సీఎం చంద్రబాబుకు బిగ్ రిలీఫ్.. ఆ కేసు కొట్టివేసిన ఏసీబీ కోర్టు
విజయవాడలోని ఏసీబీ కోర్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు భారీ ఊరట కలిగించే తీర్పు వెలువరించింది. చంద్రబాబుపై నమోదైన ఏపీ ఫైబర్ నెట్ కేసును పూర్తిగా కొట్టివేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వైసీపీ ప్రభుత్వం హయాంలో, అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు అధికారులపై రూ.300 కోట్లకు పైగా టెండర్లలో అక్రమాలు జరిగాయని ఆరోపణలతో సీఐడీ కేసు నమోదు చేసింది. ఫైబర్ నెట్ ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ కేసు విచారణలో భాగంగా 99 మంది సాక్షులను విచారించిన సీఐడీ, వారి వాంగ్మూలాలతో కూడిన నివేదికను కోర్టుకు సమర్పించింది. అయితే, విచారణలో ప్రభుత్వానికి ఎలాంటి ఆర్థిక నష్టం జరగలేదని స్పష్టమైంది. ఈ నేపథ్యంలో ఫైబర్ నెట్ సంస్థ అప్పటి ఎండీ మధుసూదన్ రెడ్డి కోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తూ, ప్రభుత్వానికి నష్టం లేదని, అందువల్ల కేసును ఉపసంహరించుకుంటున్నట్లు పేర్కొన్నారు. దీనిపై తాజా ఎండీ గీతాంజలి కూడా కేసు ఉపసంహరణకు అభ్యంతరం లేదని అఫిడవిట్ సమర్పించారు. అయితే, ఫైబర్ నెట్ సంస్థ అప్పటి చైర్మన్ గౌతం రెడ్డి, కేసును క్లోజ్ చేయవద్దంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని పరిశీలించిన ఏసీబీ కోర్టు, గౌతం రెడ్డి పిటిషన్‌ను తిరస్కరిస్తూ, కేసు కొనసాగించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న ఏసీబీ కోర్టు న్యాయమూర్తి, ఫైబర్ నెట్ కేసును పూర్తిగా కొట్టివేస్తూ తుది ఉత్తర్వులు జారీ చేశారు. ఈ తీర్పుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి పెద్ద ఊరట లభించగా, రాజకీయంగా కూడా ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.
ప్రతి నెలా వాస్తు మార్పులు చేయడం కష్టం..
ప్లాట్ల విషయంలో ప్రతి నెలా వాస్తు మార్పులు చేయడం కష్టం అన్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్.. రాజధాని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఏర్పాటు చేసిన త్రి-మెన్ కమిటీ సమావేశం ముగిసింది. ఈ సమావేశం అనంతరం కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కీలక అంశాలను వెల్లడించారు. ఇవాళ రైతులకు సంబంధించిన పలు సమస్యలపై సుదీర్ఘంగా చర్చ జరిగిందని ఆయన తెలిపారు. వీధి పోటు ఉన్న ప్లాట్ల విషయంలో కొంతవరకు మార్పులు చేసుకునే అవకాశం ఉందని రైతులకు స్పష్టం చేసినట్లు చెప్పారు. అయితే, ఒకసారి ప్లాట్లు అమ్మిన తర్వాత మార్పులు చేయడం కష్టమని పేర్కొన్నారు. అలాగే జరీబు భూములకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ఒక నెల సమయం కావాలని కోరామని, సాయిల్ టెస్ట్ పూర్తైన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఇక, గ్రామ కంఠాలకు సంబంధించిన అంశాల్లో ముందుగా వెరిఫికేషన్ చేసి ఆపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. లంక భూములకు సంబంధించి కోర్టు కేసులు ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించామని, ఇంకా కొంతమంది రైతులు రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉందని చెప్పారు. ల్యాండ్ పూలింగ్‌లో ఇప్పటికీ సుమారు 2,400 ఎకరాల భూములు కొంతమంది రైతులు ఇవ్వలేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రైతులతో మరోసారి చర్చలు జరపాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఒకవేళ భూ సమీకరణ కుదరకపోతే, వచ్చే నెల మొదటి వారంలో భూ సేకరణ నోటిఫికేషన్ జారీ చేయాల్సి వస్తుందని స్పష్టం చేశారు. ప్రతి నెలా వాస్తు మార్పులు చేయడం సాధ్యం కాదు” అని స్పష్టంగా పేర్కొన్న మంత్రి, ఇబ్బందులు ఉన్న రైతులు ఒకేసారి వచ్చి తమ సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు.
