పరకామణి కేసు మసిపూసి మారేడుకాయ చేశారు.. చుక్క పాలు లేకుండా నెయ్యి తయారు చేసిన ఘనత మీదే..!
టీటీడీ వ్యవహారాలపై గత ప్రభుత్వ పాలన గురించి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా హీట్ పెంచుతున్నాయి. గత ఐదేళ్ల పాలనలో జరిగిన దోపిడీలను గుర్తు చేస్తూ, పలువురు భక్తుల హృదయాలను తాకిన అంశాలపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. పరకామణి కేసును పూర్తిగా మసిపూసి మారేడుకాయ చేశారని మండిపడ్డారు.. టీటీడీలో జరిగిన పరకామణి హుండీ లెక్కింపులో భారీ దోపిడీ జరిగినా, దానిని మునుపటి ప్రభుత్వం పూర్తిగా కప్పిపుచ్చిందన్నారు. కోట్లాది మంది భక్తులు నమ్మే శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కూడా దగా జరిగిందని మండిపడ్డారు. ఏ కార్యక్రమం చూసినా “మాఫియా రాజ్యం” నడిచిందని వ్యాఖ్యానించారు. లోక్ అదాలత్ కేసులు ఎందుకు రాజీ చేసుకున్నారు..? అని నిలదీశారు ఆనం.. లోక్ అదాలత్‌లో కేసులను అనవసరంగా రాజీ చేసుకోవడం వెనుక పెద్ద లాభదాయక ఎజెండా ఉందన్నారు. పోలీసులను అదుపులో పెట్టుకొని, కేసులో ఉన్న వ్యక్తుల ఆస్తులను దోచుకున్న ఘడియలు కూడా ఉన్నాయని ఆరోపించారు. 9 డాలర్లు దోచుకున్న వ్యక్తి.. కోట్ల విలువైన ఆస్తులు ఎలా సంపాదించాడు?” అని ప్రశ్నించారు. అతని తప్పులను కప్పి, అతని ఆస్తులను ప్రభుత్వంగానే కొల్లగొట్టే పని జరిగిందని ఘాటుగా విమర్శించారు. చుక్క పాలు లేకుండా నెయ్యి తయారు చేసిన ఘనత జగన్‌ది అంటూ సెటైర్లు వేవారు ఆనం.. మంత్రి వ్యంగ్యంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. నెయ్యి ఎక్కడి నుంచి వస్తుందంటే మారుమూల ప్రాంత ముసలమ్మలు చెబుతారు.. కానీ, పాలు లేకుండానే నెయ్యి తయారు చేసే ఘనత మాత్రం జగన్‌దే!” అన్నారు. ప్రపంచమే ఈ ఫార్ములా మీద ఆశ్చర్యపోతుందని వ్యాఖ్యానించారు. ఇది టీటీడీ వ్యవస్థలను ఎలా దెబ్బతీసారో చూపించే ఉదాహరణ అని అన్నారు. దేవునినే వదల్లేకపోయిన వారు.. ప్రజలను వదిలే ప్రశ్నే లేదు అని ఆరోపించారు.. దేవదేవుడినే వదలని వారు.. సామాన్య ప్రజలను ఎలా వదిలేస్తారు? గత ప్రభుత్వ పాలనలో లక్ష కోట్లు దోచుకున్నారని విమర్శించారు.. టీటీడీ చైర్మన్ స్థానంలో జగన్ ఆత్మీయులను పెట్టడం కూడా సందేహాలకు తావిస్తుందని అన్నారు. టీటీడీ వ్యవస్థల పునర్నిర్మాణంలో ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.. ప్రస్తుతం దేవాదాయ శాఖ టీటీడీ పరిపాలనలో జరిగిన అన్యాయాలను వెలికితీయడంలో దృష్టి పెట్టిందని, భక్తుల విశ్వాసాన్ని తిరిగి స్థాపించడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి..
పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై కొత్త చర్చ..! అసలు ఉద్దేశం అదేనా..?
