్మం పట్టణం గతంలో చిన్న పంచాయతీగా ఉండేది, కేవలం 4 వేల జనాభా మాత్రమే ఉండేవాళ్లు అన్నారు. ఇక, మీ డివిజన్లను మీరే పరిశుభ్రంగా ఉంచుకోవాలి, డివిజన్ కు కావలసిన మౌలిక సదుపాయాలు కమిషనర్ అభిషేక్ అగస్త్యను సంప్రదించండి అని సూచించారు. మన కార్పొరేషన్ ను చూసి ఇతర ప్రాంతాలు నేర్చుకునేలా ఉండాలి అన్నారు. నగరం ప్రశాంతమైన వాతావరణం ఉండాలి, కక్ష్యలకు, కార్పణ్యాలకు దూరంగా ఉండాలని మంత్రి తుమ్మల కోరారు. అయితే, ఉన్నతమైన చదువులు చదివితే ఆ కుటుంబం పేదరికాన్ని వీడుతుంది అని మంత్రి నాగేశ్వరరావు తెలిపారు. నగర వాసులకు హైదరాబాద్, అమెరికా కంటే మంచి చదువు ఖమ్మం నగరానికి వస్తుంది అని భరోసా ఇచ్చారు. పోలీసులకు సూచించా పార్టీల పరంగా పోలీసులు ఎవరి పైనా కేసులు పెట్టొద్దని.. అలాగే, రోడ్ల వెడల్పు కోసం నాయకుల ఇండ్ల అయినా కొంత తీసుకోక తప్పదు అన్నారు. బైపాస్ రోడ్డు వేసినప్పుడు నన్ను తిట్టుకున్నారు, ఇప్పుడు బైపాస్ రోడ్డు కూడా జామ్ అవుతుంది.. ఇంకా రెండు మూడు వందల కోట్ల రూపాయలు సీఎం రేవంత్ రెడ్డినీ అడిగి తీసుకుని వస్తాను.. గుడిసెల్లో బ్రతికే పేదలకు ఇళ్లు ఇచ్చే బాధ్యత నాది అని హామీ ఇచ్చారు. పేదలకు మంచి చేసే విధంగా రాజకీయం ఉండాలి, ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదని తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.
రచ్చ రచ్చయిన మంత్రులు పొన్నం, అడ్లూరి ఎపిసోడ్.. పీసీసీ చీఫ్ ఎంట్రీ!
జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. మంత్రి పొన్నం వ్యాఖ్యలపై తాజాగా, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పందిస్తూ.. ఓ వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన పొరపాటును ఒప్పుకొని క్షమాపణ చెబితే పొన్నంకు గౌరవంగా ఉంటుందన్నారు. మాదిగలు అంటే మీకు అంత చిన్న చూపా, అని సీరియస్ అయ్యారు. అన్న మాటను సమర్ధించుకుని ఇప్పటి వరకు రియాక్ట్ కాకుండా ఉన్నావంటే ఈ విషయం నీ విజ్ఞతకే వదిలేస్తున్నాను అని మంత్రి అడ్లూరి పేర్కొన్నారు. సహచర మంత్రిని, ఎస్సీ సామాజిక వర్గం నేతను ఆ మాట అంటుంటే చూస్తూ ఉంటావా అని మంత్రి వివేక్ వెంకటస్వామిని మంత్రి లక్ష్మణ్ కుమార్ నిలదీశారు. ఇక, మంత్రి పొన్నం ప్రభాకర్- అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎపిసోడ్ పై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ రంగ ప్రవేశం చేశారు. ఇద్దరు మంత్రులకు ఫోన్ చేసి ఇరువురు సంయమనం పాటించాలని చెప్పినట్లు సమాచారం. అడ్లూరినీ ఉద్దేశించి పొన్నం కామెంట్స్ చేశారని ప్రచారం.. అడ్లూరిని ఉద్దేశించి మాట్లాడలేదని పొన్నం వివరణ ఇచ్చారు. పొన్నం కామెంట్స్ నీ తప్పు పట్టిన మంత్రి శ్రీధర్ బాబు.. పార్టీకి, ప్రభుత్వానికి ఇది మంచిది కాదంటూ శ్రీధర్ బాబు హితవు పలికారు.