29,233 మంది రైతులకు ప్లాట్ల అలాట్‌మెంట్ జరిగింది..
రాజధాని ప్రాంత రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఏర్పాటు చేసిన త్రి-మెన్ కమిటీ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరిగింది అని మంత్రి నారాయణ తెలిపారు. ఈ సమావేశంలో గ్రామ కంఠం, జరీబు, నాన్-జరీబు భూములకు సంబంధించిన సమస్యలే ప్రధానంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకు 29,233 మంది రైతులకు ప్లాట్ల అలాట్‌మెంట్ పూర్తయ్యిందని మంత్రి వెల్లడించారు. అయితే రాజధాని భూములకు సంబంధించి 312 కోర్టు కేసులు ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. వీధి పోటు సమస్యలు, వారసత్వ వివాదాలు, అలాగే ఎన్‌ఆర్‌ఐల కారణంగా కొన్ని ప్లాట్ల రిజిస్ట్రేషన్లు జరగలేదని చెప్పారు. భూ సమీకరణ జరగని భూముల్లో కూడా 921 ప్లాట్లు రైతులకు కేటాయించినట్లు మంత్రి నారాయణ వివరించారు. రైతుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు వీఆర్‌ఎస్ (VRS) విధానం ద్వారా సర్వే నిర్వహించామని, అందులో కొందరు రైతులు వేరే చోట ప్లాట్లు తీసుకోవడానికి సమ్మతించగా, మరికొందరు వేచి చూస్తామని, ఇంకొందరు తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్లు తెలిపారు. రైతులకు కేటాయించిన ప్లాట్లలో 7,628 ప్లాట్ల రిజిస్ట్రేషన్ వివిధ కారణాల వల్ల పెండింగ్‌లో ఉందని మంత్రి నారాయణ పేర్కొన్నారు. అయితే 1,697 ప్లాట్ల రిజిస్ట్రేషన్‌కు ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. అలాగే కొందరు రైతులు ఎఫ్‌ఎస్‌ఐ (FSI) పెంచాలని డిమాండ్ చేసిన విషయాన్ని మంత్రి వెల్లడించారు. రైతుల సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, త్రి-మెన్ కమిటీ చర్చల ఆధారంగా తగిన నిర్ణయాలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
తీవ్ర విషాదం.. ‘టెట్’ రాసేందుకు తండ్రి ఆటోలో వెళ్తున్న విద్యార్థినిని మింగేసిన రోడ్డు ప్రమాదం..
అనకాపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి ఆటోలో ప్రయాణిస్తూ కూతురు మృతి చెందింది.. టెట్ పరీక్ష రాసేందుకు వెళుతున్న విద్యార్థిని సునీత అనకాపల్లి పట్టణ సుంకరమెట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది.. అవంతి ఇంజనీరింగ్ కాలేజీలో జరగనున్న టెట్ పరీక్ష రాసేందుకు NAD జంక్షన్ కు చెందిన బి.సునీత తండ్రి ఆటోలో ఇంటి నుంచి బయలుదేరింది. ఆటో అనకాపల్లి సుంకరమటి జంక్షన్ స్పీడ్ బ్రేకర్ వద్ద అదుపుతప్పి బోల్తా పడింది.. ఈ ప్రమాదంలో రోడ్డుపై తుళ్లిపడటంతో తలకు తీవ్ర గాయాలై టెట్ విద్యార్థిని సునీత అక్కడికక్కడే మృతి చెందింది, కన్న కూతురు తండ్రి కళ్లముందే చనిపోవడంతో ఈ ఘటన అక్కడ ఉన్న అందర్నీ కలచవేసింది. ఈ ప్రమాదం నుంచి ఆటో డ్రైవర్ అయిన తండ్రి లక్ష్మణరావు సురక్షితంగా బయటపడ్డాడు. అయితే.. ఆటో డ్రైవర్ అయిన తండ్రి లక్ష్మణరావు స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. అనంతరం మృతిచెందిన కుమార్తె సునీత మృతదేహాన్ని మరో వాహనంలో అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సునీత కుటుంబాన్ని విషాదం ముంచెత్తగా, పరిసర ప్రాంతాల్లో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.
