ఏపీతో సంబంధాలపై సింగపూర్ మంత్రి కీలక ప్రకటన..
ఆంధ్రప్రదేశ్‌తో.. ముఖ్యంగా రాజధాని అమరావతి అభివృద్ధిలో సింగపూర్ భాగస్వామ్యం ఉంటుందా?.. లేదా? అనే ఉత్కంఠకు తెరపడినట్టు అయ్యింది.. సింగపూర్‌తో సంబంధాలు బలోపేతమే లక్ష్యంగా పర్యటిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో కీలక ప్రకటన చేశారు.. ఆ దేశ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ మంత్రి టాన్సీ లెంగ్.. సింగపూర్ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు సింగపూర్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ మంత్రి.. ఈ సందర్భంగా కీలక ప్రకటన చేస్తూ.. ఏపీ, అమరావతి అభివృద్ధిలో సింగపూర్ భాగస్వామ్యం కొనసాగుతుందని తెలిపారు టాన్సీ లెంగ్.. సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన ఫలప్రదం కావాలని ఆకాంక్షించారు.. భారత్ లో అత్యంత వేగంగా ఎదుగుతున్న రాష్ట్రాల్లో ఒకటైన ఏపీలో పెట్టుబడులు, కార్యకలాపాల విస్తరణకు సింగపూర్ కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయని వెల్లడించారు.. పోర్టులు, గ్రీన్ ఎనర్జీ, డిజిటల్ టెక్నాలజీ , నైపుణ్యాభివృద్ధి రంగాల్లో పెట్టుబడులపై సీఎం చంద్రబాబుతో చర్చించినట్టు సింగపూర్ మంత్రి టాన్ సీ లెంగ్ ప్రకటించారు..
అదానీకి షాక్..! ఆ ప్లాంట్లు రద్దు చేసిన ఏపీ సర్కార్..
అదానీ గ్రూప్‌కు కేటాయింపులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం.. అదానీ గ్రూప్ కు ఇచ్చిన పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్లు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.. ఆంధ్రా – ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో అదాని గ్రూప్‌నకు పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్లు ఇచ్చింది గత వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. అయితే, గిరిజనులకు దక్కాల్సిన ప్లాంట్లు అదానీ గ్రూప్ కు ఇవ్వడంతో వెనక్కు తీసుకుంది కూటమి సర్కార్.. మరోవైపు, తమ ప్రాంతానికి చెందిన గిరిజనులతో ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపింది ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం.. అయినా, గత ప్రభుత్వం అదానీ గ్రూప్ కు పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్లను ఇవ్వగా.. వాటిని ఇప్పుడు రద్దు చేసింది కూటమి ప్రభుత్వం..
వైఎస్ జగన్‌కు భారీ ఊరట.. విజయమ్మ, షర్మిలకు షాక్..!
నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (NCLT)లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి ఊరట దక్కింది.. జగన్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు అనుమతించింది NCLT.. సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్ షేర్ల బదిలీని నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.. కంపెనీ షేర్లను విజయమ్మ, షర్మిల అక్రమంగా బదిలీ చేసుకున్నారంటూ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు వైఎస్ జగన్… వైఎస్ విజయమ్మతో పాటు వైఎస్ షర్మిల, సండూర్ పవర్ లిమిటెడ్, రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్‌ను ప్రతివాదులుగా పేర్కొన్నారు.. ఇప్పటికే వాదనలు పూర్తి చేసిన NCLT.. ఈ రోజు వైఎస్ జగన్‌కు అనుకూలంగా తీర్పును ఇస్తూ సరస్వతీ పవర్ షేర్ల బదిలీని నిలుపుదల చేసింది.. మొత్తంగా.. ‘సరస్వతి’ షేర్ల బదిలీ అక్రమమే అని పేర్కొంది NCLT.. షేర్ల బదిలీని నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన నేషనల్ కంపెనీ ఆఫ్ లా ట్రిబ్యునల్.. అక్రమంగా షేర్లు బదిలీ చేసుకున్న వారికి ట్రిబ్యునల్ షాక్ ఇచ్చింది.. సీబీఐ, ఈడీ కేసులు విచారణలో ఉండగా షేర్ల బదిలీ సాధ్యం కాదని స్పష్టం చేసింది బెంచ్.. తన పేరుపై, వైఎస్ భారతి పేర్లపై సరస్వతి కంపెనీలోని షేర్లను తల్లి విజయమ్మ ద్వారా చెల్లలు షర్మిల అక్రమంగా బదిలీ చేసుకున్నారని ఎన్సీఎల్‌టీలో 2024, సెప్టెంబర్‌లో వైఎస్ జగన్ పిటిషన్ వేశారు.. కనీసం తమ సంతకాలు లేకుండా షేర్ల బదిలీ జరిగిందని పేర్కొన్నారు.. కంపెనీ యాక్ట్ 59 కింద దాఖలు చేసిన ఈ పిటిషన్‌లో ప్రతివాదులుగా విజయమ్మ, షర్మిల, జనార్థన్ రెడ్డి, యశ్వంత్‌రెడ్డి, రీజినల్ డైరెక్టర్ సౌత్ ఈస్ట్ రీజియనల్ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ ను చేస్తూ.. షేర్ల బదిలీని నిలుపుదల చేస్తూ ఆదేశాలివ్వాలని ట్రిబ్యునల్‌ను విజ్ఞప్తి చేశారు.. 10 నెలలుగా అన్ని పక్షాల వాదనలు విని ఈ నెల 15న తీర్పు రిజర్వు చేసిన బెంచ్.. షేర్ల బదిలీ నిలిపివేస్తూ ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది నేషనల్ కంపెనీ ఆఫ్ లా ట్రిబ్యునల్..
ఏపీ ప్రజల తరపున సింగపూర్ ప్రభుత్వానికి థాంక్స్ చెప్పిన సీఎం..
సింగపూర్ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున థాంక్స్ చెప్పారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఏపీ, అమరావతి అభివృద్ధిలో సింగపూర్ ప్రభుత్వం భాగస్వామ్యం అవుతుంది అంటూ ఆ దేశ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ మంత్రి టాన్సీ లెంగ్ ప్రకటించడంపై ఆనందాన్ని వ్యక్తం చేసిన ఆయన.. సోషల్ మీడియా వేదికగా.. వివిధ అభివృద్ది ప్రాజెక్టుల్లో ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు సిద్ధమన్న సింగపూర్ మంత్రి టాన్సీ లెంగ్ ప్రకటనకు ధన్యవాదాలు తెలిపారు.. ఎక్స్ వేదికగా సింగపూర్ మంత్రికి ధన్యవాదాలు తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఏపీ ప్రజల తరపున సింగపూర్ ప్రభుత్వానికి.. మంత్రి టాన్సీ లెంగ్ కు ధన్యవాదాలు చెప్పారు.. ఏపీ సుస్థిరాభివృద్ధి కోసం ఏపీ ప్రభుత్వంతో భాగస్వామిగా ఉండడానికి సింగపూర్ ప్రభుత్వం ముందుకు రావడం సంతోషం.. వివిధ రంగాల్లో ఏపీ-సింగపూర్ కలిసి పని చేయడానికి టాన్సీ లెంగ్ తో జరిపిన చర్చలు బాటలు వేశాయని పేర్కొన్నారు చంద్రబాబు. అగ్రీ-ఫుడ్, ఉత్పాదక రంగం, రెన్యూవబుల్ ఎనర్జీ, పోర్టులు, డిజిటల్, ఇన్నోవేషన్, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో కలిసి పని చేసేందుకు ఈ చర్చలు దోహదపడతాయి. 90వ దశకం నుంచి సింగపూర్ ప్రభుత్వంతో మాకు సత్సంబంధాలు ఉన్నాయి. ఏపీ అభివృద్ధిలో సింగపూర్ భాగస్వామ్యం చాలా విలువైనది అని తెలిపారు.. ఏపీ అభివృద్ధి ప్రయాణంలో.. ఆధునిక మౌళిక వసతుల కల్పనలో సింగపూర్ ప్రభుత్వం నుంచి చక్కటి సహకారం అభిలషిస్తున్నాం. కొన్ని పరిణామాల వల్ల సింగపూర్ భాగస్వామ్యంతో చేసే అభివృద్ధి ప్రయాణంలో కొంత ఇబ్బంది వచ్చింది. ఇప్పుడు ఏపీలో ప్రజలు ఇచ్చిన ప్రజా తీర్పుతో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి సంకల్పం తీసుకున్నాం అన్నారు..