ఆంధ్రప్రదేశ్‌లో కూటమిలో అధినేతల స్థాయిలో కో-ఆర్డినేషన్ సజావుగానే ఉన్నా గ్రౌండ్‌లో ఆ కలసికట్టుతనం స్పష్టంగా కనిపించటం లేదు. అధినేతలు ఒక్క మాట.. ఒక్క దారి అంటున్నా, స్థానిక కార్యకర్తలు, నాయకుల మధ్య విభేదాలు, పోటీ భావాలు ఇంకా తగ్గడం లేదు. NDA ప్రభుత్వం ఏర్పడి నెలలు గడిచినా.. నియోజకవర్గం నుంచి గ్రామ స్థాయి వరకు పాత తగాదాలు అలాగే కొనసాగుతున్నాయి. ఇన్నాళ్లుగా ఇవన్నీ సహజంగానే వదిలేశారు.. కానీ, స్థానిక సంస్థల ఎన్నికల కౌంట్‌డౌన్ మొదలవడంతో ఆ సమస్యలను సెటిల్ చేయాల్సిన అవసరం పెరిగింది. దీనితో పార్టీలు తమ బలం పెంచుకుంటూనే.. స్వంత నాయకుల అసంతృప్తిని కూడా చల్లార్చే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. అలాంటి గ్యాప్‌లను పూడ్చే బాధ్యతను.. ఆరంభం నుంచే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీసుకుంటున్నారు. ఆయన ఒక అడుగు వెనక్కి వేసినా.. కూటమి రెండు అడుగులు ముందుకు రావాలని సందేశం ఇస్తున్నారు. విభేదాలు లేకుండా.. మూడు పార్టీలు కలిసి నడవాలనే పాఠాలు చెబుతున్నారు.
పల్నాడులో తల్లీకొడుకుల మృతి కలకలం.. హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరణ..?
పల్నాడు జిల్లాలో తల్లీకొడుకుల మృతి కలకలం సృష్టిస్తుంది. రొంపిచర్ల మండలం కొత్తపల్లికి చెందిన శ్రీకాంత్ ఏడు నెలల కొడుకు శరత్ కు అనారోగ్యంగా ఉండడంతో భార్య త్రివేణితో కలిసి నర్సరావుపేట ఆసుపత్రికి వచ్చారు. తిరుగు ప్రయాణంలో పాలపాడు వద్ద మేజర్ కాల్వ వద్ద బైకు స్కిడ్ అయ్యింది. దీంతో బైకుపై ఉన్న త్రివేణి కొడుకుతో సహా కాలువలో పడిపోయింది. కాలువలో పడిపోయిన భార్య, కొడుకు కోసం గాలించినా కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గల్లంతైన త్రివేణి మృతదేహాన్ని రెండు కిలోమీటర్ల దూరంలో గుర్తించారు. చిన్నారి శరత్ కోసం గాలింపులు కొనసాగిస్తున్నారు. అయితే, మృతురాలి కుటుంబ సభ్యులు మాత్రం ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య విబేధాలు ఉన్నాయని చెబుతున్నారు. త్రివేణి ఒంటిపై గాయాలు ఉన్నాయంటున్నారు. ఇద్దరిని భర్త శ్రీకాంత్ హత్యచేసి.. ప్రమాదం నాటకం ఆడుతున్నాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అమరావతిలో రెండో విడత భూ సమీకరణపై మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు..