వైజాగ్ అంటే చంద్రబాబుకు ప్రత్యేకమైన అభిమానం..
విశాఖపట్నం అంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రత్యేకమైన అభిమానం ఉందని వెల్లడించారు మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి. ఉత్తరాంధ్రను ఆర్థికంగా బలోపేతం చేయాలనే దృఢ సంకల్పంతో సీఎం చంద్రబాబు ముందుకు వెళ్తున్నారని ఆయన అన్నారు. శ్రీకాకుళం నుంచి కోనసీమ జిల్లా వరకు విస్తరించిన తొమ్మిది జిల్లాలను కలుపుకుని “విశాఖ ఎకనామిక్ రీజియన్”ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని మంత్రి తెలిపారు. ఈ ఎకనామిక్ రీజియన్ ద్వారా పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్దపీట వేయనున్నట్లు చెప్పారు. నిన్న విశాఖ పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే నిర్వహించి, అభివృద్ధి అవకాశాలపై సమీక్ష చేశారని మంత్రి పేర్కొన్నారు. విశాఖ అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ముఖ్యమైన మంత్రులతో కలిసి ప్రత్యేక స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అలాగే వచ్చే నెలలో వైజాగ్ బీచ్ ఫెస్టివల్‌ను నిర్వహించనున్నట్లు మంత్రి బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ఈ ఫెస్టివల్ ద్వారా పర్యాటక రంగానికి ఊపునివ్వడంతో పాటు, విశాఖను అంతర్జాతీయ స్థాయిలో మరింత ప్రాచుర్యంలోకి తీసుకురావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. తొమ్మిది జిల్లాల సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి, దశలవారీగా అమలు చేయనున్నట్లు మంత్రి డోల బాల వీరంజనేయ స్వామి స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన అజెండా అని ఆయన పేర్కొన్నారు మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి.
తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదం.. గుండెపోటుతో మాజీ ఎంపీ మృతి..
తెలుగు రాజకీయాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మాజీ ఎంపీ కుసుమ కృష్ణమూర్తి కన్నుమూశారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు గుండెపోటుతో ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని కుటుంబీకులు ధ్రువీకరించారు. ఆయన మరణవార్త తెలిసిన వెంటనే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలు తీవ్ర సంతాపం తెలిపారు. కృష్ణమూర్తి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కుసుమ కృష్ణమూర్తి 1940 సెప్టెంబర్ 11న ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అయినవిల్లి మండలం విలస గ్రామంలో జన్మించారు. శ్రీ కోనసీమ భానోజీ రామర్స్ కాలేజీలో ప్రాథమిక విద్యను పూర్తిచేసి, ఆంధ్ర విశ్వవిద్యాలయం, నాగ్‌పూర్ విశ్వవిద్యాలయంలో చదివి ఎంఏ పూర్తి చేశారు. అనంతరం రాజకీయాల వైపు అడుగులు వేసిన ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి పలు పదవుల్లో పనిచేశారు. అమలాపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన కుసుమ కృష్ణమూర్తి మూడుసార్లు ఎంపీగా విజయం సాధించారు. 6వ లోక్‌సభ (1977–1979), 7వ లోక్‌సభ (1980–1984), 9వ లోక్‌సభ (1989–1991)లకు ప్రాతినిధ్యం వహించారు. ప్రజాసేవలో చురుకైన పాత్ర పోషించిన ఆయన ఉత్తమ ఎంపీగా కూడా మంచి గుర్తింపు పొందారు. నవంబర్ 1983 నుంచి జనవరి 1985 వరకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జాయింట్ సెక్రటరీగా పనిచేశారు. 1990లో పెట్రోలియం అండ్ కెమికల్స్ మంత్రిత్వ శాఖలో బాధ్యతలు నిర్వర్తించారు. 1980 నుంచి 1982 వరకు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల సంక్షేమంపై సంయుక్త సెలెక్ట్ కమిటీ కన్వీనర్‌గా పనిచేశారు. దళితుల సమస్యలపై ఆయనకు ప్రత్యేక ఆసక్తి ఉండేది.