ఏఐ సింగపూర్‌కు చంద్రబాబు ఆహ్వానం.. ఏపీలో ఏఐ రీసెర్చ్, ఇన్నోవేషన్ సెంటర్లకు సహకరించండి
ఆంధ్రప్రదేశ్‌ని ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ హబ్‌గా అభివృద్ధి చేయాలని దృఢ నిశ్చయంతో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. తన సింగపూర్ పర్యటనలో ఇందుకోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పర్యటన 3వ రోజైన మంగళవారం ఏఐ సింగపూర్ సంస్థ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ మోహన్ కంకణవల్లితో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఏఐ పరిశోధన, ఇన్నోవేషన్ సెంటర్ల ఏర్పాటుకు సహకారం అందించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలతో ఏఐ సింగపూర్ భాగస్వామ్యంగా పని చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం అన్నారు. రాష్ట్రంలోని విద్యార్థులకు ఏఐ శిక్షణా కార్యక్రమాలు, ఎక్స్‌చేంజ్ ప్రోగ్రాములు, స్కిల్ డెవలప్‌మెంట్ మాడ్యూల్స్ అమలు చేయాలని సీఎం ప్రతిపాదించారు. ముఖ్యంగా వైద్యం, వ్యవసాయం, విద్య, పౌర సేవల విషయంలో ఏఐ వినియోగంపై ఇరువురి మధ్య చర్చలు జరిగాయి. టెక్నాలజీ ప్రమోషన్, డీప్ టెక్, ఏఐ రంగంలో ప్రస్తుతం ఉన్న అవకాశాలపైనా చంద్రబాబు-కంకణవల్లి మధ్య చర్చ జరిగింది.
ఎన్ పెద్దిరాజు వర్సెస్ రేవంత్ రెడ్డి కేసు.. సుప్రీంకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట
సుప్రీంకోర్టులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఊరట లభించింది. రేవంత్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టాడు ఎన్ పెద్దిరాజు. ఈ కేసులో ఇప్పటికే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేవంటూ పిటిషన్ ను క్వాష్ చేసిన తెలంగాణ హైకోర్టు. హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాలు చేశాడు ఎన్ పెద్దిరాజు. అతడు వేసిన పిటిషన్ ను డిస్మిస్ చేసింది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం. ఎన్ పెద్దిరాజుతోపాటు, ఆయన అడ్వకేట్ రితేష్ పాటిల్ కు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బి ఆర్ గవాయ్ పిటీషనర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. తదుపరి విచారణకు పిటిషనర్ అండ్ పెద్దిరాజు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని సిజేఐ ఆదేశించారు. పిటిషనర్ తరపు న్యాయవాది రితీష్ పాటిల్ కోర్టు సాక్షిగా క్షమాపణ కోరాడు. కేసు విత్ డ్రా చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషనర్ తరపు న్యాయవాది రితీష్ పాటిల్ కోరాడు. కోర్టు ధిక్కరణ కింద ఎందుకు చర్యలు తీసుకోవద్దంటూ ప్రశ్నించారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. కోర్టు ధిక్కరణ నోటీస్ పై వ్రాత పూర్వక సమాధానం ఇవ్వాలని ఆదేశించింది సుప్రీం కోర్టు. సమాధానం ఆమోదయోగ్యంగా ఉంటేనే కోర్టు పరిగణనలోకి తీసుకుంటుంది అని తెలపింది. తదుపరి విచారణ ఆగస్టు 11 కు వాయిదా వేసింది.
నేటి నుంచి బొగత జలపాతం సందర్శనకు పర్యాటకులకు అనుమతి..