పశ్చాత్తాపం లేదు.. గవాయ్‌పై నిందితుడు మరోసారి పరుష వ్యాఖ్యలు
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్.గవాయ్‌పై మరోసారి నిందితుడు రాకేష్ కిషోర్ పరుష వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టులో ప్రవర్తించిన తీరుకు ఏ మాత్రం పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు. పైగా తనకెలాంటి భయం లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో రాకేష్ కిషోర్ మాట్లాడుతూ.. చర్యకు ప్రతిచర్య ఉంటుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను మత్తులో ఉండి ఆ పని చేయలేదని.. తాను పూర్తిగా స్పృహలో ఉండే ఆ పని చేసినట్లు చెప్పుకొచ్చాడు. తానేమీ భయపడడం లేదని.. పైగా జరిగిన దానికి ఏ మాత్రం చింతించడం కూడా లేదని పేర్కొన్నాడు. సెప్టెంబర్ 16న మధ్యప్రదేశ్‌లో విష్ణువు విగ్రహంపై విచారణ సందర్భంగా సీజేఐ గవాయ్ ప్రవర్తించిన తీరు చాలా దారుణంగా ఉందన్నారు. పిటిషన్ విచారిస్తూ ఎగతాళి చేయడమేంటి? వెళ్లి విగ్రహాన్ని ప్రార్థించు అంటూ ఎటకారంగా మాట్లాడతారా? దేశ సనాతన ధర్మానికి సంబంధించిన విషయం వచ్చినప్పుడు ప్రవర్తించే తీరు ఇదేనా? అని ప్రశ్నించారు. దేశ సర్వోన్నత న్యాయస్థానం వ్యవహరించే తీరు ఇదేనా? గవాయ్ ఎగతాళి చేయడంతోనే తనకు కడుపు మండిందన్నారు. తాను దాడి చేసేటప్పుడు ఎలాంటి మత్తులో లేనని.. పూర్తిగా సాధారణ స్థితిలో ఉన్నట్లు చెప్పుకొచ్చాడు.
చిన్నారుల మరణాలపై సుప్రీం కోర్టులో పిల్.. దగ్గు మందుపై సీబీఐ విచారణ!
ఢిల్లీ: దేశవ్యాప్తంగా కలకలం రేపిన చిన్నారుల మరణాల ఘటనపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. అడ్వకేట్ విశాల్ తివారీ. ఆర్టికల్ 32 కింద పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ (PIL) దాఖలు చేస్తూ, డయీథిలీన్ గ్లైకాల్ (DEG) కలిగిన దగ్గుమందు వల్ల 14 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై అత్యవసర చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనలో ఉపయోగించిన దగ్గు మందులో డయీథిలీన్ గ్లైకాల్ (DEG) అనే పారిశ్రామిక విషపదార్థం ఉన్నట్లు బయటపడింది. ఇది ఔషధ తయారీలో వాడటం నిషేధిత రసాయనం అని తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఇప్పటికే తమిళనాడు ఘటనలో జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) ఇప్పటికే ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించింది. తమిళనాడు డ్రగ్ ఇన్‌స్పెక్టర్ల నివేదికలో తయారీ స్థలాల్లో అపరిశుభ్ర వాతావరణం, బ్యాచ్ నంబర్ల లోపాలు, నాణ్యత నియంత్రణ లోపాలు బయటపడ్డాయి. దేశవ్యాప్తంగా దగ్గు మందుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో, సుప్రీంకోర్టులో దాఖలైన పిల్ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.