ఫుడ్ పాయిజన్‌తో ఆసుపత్రి పాలైన 90 మంది విద్యార్థులు.. పరామర్శించిన హరీష్‌రావు..
90 మంది విద్యార్థులు ఆస్పత్రి పాలైతే ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. హైదరాబాద్ బాగ్ లింగంపల్లి లోని మైనార్టీ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు నిన్న ఫుడ్ పాయిజన్ కావడంతో వైద్య చికిత్స నిమిత్తం హైదరాబాద్ జిల్లా కింగ్ కోఠి ఆసుపత్రికి తీసుకవచ్చారు. కింగ్ కోఠి ఆసుపత్రికి చేసుకున్న మాజీ మంత్రి హరీష్ రావు వారిని పరామర్శించారు. ఫుడ్ పాయిజన్‌కి గల కారణాలు అధికారులని అడిగి తెలుసుకుంటున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి తోపాటు ఒక మంత్రికి కూడా సోయిలేదని విమర్శించారు. ఫుట్ బాల్ మీద ఉన్న ఇంట్రెస్ట్ విద్యార్థుల మీద లేదు.. ఫుట్ బాల్ ఆడడానికి ముఖ్యమంత్రి అయిదు కోట్లు ఖర్చు పెట్టాడు.. విద్యార్థుల ఆరోగ్యాన్ని గాలికి వదిలేశారని మండిపడ్డారు. విజన్ 2047 అంటూ సీఎం రేవంత్ రెడ్డి డబ్బా కొట్టుకుంటున్నారన్నారు. ఇది విజన్ 2047 కాదు పాయిజన్ 2047 అని తీవ్రంగా విమర్శించారు. రేవంత్‌రెడ్డి నోరు విప్పితే అబద్దాలు మాట్లాడుతున్నారన్నారు. కాగా.. బాగ్ లింగంపల్లి లోని మైనార్టీ గురుకుల పాఠశాల నుంచి ఫుడ్ పాయిజన్ అయ్యి పలువురు విద్యార్థులు హాస్పిటల్ కు వచ్చారని సిబ్బంది తెలిపారు. శుక్రవారం రాత్రి వారు తిన్న ఆహారం కలుషితం కావడం వల్ల వాంతులు, విరోచనలు, కడుపునొప్పితో విద్యార్థులు బాధపడుతున్నారు. పిడియాట్రిక్ వైద్యులు పిల్లలను పరీక్షించారు. డిఐడ్రేషన్ కారణంగా పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. ఇప్పుడు అందరి కండిషన్ స్టేబుల్ గా ఉంది. పిల్లలందరికీ వార్డుకు తరలించి, చికిత్స అందిస్తున్నాము. పిల్లల ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు..
బీజేపీపై అసంతృప్తి వ్యక్తం చేసిన కెప్టెన్.. కాంగ్రెస్‌లో చేరే ప్రసక్తి లేదు..
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత కెప్టెన్ అమరీందర్ సింగ్ తన సొంత పార్టీ పనితీరుపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. బీజేపీలో కీలక నిర్ణయాలన్నీ ఢిల్లీలోనే తీసుకుంటారని, తనలాంటి రాజకీయ అనుభవం ఉన్నవారి అభిప్రాయాలను కూడా అడగడం లేదన్నారు. అయితే, కాంగ్రెస్‌లోకి తిరిగి వెళ్లే ప్రశ్నే లేదని కూడా స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లో ఉన్న సమయంలో తనను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించిన తీరు ఇప్పటికీ తనకు బాధను కలిగిస్తోందని పేర్కొన్నారు. అయినప్పటికీ సోనియా గాంధీ వ్యక్తిగతంగా సహాయం కోరితే చేస్తానని, రాజకీయంగా మాత్రం కాదు అని కెప్టెన్ అమరీందర్ సింగ్ తెలిపారు. ఇక, కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యంగా ఉండేదని, హైకమాండ్‌ను కలవడం సులభమని బీజేపీ నేత అమరీందర్ సింగ్ చెప్పారు. బీజేపీలో మాత్రం పైస్థాయి నేతలను కలవడం కష్టం.. నిర్ణయాలు క్షేత్రస్థాయి నేతలతో చర్చించకుండా తీసుకుంటారని విమర్శించారు. అలాగే, ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసలు కురిపిస్తూ, ఆయనకు పంజాబ్‌పై ప్రత్యేక అభిమానం ఉందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సిద్ధంగా ఉన్నారు.. పంజాబ్‌లో స్థిరత్వం రావాలంటే బీజేపీ- అకాళీదళ్ కూటమి తప్పనిసరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. తన రాజకీయ అనుభవం ప్రకారం ఈ రెండు పార్టీలు మళ్లీ కలుస్తాయని అమరీందర్ సింగ్ చెప్పారు.