ములుగు జిల్లా వాజేడు మండలంలోని చీకుపల్లి గ్రామం శివారులో ఉన్న బొగత జలపాతం పర్యాటకులను అట్రాక్ట్ చేస్తోంది. ఇటీవల భారీగా కురిసిన వర్షాలకు బొగత జలాపాతం పరవళ్లు తొక్కుతోంది. జలసవ్వడులు మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నేటి నుంచి బొగత జలపాతం సందర్శనకు పర్యటకులకి అనుమతి ఇచ్చారు అధికారులు. ములుగు జిల్లా వాజేడు మండలం బోగత జలపాతం సందర్శనకు పర్యాటకులను షరతులతో కూడిన అనుమతులు ఇచ్చారు అటవీ అధికారులు. గత 10 రోజులుగా ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాలకు బొగత జలపాతం ఉగ్రరూపం దాల్చి ప్రమాద స్థాయిని దాటి ప్రవహించడంతో పర్యాటకుల భద్రత దృష్ట్యా అనుమతి నిరాకరించారు. నిన్నటి నుంచి జలత ప్రవాహం కొద్దిగా తగ్గు ముఖం పట్టడంతో జలపాతం సందర్శనకు అనుమతులు ఇచ్చారు అధికారులు. కానీ ఏ సమయంలో ప్రవాహం పెరుగుతోందో తెలియనందున నీటి కొలనులోకి పర్యాటకుల అనుమతి నిరాకరించారు అధికారులు.
ప్రభుత్వంలో ముసలం.. సిద్ధరామయ్య సమావేశాలకు డీకే.శివకుమార్ దూరం!
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో ముసలం మొదలైనట్లుగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి మార్పిడిపై సిద్ధరామయ్య-డీకే.శివకుమార్ వర్గీయుల మధ్య కొద్ది రోజులుగా ఘర్షణ జరుగుతోంది. ఈ ఘర్షణ చివరికి హస్తినకు కూడా చేరింది. రెండు వర్గాలకు చెందిన అధికారులు ఢిల్లీలో కొట్టుకునే స్థాయికి వెళ్లింది. ఈ వ్యవహారం హైకమాండ్ పెద్దల దృష్టికి కూడా వెళ్లినట్లు సమాచారం. తాజాగా సిద్ధరామయ్య సమావేశాలకు డీకే.శివకుమార్ దూరం జరిగినట్లుగా తెలుస్తోంది. అనారోగ్యమా? లేదంటే కావాలనే పక్కన పెట్టారా? అనేది తేలాల్సి ఉంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సమావేశం ఏర్పాటు చేసి రూ.50 కోట్ల నియోజకవర్గ గ్రాంట్లపై చర్చించారు. ఎమ్మెల్యేలంతా హాజరు గానీ.. ఈ సమావేశానికి శివకుమార్ మాత్రం హాజరు కాలేదు. ఉద్దేశ పూర్వకంగానే డీకే.శివకుమార్‌ను పక్కన పెట్టారా? లేదంటే సిద్ధరామయ్యతో సంబంధాలు దెబ్బతిన్నాయా? అనే చర్చలు పార్టీ వర్గాల్లో నడుస్తున్నాయి.
ఆ మాటే కేంద్ర పెద్దలకు కోపం తెప్పించింది.. ధన్‌ఖర్ రాజీనామా మిస్టరీ ఇదే!
జగదీప్ ధన్‌ఖర్.. జూలై 21 సాయంత్రం వరకు భారతదేశ ఉపరాష్ట్రపతి. ఆరోజే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇక రాజ్యసభలో ధన్‌ఖర్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. అందరితో కులాసాగానే మాట్లాడారు. కానీ కొన్ని నిమిషాల్లోనే పరిణామాలు తల్లకిందులయ్యాయి. ధన్‌ఖర్ వ్యతిరేకంగా కేంద్ర పెద్దలు ప్రణాళికలు రచించారు. అయితే ముప్పు ముందే గ్రహించి.. ధన్‌ఖర్ అనూహ్యంగా తప్పుకున్నారు. అనారోగ్యం పేరుతో ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తున్నట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ పంపించారు. ఇంత సడన్‌గా రాజీనామా చేయడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. దీని వెనుక చాలా కథే ఉందంటూ గుసగుసలాడారు. తాజాగా రాజీనామా వెనుక ఉన్న మిస్టరీ వీడింది.
ఈ పెద్దోళ్లున్నారే.. మునిమనవడిని చూడాలని నానమ్మ కోరిక.. మనుమరాలి పెళ్లికి ఏర్పాట్లు.. కట్ చేస్తే..