హమాస్ ఇంకా అంతం కాలేదు.. శాంతి చర్చల వేళ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు
గాజా-ఇజ్రాయెల్ యుద్ధం మొదలై నేటితో రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. హమాస్ ఇంకా నాశనం కాలేదని.. యుద్ధం ముగించడానికి దగ్గరగా ఉన్నట్లు తెలిపారు. యుద్ధం ఎక్కడ మొదలైందో.. అక్కడే ముగుస్తోందని వ్యాఖ్యానించారు. అక్టోబరు 7న హమాస్ చేసిన దాడులతో ఇజ్రాయెల్ పనైపోయిందని అందరూ భావించారని.. కానీ ఊహించని విధంగా ఇంకా బలపడిందని నెతన్యాహు తెలిపారు. హమాస్ ఇంకా నాశనం కాలేదని.. కానీ ఆ లక్ష్యాన్ని తాము త్వరలోనే చేరుకుంటామని స్పష్టం చేశారు. అప్పుడు ఇజ్రాయెల్ మరింత బలమైన దేశంగా అవతరిస్తుందని వెల్లడించారు. ఇక ట్రంప్‌తో ఉన్న సంబంధంపై కూడా మాట్లాడుతూ… వాషింగ్టన్, న్యూయార్క్‌లను చేరుకునే ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను ఇరాన్ అభివృద్ధి చేస్తోందని.. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ ట్రంప్‌ను హెచ్చరించారు. సహజంగా ఒక దేశం తనకు తాను మొదట ప్రాధాన్యం ఇస్తుందని.. అలాగని అమెరికా ఫస్ట్ అంటే ఒక్క అమెరికానే ఉంటుందని కాదన్నారు. గ్రేట్ పవర్స్‌కు మిత్ర దేశాలు కావాలని… ఇజ్రాయెల్ అనేది యుద్ధరంగంలో పోరాడుతోన్న ఒక మిత్ర దేశం అని నెతన్యాహు పేర్కొన్నారు.
కొత్త ల్యాప్‌టాప్ కొనేటప్పుడు.. ఈ విషయాలు గుర్తుంచుకోండి..
ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ కొనేటపుడు ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ వివరాలను పూర్తిగా తెలుసుకుని కొనుగోలు చేస్తే నష్టపోకుండా ఉంటారని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. ల్యాప్‌టాప్ కొనుగోలు చేసినా లేదా స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసినా, సరైన ఆప్షన్ ను ఎలా ఎంచుకోవాలో అవగాహన కలిగి ఉండాలంటున్నారు. అన్ని గాడ్జెట్‌లు విభిన్న లక్షణాలతో వస్తాయి. ల్యాప్ టాప్ కొనాలనుకుంటే.. కొన్ని సాధారణ చిట్కాలను అనుసరించడం ద్వారా, మీరు మీ కోసం ఉత్తమ ల్యాప్‌టాప్‌ను ఎంచుకోవచ్చు. ల్యాప్‌టాప్‌ను ఎంచుకునేటప్పుడు, దాని స్క్రీన్ పరిమాణం, బరువు, CPU (ప్రాసెసర్), RAM (మెమరీ) వంటి కీలక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మీ అవసరాలకు సరైన ల్యాప్‌టాప్ ఏదో తెలుసుకోవడానికి మీరు ఆన్‌లైన్ ల్యాప్‌టాప్ ఫైండర్ సాధనాలను కూడా ఉపయోగించవచ్చు. చాలా మంది తమ ల్యాప్‌టాప్‌ల బరువు, పరిమాణాన్ని పట్టించుకోరు ఎందుకంటే దాని ప్రాసెసర్ గురించే ఆలోచిస్తుంటారు. మీరు ప్రతిరోజూ మీ ల్యాప్‌టాప్‌ను కళాశాల లేదా ఆఫీసుకు తీసుకెళ్తుంటే, దాని బరువు, పరిమాణాన్ని పరిగణనలోకి తీసుకోండి. మీ ల్యాప్‌టాప్ స్క్రీన్ పరిమాణం, బరువు చాలా కీలకం. ల్యాప్‌టాప్ స్క్రీన్‌లు సాధారణంగా 9 అంగుళాల నుండి 17 అంగుళాల వరకు ఉంటాయి. గుర్తుంచుకోండి, స్క్రీన్ పెద్దదిగా ఉంటే, ల్యాప్‌టాప్ బరువుగా ఉంటుంది. మరోవైపు, మధ్యస్థ-పరిమాణ ల్యాప్‌టాప్‌లు దీనికి విరుద్ధంగా ఉంటాయి. ఇవి తేలికైనవి, వాటిని తీసుకెళ్లడం సులభం చేస్తాయి.
టీమిండియాతో ఆడే ఆస్ట్రేలియా జట్టు ఇదే.. పాట్ కమ్మిన్స్ దూరం!