మళ్లీ హెచ్-1బీ వీసా ఫీజు పెంపు.. ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న 20 రాష్ట్రాలు..
హెచ్-1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై సొంత దేశంలోనే వ్యతిరేకత వస్తుంది. తాజాగా అగ్రరాజ్యంలోని 20 రాష్ట్రాలు ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేశాయి. ఏ ప్రెసిడెంట్ కి కూడా రాజ్యాంగాన్ని విస్మరించే అధికారం లేదని పేర్కొన్నారు. అయితే, హెచ్-1బీ వీసా ఫీజును పెంచడాన్ని గతంలో అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ కోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా, 20 రాష్ట్రాలు వేసిన పిటిషన్ కు కాలిఫోర్నియా అటార్నీ జనరల్ రాబ్ బోంటా నాయకత్వం వహిస్తున్నారు. ఇక, ట్రంప్ నిర్ణయించిన రుసుం నిలిపివేయాలి.. వలసల చట్టంతో సహా దాని సంబంధిత ఖర్చులలో కీలక మార్పులు చేసే అధికారం కేవలం కాంగ్రెస్‌కు మాత్రమే ఉందని అటార్నీ జనరల్ రాబ్ బోంటా తెలిపారు. హెచ్-1బీ వీసాలపై అదనపు రుసుములు విధించే అధికారం ట్రంప్‌కు లేదన్నారు. కాంగ్రెస్ ఈ వీసా కార్యక్రమాన్ని మెరుగుపరి.. కండిషన్స్, రుసుములు నిర్ణయించింది అన్నారు. అదనపు ఛార్జీలు విధించే అధికారం ట్రంప్ కి ఏమాత్రం లేదు.. ఏ అధ్యక్ష పరిపాలన ఇమిగ్రేషన్ చట్టాన్ని తిరిగి రాయలేదు.. రాజ్యాంగాన్ని, చట్టాలను ఏ ప్రెసిడెంట్ విస్మరించరని తెలియజేశారు. అయితే, ఈ రుసుం ప్రభుత్వం, ప్రైవేట్ యజమానులపైనా ఆర్థిక భారాన్ని మోపుతుందని బోంటా ఆందోళన వ్యక్తం చేశారు. కీలక రంగాల్లో కార్మికుల కొరత ఏర్పడుతుందని చెప్పుకొచ్చారు. ఇప్పటికే విద్య, ఆరోగ్య సంరక్షణ లాంటి రంగాల్లో నైపుణ్యం కలిగిన హెచ్-1బీ వీసాదారుల కొరత ఉందన్నారు. ఇది మరింత తీవ్రతరం కానుందన్నారు.
ఏకంగా రూ. 6 వేలు తగ్గిన వెండి ధర.. బంగారం మాత్రం!