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం అని ప్రభుత్వాలు అవగాహన కల్పిస్తున్నప్పటికీ కొందరు మాత్రం మారడం లేదు. ఇంట్లో ఉన్న తాతయ్యలు, నానమ్మ, అమ్మమ్మలు తమ మనుమరాలు, మనువడి పెళ్లి చూసి చనిపోవాలి అని తమ కోరికలను వెలిబుచ్చుతుంటారు. వాళ్ల కోరికలను కాదనలేక పిల్లలకు పెళ్లి చేసేందుకు రెడీ అవుతుంటారు. ఇదే తరహాలో హర్యానాలో ఓ నానమ్మ మునిమనవడిని చూడాలనే కోరకతో తన మనుమరాలికి పెళ్లి చేయాలని చూసింది. కానీ ఆ అమ్మాయి మైనర్ కావడంతో పెళ్లికి బ్రేకులు పడ్డాయి. అధికారుల ఎంట్రీతో వివాహం రద్దైంది. జాతల్ రోడ్‌లోని రాధా కృష్ణ ఆలయంలో జరుగుతున్న ఒక టీనేజర్ నిశ్చితార్థాన్ని సోమవారం మహిళా, శిశు రక్షణ, బాల్య వివాహ నిషేధ అధికారి రజని గుప్తా అడ్డుకున్నారు. ఆ టీనేజర్ నిశ్చితార్థం ఆమె నానమ్మ అనుమతితో జరిగింది. నానమ్మ అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమె చివరి కోరిక తన మునిమనవడిని చూడడమే. అందుకే ఆ టీనేజర్ నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేశారు. నిశ్చితార్థం ఆగిపోయింది. ఇరువైపుల నుంచి అఫిడవిట్లు కూడా తీసుకున్నారు. దీనిలో ఆ టీనేజర్ మేజర్ అయ్యే వరకు వివాహం చేసుకోదని హామీ ఇచ్చారు.
వార్ 2 కోసం రంగంలోకి ‘బ్రహ్మాస్త్ర’ టీమ్.. ఎందుకంటే?
అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలోని కేసరియా అనే పాట దేశాన్ని ఊపేసింది. మరోసారి అయాన్ తన టీంను ‘వార్ 2’ కోసం రంగంలోకి దించారు. అయాన్ ప్రస్తుతం ‘వార్ 2’ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇండియన్ ఐకానిక్ స్టార్లైన హృతిక్ రోషన్, ఎన్టీఆర్, కియారా అద్వానీ కాంబోలో ‘వార్ 2’ సినిమాని యష్ రాజ్ ఫిల్మ్స్ భారీ ఎత్తున నిర్మించింది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఇప్పటికే సోషల్ మీడియాలో సునామీని సృష్టిస్తోంది. ఇక తాజాగా ఈ మూవీలోని ఓ డ్యూయెట్ సాంగ్ అప్డేట్ వచ్చేసింది. హృతిక్, కియారా మీద చిత్రీకరించే ఈ పాట కోసం తన బ్లాక్ బస్టర్ సినిమా బ్రహ్మాస్త్ర లోని కేసరియా సంగీత బృందాన్ని రంగంలోకి దించారు అయాన్ ముఖర్జీ . ‘వార్ 2’లోని ఈ యుగళ గీతం కోసం ప్రీతమ్, అరిజిత్ సింగ్, అమితాబ్ భట్టాచార్య మళ్ళీ ఒకే చోటకు చేరారు. త్వరలోనే ఈ పాటను సోషల్ మీడియాలో రిలీజ్ చేసి మరింత హైప్ పెంచాలని చిత్రయూనిట్ భావిస్తోంది. ‘వార్ 2’లో హృతిక్, కియారా పాత్ర మధ్య ప్రేమను చూపించే అందమైన ట్రాక్‌గా ఈ పాటను కంపోజ్ చేస్తున్నారట. ఇక ఇదే ‘వార్ 2’ నుంచి వచ్చే మొదటి పాట.హై అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన థియేట్రికల్ యాక్షన్ ప్యాక్డ్ ‘వార్ 2’ ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళ భాషలలో థియేటర్లలో విడుదల కానుంది. తెలుగులో ఈ సినిమా హక్కులను టాలీవుడ్ బడా నిర్మాత సితార ఎంటర్టైన్మెంట్స్ నాగ వంశి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