అక్టోబర్ 19వ తేదీ నుంచి భారత్ లో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు పర్యటించనుంది. ఇందులో భాగంగా ఇరు జట్లు మధ్య 3 వన్డేలు, 5 టీ20లు ఆడనున్నాయి. టీ20 మ్యాచ్‌లు అక్టోబర్ 29వ తేదీ నుంచి స్టార్ట్ కానున్నాయి. దీనికి సంబంధించి బీసీసీఐ ఇప్పటికే టీమిండియా తుది జట్టును ప్రకటించింది. తాజాగా తమ వన్డే, టీ20 స్వ్కాడ్‌ను ఆసీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. మరోవైపు, గాయం కారణంగా ఆసీస్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ ఈ సిరీస్‌కు దూరం అయ్యాడు. ఇటీవల నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా గాయపడిన మ్యాక్స్‌వెల్ కూడా అందుబాటులో లేడు. ఇక, అతడు బిగ్ బాష్ లీగ్‌తో పునరాగమనం చేసే ఛాన్స్ ఉంది. అలాగే, ఆస్ట్రేలియా వరల్డ్ కప్ 2023 నెగ్గడంలో కీలకపాత్ర పోషించిన లబుషేన్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డు జట్టు నుంచి తప్పించింది. అతడు ఫామ్‌లో లేకపోవడమే దీనికి ప్రధాన కారణం అని వెల్లడించింది.
మా మధ్య దూరం పెరగడానికి కారణం నేనే.. విడాకులపై స్పందించి అమీర్ ఖాన్
బాలీవుడ్‌లో ఒకప్పుడు ఆదర్శ జంటగా పేరుగాంచిన అమీర్ ఖాన్–కిరణ్ రావు విడిపోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. తాజాగా అమీర్ ఖాన్ తన అనుభవాన్ని నిజాయితీగా పంచుకోవడంతో, వారి బంధంలో ఉన్న సమస్యలు వెలుగులోకి వచ్చాయి. అమీర్ చెప్పిన ప్రకారం, ఒకసారి వారిద్దరి మధ్య చిన్నపాటి మనస్పర్థలు రావడంతో, తాను కిరణ్‌తో రోజుల తరబడి మాట్లాడటం మానేశారట. ఒకరోజు కాదు, రెండు రోజులు కాదు.. నాలుగు రోజుల పాటు నిశ్శబ్దంగా ఉన్నారు. కిరణ్ ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆయన స్పందించలేదని, చివరికి ఆమె కన్నీరు పెట్టుకున్నారని అమీర్ గుర్తు చేసుకున్నారు. అమీర్ తన స్వభావం గురించి చెప్పుకుంటూ.. “నాకు కోపం వస్తే నా చుట్టూ షట్టర్స్ వేసినట్టే ఫీల్ అవుతాను. అలా పూర్తిగా దూరమై పోతాను” అని తెలిపారు. కానీ ఇదే విషయమే వారి సంబంధంలో పెద్ద గ్యాప్‌కి కారణమైందని అమీర్ ఒప్పుకున్నారు. కిరణ్ పట్ల తాను ఆ సమయంలో తగ్గిపోయి, ఆమెతో మాట్లాడి సమస్యను పరిష్కరించుకోకపోవడం వల్లే ఇబ్బందులు పెరిగాయని ఆయన నిజాయితీగా చెప్పుకొచ్చారు.
మనోజ్ మంచు నెక్ట్స్ ఏంటి?