గత వారం రోజులుగా భారీగా పెరుగిన బంగారం, వెండి ధరలు ఈరోజు (డిసెంబర్ 13న) ఒక్కసారిగా తగ్గు ముఖం పట్టాయి. అంతర్జాతీయ పరిణామాల కారణంగా రేట్లు పెరుగుతున్నాయని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. అయితే వీకెండ్ లో షాపింగ్ చేయాలని అనుకుంటున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు తాజా రేట్లను పరిశీలించడం చాలా ముఖ్యం. ఇక, 24 క్యారెట్ల బంగారం ధర రూ.270 తగ్గి 1,33,910గా ఉండగా.. ఇక, 22 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ.250 తగ్గి, 1,22,750 వద్ద కొనసాగుతుంది. 24 క్యారెట్ల గోల్డ్ గ్రాము ధర.. హైదరాదాబాద్ లో రూ.13వేల 391, విజయవాడలో రూ.13వేల 391, విశాఖలో రూ.13వేల 391.. అయితే, బంగారం ధరలతో పాటు మరొ పక్క వెండి రేట్లు పతనం అవుతున్నాయి. ఇవాళ (డిసెంబర్ 13న) కిలో వెండి రూ.6 వేలు తగ్గటంతో తెలుగు రాష్ట్రాల్లో స్వచ్ఛమైన సిల్వర్ రేటు కేజీకి 1 లక్ష 98 వేలకు చేరుకుంది. అంటే గ్రాము వెండి ధర 198 రూపాయలకు విక్రయాలు జరుపున్నారు.
గిల్‌ను టీ20 జట్టు నుంచి తొలగించాలి.. గంభీర్పై మాజీ క్రికెటర్ ఆగ్రహం..
టీ20 జట్టులో శుభ్‌మన్ గిల్ స్థానం గురించి మాజీ భారత క్రికెటర్ మహ్మద్ కైఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మిగతా మ్యాచ్‌లకు గిల్‌ను జట్టు నుంచి తప్పించాలని సూచించారు. జట్టు ప్రయోజనం అనేది అన్నిటికంటే ముఖ్యం.. వైస్ కెప్టెన్ అనే హోదా ఆ నిర్ణయానికి అడ్డుగా ఉండకూడదన్నారు. టీం ఎంపికలో ద్వంద్వ ప్రమాణాలు ఉండకూడదని మహ్మద్ కైఫ్ వ్యాఖ్యానించారు. అయితే, 2025 ఆసియా కప్ టోర్నీమెంట్ గిల్ మళ్లీ టీ20 జట్టులో ఓపెనర్‌గా చోటు దక్కించుకున్నాడు.. ఇక, అద్భుతమైన ఫామ్‌లో ఉన్న సంజూ శాంసన్‌ను బెంచ్ కి పరిమితం చేశారని మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ పేర్కొన్నారు. గిల్ పెద్దగా రాణించకపోగా.. ఇప్పటి వరకు ఒక్క టీ20 అర్ధశతకం కూడా సాధించలేకపోయాడు.. ఒక్క మ్యాచ్‌లో కూడా రెండు సిక్సులకంటే ఎక్కువ కొట్టలేకపోవడం గమనార్హం. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో అయితే గిల్ గోల్డెన్ డక్‌గా పెవిలియన్ బాట పట్టాడు అని కైఫ్ ఎద్దేవా చేశారు.
బాలయ్య కెరీర్ హయ్యెస్ట్.. రికార్డు బ్రేకింగ్ కలెక్షన్స్
నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ తాండవం పేరుతో అఖండ సినిమాకి సీక్వెల్ తెరకెక్కిన సంగతి తెలిసిందే. సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి వంటి వారు ఈ సినిమాలో ఇతర కీలక పాత్రలలో నటించారు. ఇక ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ కావాల్సి ఉంది, కానీ పలు కారణాలతో వాయిదా పడింది. ఎట్టకేలకు ఈ సినిమా డిసెంబర్ 12వ తేదీ రిలీజ్ అయింది. అంతకు ముందు ఒక రోజు ప్రీమియర్స్ ప్రదర్శించారు. మొదటి రోజు ప్రీమియర్స్‌తో కలిపి డే వన్ కలెక్షన్స్ బాలకృష్ణ కెరీర్‌లోనే హైయెస్ట్‌గా నిలుస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ రెండూ కలిపి 59.5 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ అఖండ తాండవం సినిమా మరిన్ని రికార్డులు బద్దలు కొట్టే దిశగా దూసుకుపోతోంది. వాస్తవానికి ఈ సినిమా మాస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యే అంశాలు ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేశారు. అది కాక, నార్త్ ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యే అంశాలు కూడా ఈ సినిమాలో ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి, నందమూరి బాలకృష్ణ కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టే సినిమాగా ముందుకు దూసుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. 200 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించబడిన ఈ సినిమాకి ఓటీటీ హక్కులు కూడా గట్టిగానే వచ్చాయి. ఈ నేపథ్యంలో, బాలయ్య కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టే సినిమాగా ఈ సినిమా నిలిచే అవకాశం అయితే కనిపిస్తోంది.