అమరావతిలో రెండో విడత భూ సమీకరణపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి వడ్డే వడ్డే శోభనాద్రీశ్వర రావు.. అమరావతి రెండో విడత భూ సమీకరణపై రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ వేడి చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో విజయవాడలో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వర రావు, సీపీఎం నేత బాబురావు, కాంగ్రెస్ నేత తులసిరెడ్డి, సీపీఐ నేత వనజ పాల్గొన్నారు. ఈ సమావేశంలో వడ్డే శోభనాద్రీశ్వరరావు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ప్రభుత్వం ముందుగా మొదటి విడతలో తీసుకున్న భూములపై ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. 16 వేల ఎకరాలు అదనంగా తీసుకోవాలన్న నిర్ణయం ఆలోచనారాహిత్యంగా ఉంది అన్నారు. సింగపూర్ తయారు చేసిన మాస్టర్ ప్లాన్‌లో లోపాలు ఉన్నాయని పేర్కొన్నారు. అమరావతి భవిష్యత్ GDP ₹3 లక్షల కోట్లు అవుతుందని సింగపూర్ తెలిపిందేమో గానీ, ఆ అంచనాపై ప్రభుత్వం ఎప్పుడూ విమర్శనాత్మకంగా ఆలోచించలేదని విమర్శించారు.. అమరావతిలో సంపన్నమైన వ్యవసాయ భూములు నాశనం అయ్యాయని, రైతులు ప్రభుత్వాన్ని నమ్మి భూములు ఇచ్చినప్పటికీ వారి ప్రయోజనాలను కాపాడే బాధ్యతను ప్రభుత్వం నిర్వర్తించలేదని తీవ్ర విమర్శలు చేశారు వడ్డే.. మూడు ఏళ్లలో మౌలిక సదుపాయాలు అందిస్తామని అగ్రిమెంట్ చేసినా, ఇప్పటివరకు అవి అమలు కాలేదని అన్నారు. 2 వేల మందికి పైగా రైతులు ఇంకా ఫ్లాట్లు కూడా పొందలేదని పేర్కొన్నారు. కొందరికి ఇచ్చిన ఫ్లాట్లకు వెళ్లడానికి దారి కూడా లేదని విమర్శించారు.
అంగరంగ వైభవంగా అంతర్జాతీయ వేడుక.. గ్లోబల్ సదస్సుకు ప్రపంచ నేతలు..
భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 8, 9 తేదీల్లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 కు దేశ విదేశాల నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల నిపుణులు, విద్యావేత్తలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు తరలిరానున్నారు. రాష్ట్ర భవిష్యత్తును ఆవిష్కరించే దిశగా జరిగే ఈ గ్లోబల్ సమ్మిట్‌లో రెండు రోజులపాటు మొత్తం 27 ప్రత్యేక ప్యానెల్ చర్చలు జరుగుతాయి ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ, ఐటీ–సెమీకండక్టర్లు, హెల్త్, ఎడ్యుకేషన్, టూరిజం, అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, వ్యవసాయం, పరిశ్రమలు, మహిళా వ్యాపారవేత్తల ప్రోత్సాహం, గిగ్ ఎకానమీ, సామాజిక సంక్షేమం, స్టార్టప్‌లు వంటి విభిన్న రంగాలపై చర్చలు ఉంటాయి. వరల్డ్ హెల్త్ ఆర్డనైజేషన్, వరల్డ్ బ్యాంక్, ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్, యూనీసెఫ్ ప్రతినిధులతో పాటు TERI, BCG, Micron India, Hitachi Energy, O2 Power, Greenko, Apollo Hospitals, IIT Hyderabad, NASSCOM, Safran, DRDO, Skyroot, Dhruva Space, Amul, Laurus Labs, GMR, Tata Realty, Kotak Bank, Goldman Sachs, Blackstone, Deloitte, CapitaLand, Swiggy, AWS, RED.Health, PVR INOX, Sikhya Entertainment, Taj Hotels వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులు పాల్గొంటారు.
హోంగార్డులందరికీ రైజింగ్‌డే శుభాకాంక్షలు..