పాన్ ఇండియా మోజులో కన్నడ హీరోలు.. రిలీజ్ కు రెండు భారీ సినిమాలు
KGF సిరీస్‌తో కన్నడ ఇండస్ట్రీకి అసలైన పాన్-ఇండియా రేంజ్ తెచ్చాడు యష్. ఆ తరువాత రిషబ్ శెట్టి కాంతారా సినిమాతో కల్చర్‌తో పాటు క్లాస్‌ని చూపించాడు. వీళ్లిద్దరూ తక్కువ బడ్జెట్ సినిమాలతో భారీగా కలెక్షన్లు కొల్లగొట్టారు. దాంతో కన్నడ సినీ మార్కెట్ కు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఇప్పుడు, వీళ్ల ట్రాక్‌ను ఫాలో అవుతూ అదే స్థాయికి చేరే ప్రయత్నంలో ఉన్నవారిలో చార్లీ ఫేమ్ రక్షిత్ శెట్టి ఒకరు. ధృవ సర్జా – కన్నడ మాస్ హీరో ఇప్పుడు K.D: The Devil తో పాన్ ఇండియా స్టేజ్‌కు ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడు. ఈ సినిమా కేవలం యాక్షన్ ఎంటర్‌టైనర్ కాదు, ఇది మాస్ ఫ్యాన్స్‌కు పండగలా ఉంటుంది. సంజయ్ దత్ విలన్‌గా మరోసారి ఫుల్ స్వింగ్‌లో కనిపించనున్నాడు. ఈ కాంబినేషన్ చూసి యష్ ఫాలోవర్స్ చాలామంది ఈ చిత్రాన్ని ‘Next KGF Vibe’ అంటున్నారు. మూవీ రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్ కాకపోయినా, హైప్ మాత్రం ఆకాశాన్నంటుతోంది. గణేష్ నటించిన పినాక పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కు రెడీ ఆవుతోంది. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఈ సినిమాను భారీ బడ్జెట్ పై నిర్మిస్తోంది. కన్నడ నుంచి పాన్ ఇండియా దూకుడు దూకుడు స్టార్ట్ అయింది “KGF” సిరీస్ ద్వారా యశ్, “కాంతార” ద్వారా రిషబ్ శెట్టి తర్వాత కన్నడ స్టార్స్‌కు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఇప్పుడు గణేష్ పినాక మరియు ధ్రువ సర్జా కె.డి. సిద్దం అవుతున్నాయి. రెండు సినిమాల మధ్య కంపారిజన్ కూడా గట్టిగానే ఉంది. మరి ఈ ఇద్దరిలో ఎవరు పాన్ ఇండియా హిట్ కొడతారో.
‘సతీ లీలావతి’ టీజర్ రిలీజ్..
అందాల నటి లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా రొమాంటిక్ కామెడీ చిత్రం ‘సతీ లీలావతి’. సత్య దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. దేవ్ మోహన్ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తున్న ఈ సినిమా నుంచి, మేకర్స్ ఓ సాలిడ్ అప్డేట్ విడుదల చేశారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీజర్‌ను.. ఈ రోజు ఉదయం 10:30 గంటలకు విడుదల చేశారు. కాగా ఈ టీజర్‌లో సోషల్ మీడియా ట్రెండ్స్, కౌంటర్లు, సరదా పంచ్‌లతో కథనాన్ని సాగించడాన్ని చూడొచ్చు. లావణ్య న్యాచురల్ టైమింగ్, దేవ్ మోహన్ కామెడీ టచ్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ ఫన్ రైడ్‌కు బ్యాక్గ్రౌండ్‌లో మిక్కీ జే మేయర్ అందించిన సంగీతం మరింత ఆకర్షణగా మారింది. ప్రస్తుతం టీజర్‌కు వస్తున్న స్పందన బాగానే ఉంది. చిత్ర బృందం త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. సమకాలీన సెటైర్లు, ఫన్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా యూత్ ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.