నెల రోజుల ముందే.. ‘ది రాజా సాబ్’ అడ్వాన్స్ బుకింగ్స్ సునామీ!
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది రాజా సాబ్’ ప్రేక్షకుల అంచనాలను భారీగా పెంచేసింది. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఒక సరికొత్త రొమాంటిక్ హారర్ కామెడీగా.. 2026 కొత్త సంవత్సరం కానుకగా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల విడుదలైన మొదటి పాట ‘రెబల్ సాబ్’ ఇప్పటికే అభిమానుల్లో మంచి హైప్‌ను క్రియేట్ చేయగా, త్వరలోనే రెండో పాటను రిలీజ్ చేసి మరింత జోష్ పెంచనున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ జోరు నార్త్ అమెరికాలో ఇప్పటికే మొదలైంది. విడుదలకు ఇంకా సుమారు నెల రోజుల సమయం ఉన్నప్పటికీ, ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 100K డాలర్ల (సుమారు 83 లక్షల రూపాయలు)కు పైగా వసూళ్లు సాధించడం నిజంగా అసాధారణం. ఈ లెక్కలు చూస్తుంటే, అమెరికాలో ప్రభాస్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. రాబోయే రోజుల్లో ప్రమోషన్ కార్యక్రమాలు మరింత బలంగా జరిగితే, ఓవర్సీస్ మార్కెట్‌లో ఈ చిత్రం మరింత ఊపు తెచ్చుకోవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ భారీ ప్రాజెక్ట్‌లో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ వంటి ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా వస్తున్న ‘ది రాజా సాబ్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.
హృతిక్ వ్యాఖ్యలపై దర్శకుడు స్పందన.. ‘ధురంధర్ పార్ట్ 2’పై క్లారిటీ ఇచ్చిన ఆదిత్య ధర్
ఇటీవల విడుదలై ప్రశంసలు అందుకుంటున్న బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘ధురంధర్’. రణ్‌వీర్ సింగ్, మాధవన్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా కీలక పాత్రలో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. డిసెంబర్ 5న విడుదలైన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఇప్పటివరకు సుమారు రూ.230 కోట్ల కలెక్షన్లు సాధించింది. అయితే ఈ మూవీ పై పలు హీరోలు కూడా స్పందిస్తూ పాజిటీవ్ గా స్పందిస్తుండగా.. స్టార్ హీరో హృతిక్ రోషన్ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.. ‘‘ధురంధర్’ సినిమా బాగుంది నా హృదయానికి బాగా దగ్గరైన సినిమా. ఆదిత్య ధర్ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారని’ అని ప్రశంసించినప్పటికీ, ఇందులో చూపించిన కొన్ని రాజకీయ అంశాలను తాను అంగీకరించనని హృతిక్ చెప్పడం విమర్శలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో తాజాగా దర్శకుడు ఆదిత్య ధర్ ఈ వ్యాఖ్యలపై స్పందించారు. ఈ పోస్ట్‌కు రిప్లై ఇచ్చిన ఆదిత్య ధర్.. ‘‘ఈ సినిమాపై మీరు చూపిన ప్రేమకు ధన్యవాదాలు. ఇందులో పనిచేసిన ప్రతి ఒక్కరూ వంద శాతం కష్టపడ్డారు. మీ ప్రశంసలకు వారందరూ అర్హులే. అంతేకాదు, ‘ధురంధర్’కు పార్ట్ 2 కూడా ఉంటుంది. ఆ సినిమాను తెరకెక్కించేటప్పుడు అందరి సూచనలు, అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకుని మరింత మెరుగ్గా తీసుకురావడానికి ప్రయత్నిస్తాం’’ అంటూ స్పష్టత ఇచ్చారు. తాజాగా పార్ట్ 2 కూడా ఖరారైనట్లు అధికారికంగా క్లారిటీ రావడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ చిత్రబృందం ఇటీవల గ్రాండ్ సక్సెస్ మీట్‌ను కూడా నిర్వహించింది.