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హోంగార్డులందరికీ రైజింగ్‌డే శుభాకాంక్షలు తెలిపారు మజీ మంత్రి హరీష్‌రావు.. ప్రజాభద్రత, విపత్తు నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ, శాంతిభద్రతల నిర్వహణలో మీరు అందిస్తున్న సేవలు అమూల్యమని కొనియాడారు.. హోంగార్డుల సేవలను గుర్తించిన బీఆర్ఎస్ ప్రభుత్వం 2014లో రూ. 9000 గా ఉన్న వేతనాన్ని, రూ. 27,600 కు పెంచిందన్నారు. ట్రాఫిక్ లో విధులు నిర్వహించే వారికి 30% రిస్క్ అలవెన్స్ ఇచ్చింది. మహిళా హోంగార్డులకు ప్రసూతి సెలవులు ఇచ్చి ఆత్మ గౌరవం పెంచిందని తెలిపారు. కేసీఆర్.. ప్రగతి భవన్ వేదికగా హోంగార్డులతో సమావేశమై వేతనాల పెంపుతో పాటు వారి అనేక అపరిస్కృత సమస్యలకు పరిష్కారం చూపారని పేర్కొన్నారు. “విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణిస్తే కుటుంబానికి రూ.5లక్షల బీమా అందజేస్తూ, కార్యక్రమాల నిర్వహణకు ఇచ్చే 5 వేల రూపాయలను రూ.10 వేలకు పెంచారు. మొత్తంగా బీఆర్‌ఎస్ ప్రభుత్వం హోంగార్డుల వేతనాలు, ఇతర భత్యాలకు ఏడాదికి సుమారు రూ.600 కోట్లకుపైగా ఖర్చు చేయడంతో వారి కుటుంబాలు గౌరవంగా బతికాయి. కాంగ్రెస్ సర్కార్ కేవలం బీఆర్‌ఎస్ ఇచ్చిన రోజువారీ వేతనం రూ.921కి మరో 79 కలిపి మొత్తం రూ.వెయ్యి చేసి ఎంతో చేసినట్టుగా గప్పాలు కొట్టడం నయ వంచనే అవుతుంది. ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి అవి అమలు చేయకపోగా, తన వికృత చేష్టలతో హోంగార్డులను తీవ్రంగా అవమానిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 15 వేల మందికి పైగా ఉన్న హోంగార్డులతో ఎన్నో పనులు చేయించుకుంటున్న ప్రభుత్వం, పోలీసుశాఖ.. వారి సంక్షేమాన్ని మాత్రం గాలికొదిలింది. వారి బతుకులను రోడ్డు పాలు చేసింది. హోంగార్డ్ ల సమస్య లు వెంటనే పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తున్నాం..” అని మాజీ మంత్రి హరీష్‌రావు సోషల్ మీడియా పోస్ట్‌లో రాసుకొచ్చారు.
తీవ్రస్థాయిలో ‘ఇండిగో సంక్షోభం’.. వెక్కి.. వెక్కి ఏడుస్తున్న ప్రయాణికులు
విమాన ప్రయాణం అంటేనే ఎమర్జెన్సీ ఉన్నవారే బుక్ చేసుకుంటారు. ముఖ్యమైన కార్యక్రమాలు.. పెళ్లిళ్లు.. సమావేశాలకు వెళ్తుంటారు. పైగా డిసెంబర్, జనవరి సీజన్ అంటేనే ఎక్కువ ప్రయాణాలుంటాయి. ఇలాంటి ఫీక్ టైమ్‌లో విమాన సర్వీసులు ఆగిపోతే ఏ ప్రయాణికుడు జీర్ణించుకోగలడు. కొట్టేయాలన్నంత కోపం వస్తుంది. కానీ ఏం చేస్తారు.. ఎవరో చేసిన తప్పుకు సిబ్బందిని ఏం చేయలేరు కదా? ప్రస్తుతం ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులు చూసి ప్రతి ఒక్కరికి కళ్లు చెమరుస్తున్నాయి. గత ఐదు రోజులుగా ప్రయాణాలు లేక విమానాశ్రయాల్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. చాలా మంది ముఖ్యమైన ప్రయాణాలు ఆగిపోవడంతో మహిళా ప్రయాణికులు వెక్కి.. వెక్కి ఏడుస్తున్నారు. తమను పట్టించుకునే నాథుడే లేడంటూ తీవ్రమైన దు:ఖంతో ఆవేదన చెందుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇండిగో సిబ్బందిపై విదేశీ మహిళ ఆగ్రహావేశాలు.. వీడియో వైరల్
దేశ వ్యాప్తంగా తలెత్తిన ఇండిగో సంక్షోభం ఏ రేంజ్‌లో ఉందో చెప్పడానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దృశ్యాలే ఉదాహరణ. గత ఐదు రోజులుగా విమాన సర్వీసులు నిలిచిపోవడంతో విమానాశ్రయాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టించుకునే నాథుడు లేక.. ఇంకోవైపు తిండి తిప్పలు లేక.. మరో వైపు చలి తీవ్రతతో నరకయాతన పడుతున్నారు. దేశీయ ప్రయాణికులతో పాటు విదేశీ ప్రయాణికులు కూడా తీవ్ర కష్టాలు పడుతున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ఆఫ్రికన్ ప్రయాణికురాలికి కోపం కట్టలు తెచ్చుకుంది. విమాన సిబ్బందిపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇండిగో సంక్షోభం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇదే ఉదాహరణ. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఇండిగో సిబ్బందితో ఆఫ్రికన్ ప్రయాణికురాలు గొడవకు దిగింది. తాను వెళ్లాల్సిన విమానం ఎందుకు రద్దైందో చెప్పాలంటూ డిమాండ్ చేసింది. సరైన సమాధానం రాకపోవడంతో ఇండిగో కౌంటర్ ఎక్కి ఘర్షణకు దిగింది. తనకు న్యాయం చేయాలంటూ పెద్ద పెద్దగా కేకలు వేసింది. ఆమె తీరు చూసిన సిబ్బంది చేతులెత్తేశారు. ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
బ్రెజిల్‌లో తప్పిన ఘోర విమాన ప్రమాదం.. టేకాఫ్ అవుతుండగా పెద్ద ఎత్తున మంటలు
బ్రెజిల్‌లో ఘోర విమాన ప్రమాదం తప్పింది. సావోపాలోలోని గ్వారుల్హోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 180 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న విమానం టేకాఫ్ అవుతుండగా ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. దీంతో ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది వెంటనే అప్రమత్తం అయి మంటలు అదుపు చేశారు. దీంతో ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించేశారు. ప్రాణాలతో బయటపడడంతో ఊపిరి పీల్చుకున్నారు. అకస్మాత్తుగా క్యాబిన్ నుంచి మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు. కిటికీలు, రెక్కల క్రింద నుంచి మంటలు చెలరేగాయిని.. ప్రయాణికులు చూసి అప్రమత్తం అయినట్లు అధికారులు వెల్లడించారు. వెంటనే ఎయిర్‌పోర్టు సిబ్బంది అప్రమత్తమై ప్రయాణికులను సురక్షితంగా దించేసినట్లు చెప్పారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అందులో విమానం నుంచి పెద్ద ఎత్తున అగ్నికీలలు ఎగిసిపడుతున్నట్లు కనిపించింది. దట్టంగా పొగ కమ్ముకుంది. ఇక ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి పంపించారు.
నెట్‌ఫ్లిక్స్ చేతికి వార్నర్ బ్రదర్స్.. ఏకంగా రూ. ఆరున్నర లక్షల కోట్ల భారీ డీల్..!
ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో కీలక ఒప్పందం జరిగింది. వార్నర్ బ్రదర్స్ డిస్కవరీకి చెందిన టీవీ, ఫిల్మ్ స్టూడియోలు, స్ట్రీమింగ్ విభాగాన్ని కొనేందుకు నెట్‌ఫ్లిక్స్ సిద్ధమైంది. ఏకంగా బిలియన్ డాలర్లకు (సుమారు రూ.6.47 లక్షల కోట్లు)కొనుగోలు చేసేందుకు నెట్‌ఫ్లిక్స్ అంగీకరించింది. ఇప్పటికే.. నెట్‌ఫ్లిక్స్ ప్రపంచంలో అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ గా కొనసాగుతోంది. తాజాగా మరో అడుగు ముందుకు వేసిన నెట్‌ఫ్లిక్స్ ప్రపంచంలోనే పురాతన స్టూడియోలు కలిగిన వార్నర్ బ్రదర్స్ డిస్కవరీని భారీ డీల్‌తో హస్తగతం చేసుకుంది! ఒక్కో వార్నర్ బ్రదర్స్ షేరుకు 27.75 డాలర్లు చెల్లించేందుకు నెట్‌ఫ్లిక్స్ (Netflix) బిడ్ వేసినట్లు రాయిటార్స్ నివేదించింది. సీఎన్‌ఎన్, టీబీఎస్, టీఎన్‌టీ వంటి కేబుల్ ఛానళ్లలో ప్రారంభించిన మార్పుల ప్రక్రియను వార్నర్ బ్రదర్స్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే కొనుగోలు ప్రక్రియ పూర్తవుతుందని నివేదిక వెల్లడించింది. మరోవైపు.. బోకె క్యాపిటల్ పార్టనర్స్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ కిమ్ ఫారెస్ట్ ఈ అంశంపై మాట్లాడుతూ.. నెట్‌ఫ్లిక్స్ విజేత బిడ్డర్‌గా అవతరించడం ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. నెట్‌ఫ్లిక్స్ బలమైన డొమైన్ అయిన స్ట్రీమింగ్ వ్యాపారంపై దృష్టి సారిస్తున్నందున ఇది సాధ్యమైందని తెలిపారు. అయితే, ఈ ఒప్పందం అమెరికాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నియంత్రణ సంస్థల నుంచి తీవ్ర పరిశీలనను ఎదుర్కోవలసి ఉంటుందని ఆమె హెచ్చరించారు.