మంచు మనోజ్ నెక్ట్స్ సినిమా ఏంటనే దానిపై ఇప్పటి క్లారిటీ లేదు. యాక్షన్ డ్రామా భైరవంతో తన యాక్షన్ ఇమేజ్ ని రీక్యాప్చర్ చేశాడు మంచు మనోజ్. నారా రోహిత్, బెల్లం కొండ సాయి శ్రీనివాస్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. విజయ్ కనక మేడల తెరకెక్కించిన ఈ సినిమా అనుకున్న రేంజ్ లో సక్సెస్ కాలేక పోయినా మనోజ్ రీ ఎంట్రీ మాత్రం ఆడియెన్స్‌ని ఆకట్టుకుంది. ఈ మూవీలోని తన క్యారెక్టర్‌ని విమర్శకులు సైతం ప్రశంసించారు. ఇక రీసెంట్ గా వచ్చిన మిరాయ్ సినిమాతో మంచు మనోజ్ పాత్రకు మంచి గుర్తింపు లభించింది. కానీ ఈ సినిమాలో నెగిటివ్ రోల్ లో కనిపించాడు మనోజ్. అయితే హీరోగా మనోజ్ తరువాత సినిమాలు సిచుయేషన్ ఏంటనేది క్లారిటీ రానట్టే ఉంది. ఒకసారి ఆ సినిమాలను పరిశీలిస్తే ‘అహం బ్రహ్మస్మి’ మనోజ్ స్వయంగా ప్రొడ్యూస్ చేస్తున్న భారీ ప్రాజెక్ట్. 2020 లోనే సినిమా అనౌన్స్ చేసినా ఇంతవరకు పట్టాలెక్కలేదు. పవర్‌ఫుల్ డైలాగ్స్, హై ఇంటెన్స్ డ్రామాతో ఈ సినిమా తెరకెక్కుతోంది. కానీ ఎక్కడ వరకు వచ్చిందో ఎవరికి తెలియదు. మరోవైపు “వాట్ ద ఫిష్” మాత్రం పూర్తి కామెడీ, సస్పెన్స్‌తో యూత్‌ని ఫుల్ ఎంటర్‌్టైన్ చేయడానికి రెడీ అవుతోంది. అది కాకుండా ఇటీవల డేవిడ్ రెడ్డి అనే మరో సినిమాను ప్రకటించాడు. ఇవి కాకుండా మరికొన్ని డిస్కషన్స్ లో ఉన్నాయి. అంత గ్యాప్ తర్వాత ఇంత స్పీడ్ తో రావడం మంచి పరిణామం అయితే ఈ రాబోయే సినిమాలలో ఏ సినిమా మనోజ్ కెరీర్‌ని టర్న్ చేస్తుందో చూడాలి.
కిక్ ఇచ్చిన సినిమా మగధీర..
సినిమా ఇండస్ట్రీ ఎవరి కెరీర్ ను ఎప్పుడు ఎలా మారుస్తుందో ఎవరికీ తెలియదు. ఇక్కడ కష్టం ఎంత అవసరమో.. లక్ కూడా అంతే ఇంపార్టెంట్. అలాంటి అదృష్టాన్ని వెంట పెట్టుకొని వచ్చాడు ఒక ప్రొడ్యూసర్. కేవలం రూ.45 కి ఆర్య సినిమాను కొని ఇప్పుడు ఏకంగా వంద కోట్లతో సినిమాలు చేసే స్థాయికి ఎదిగారు. ఆ నిర్మాత మీరెవరో కాదు బన్నీవాసు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో బన్నీ వాసు అనే పేరు తెలియని వారు ఎవరు లేరు. ముఖ్యంగా మెగా, అల్లు ఫ్యామిలీలకు చాలా క్లోజ్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి పిచ్చ ఫ్యాన్. ఆయనంటే అల్లు అర్జున్ కి కూడా చాలా ఇష్టం. అందుకే తన పేరులో బన్నీని యాడ్ చేసుకున్నాడు. ఈ మధ్య కాలంలో బన్నీ వాసు నుంచి వస్తున్న సినిమాలన్నీ దాదాపు బ్లాక్ బస్టర్ అవుతున్నాయి. లిటిల్ హార్ట్స్, మహావీర్ నరసింహా, రీసెంట్ గా కాంతార: చాఫ్టర్ 1. వరుసగా సూపర్ హిట్స్ అందుకున్ని సక్సెస్ ఫుల్ నిర్మాతగా నిలిచాడు. ఇందులో భాగంగానే, తాజాగా ఆయన నుంచి వస్తున్న సినిమా ‘మిత్ర మండలి’. కామెడీ ఎంటర్టైనర్‌గా వస్తున్న ఈ మూవీ అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్స్‌లో బాగంగా ఆయన ఎన్టీవీతో ప్రత్యేకంగా ఒక పాడ్‌కాస్ట్ నిర్వహించారు. ఇందులో బన్నీ వాసు తన సినిమా ప్రయాణం గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.