ఆదేశాలు పాటిస్తారు.. సిబ్బందిని తిట్టడం కరెక్ట్ కాదు.. ఇండిగో సంక్షోభంపై సోను సూద్ సందేశం
దేశ వ్యాప్తంగా నెలకొన్న ఇండిగో సంక్షోభం అందరికీ తెలిసిందే. గత ఐదు రోజులుగా ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులు వర్ణించలేనివి. తిండి తిప్పలు లేకుండా ఎయిర్‌పోర్టుల్లో నరకయాతన పడుతున్నారు. ఇదేం దుస్థితి బాబోయ్ అంటూ గగ్గోలు పెడుతున్నారు. ఇంకొందరైతే సోషల్ మీడియా వేదికగా ఎయిర్‌లైన్ సంస్థ సిబ్బందిపై తీవ్ర ఆగ్రహావేషాలు వ్యక్తం చేస్తున్నారు. బండ బూతులు తిడుతున్నారు. చెత్త ఎయిర్‌లైన్స్ అంటూ ఎవరికి తోచినట్లుగా దుమ్మెత్తిపోస్తున్నారు. తాజాగా విమానయాన శాఖ రంగంలోకి దిగిన పరిస్థితులు ఇంకా చక్కబడలేదు. ఇదిలా ఉంటే ఇండిగో సంక్షోభంపై ప్రముఖ సినీ నటుడు సోను సూద్ ఎక్స్‌లో కీలక పోస్ట్ చేశారు. దయ చేసి నిరాశ చెందిన ప్రయాణికులు.. ఇండిగో సిబ్బందితో మంచిగా వ్యవహరించాలని కోరారు. పై ఆదేశాల ప్రకారం ప్రవర్తించే సిబ్బందిని తిట్టడం ఏ మాత్రం భావ్యం కాదని సూచించారు. ప్రస్తుతం వారంతా నిస్సహాయంగా ఉన్నారని… శక్తిహీనులైన వారి పట్ల మర్యాదగా వ్యవహరించాలని ప్రయాణికులకు సోను సూద్ విజ్ఞప్తి చేశారు. సిబ్బందితో దూకుడుగా వ్యవహరిస్తున్న తీరు బాధాకరంగా ఉందని పేర్కొన్నారు. తన కుటుంబానికి చెందిన వారు కూడా 5 గంటలు వేచి ఉన్నాకే విమానం వచ్చిందని.. చివరికి గమ్యస్థానానికి చేరుకున్నారని గుర్తుచేశారు. చాలా మంది ప్రయాణికులు వివాహాలకు హాజరు కాలేకపోయారని.. సమావేశాలు.. ముఖ్యమైన పనులు మానుకున్నారని తెలుసు అన్నారు. అయితే సిబ్బంది.. ఎయిర్‌లైన్స్ ఆదేశాలు పాటిస్తారని.. అలాంటిది వారి మీద అరవడం ఏ మాత్రం బాగోలేదని.. ఈ తీరు బాధ కలిగిస్తుందని చెప్పుకొచ్చారు. విమానాలు ఎప్పుడు బయల్దేరతాయో వారికి తెలియదు.. అలాంటప్పుడు వారి మీద ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడం ఎంత వరకు కరెక్ట్ అని సోను సూద్ పేర్కొ్న్నారు. ఎప్పుడూ చిరునవ్వుతో పలకరించే సిబ్బందితో ఇలా వ్యవహారించకండి అని కోరారు. దయ చేసి వారిని గౌరవించండి అని సోను సూద్ వీడియో సందేశంలో వేడుకున్నారు.