మూడు శాఖలపై సీఎం సమీక్ష.. ధరల నియంత్రణ కోసం తీసుకున్న చర్యలపై ఆరా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. దసరా పండుగ రోజు కూడా సమీక్షలు నిర్వహిస్తున్నారు.. ఉండవల్లిలోని తన నివాసంలో ఈ రోజు సివిల్ సప్లై, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలపై సమీక్ష సమావేశం నిర్వహించారు ఏపీ సీఎం.. ఈ రివ్యూకు మంత్రి నాదెండ్ల మనోహర్‌తో పాటు ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు హాజరయ్యారు.. నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు పౌరసరఫరాల శాఖ ద్వారా చేపట్టిన చర్యలపై సమీక్షించారు సీఎం చంద్రబాబు.. అయితే, నిత్యావసర వస్తువుల ధరల భారం తగ్గించేందుకు ఇప్పటి వరకు తీసుకున్న చర్యలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు మంత్రి నాదెండ్ల మనోహర్, అధికారులు.. మరోవైపు.. డిమాండ్ కు తగిన విధంగా నిత్యావసర వస్తువుల దిగుమతి, దీర్ఘకాలికంగా చేపట్టాల్సిన చర్యలపై సమీక్ష చేశారు.. ప్రస్తుతం రైతు బజార్ల ద్వారా చేపట్టిన వివిధ అమ్మకాలు, కౌంటర్ల ఏర్పాటుపై కూడా సీఎం చంద్రబాబుకు వివరించారు అధికారులు..
నేడు అమలాపురంలో చెడీ తాలింఖానా ఉత్సవం.. ఏంటి దాని ప్రత్యేకత..?
దసరా వచ్చిందంటే చాలు ఒక్కో ఏరియాలో ఒక్కో విధమైన ఉత్సవాలు జరుగుతుంటాయి.. ఇక, అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో దసరా సందర్భంగా చెడీ తాలింఖానా ఉత్సవాలు నిర్వహిస్తుంటారు.. విజయదశమి సందర్భంగా ఆయుధాల ప్రదర్శనలతో ఊరేగింపులు నిర్వహించడం ఇక్కటి ప్రత్యేకత.. 1835లో అమలాపురం కొంకాపల్లి వీధిలో ఈ చెడీ తాలింఖానా ఉత్సవాన్ని ప్రారంభించారు.. 189 సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తున్నాయి.. అమలాపురం దసరా చెడీ తాలింఖానా వేడుకలు.. ఇక, ఇవాళ మధ్యాహ్నం నుంచి రేపు ఉదయం వరకు ఏడు వీధుల ఊరేగింపులు కొనసాగనున్నాయి.. కర్ర సాము, కత్తి సాము వంటి 60 రకాల యుద్ధ విన్యాసాలతో చెడీ తాలింఖానా ఉత్సవం నిర్వహిస్తారు.. ఈ నేపథ్యంలో ఇవాళ అమలాపురంలో ట్రాఫిక్ కాంక్షలు విధించారు పోలీసులు.. ద్విచక్ర వాహనాల మినహా ఇతర వాహనాలకు అమలాపురం పట్టణంలోకి ప్రవేశంపై ఆంక్షలు విధించారు పోలీసులు..
ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ స్కామ్.. సెల్పీ వీడియోతో బ్యాంక్ మేనేజర్ సంచలనం..
ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ స్కామ్ కలకలం రేపుతోంది.. పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల్లోని ఐసీఐసీఐ బ్యాంకుకు చెందిన మూడు శాఖల్లో సుమారు రూ.28 కోట్ల ఆర్థిక అవకతవకల జరిగినట్టుగా తెలుసత్ఉండగా.. ఆంధ్రప్రదేశ్‌లోని నేర పరిశోధన విభాగం (సీఐడీ) దీనిపై ఇప్పటికే దర్యాప్తు చేపట్టింది.. చిలకలూరిపేట బ్రాంచ్‌లో ఖాతాదారుల నుంచి సీఐడీ అధికారులు వివరాలు సేకరించారు.. అక్రమాలకు పాల్పడిన ఖాతాదారుల వాంగ్మూలాలను రికార్డు చేశారు.. ఈ సమయంలో కీలక సూత్రధారిగా భావిస్తోన్న బ్యాంక్ మేనేజర్ నరేష్ చంద్రశేఖర్ సెల్ఫీ వీడియో విడుదల చేశారు.. ఆ సెల్ఫీ వీడియోలో కీలక అంశాలు చెప్పుకొచ్చారు నరేష్ చంద్రశేఖర్.. బ్యాంకు ఆర్థిక లావాదేవీలు పెంచే క్రమంలో కొన్ని తప్పులు జరిగాయని వీడియో విడుదల చేసిన ఆయన.. బ్యాంకు సిబ్బంది, ఖాతాదారులు, తనను ఒక్కడినే తప్పుపడుతున్నారని సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు.. ఖాతాదారులను మోసం చేసే ఉద్దేశం లేదని వివరణ ఇచ్చారు.. బంగారు రుణాలకు సంబంధించిన కొంతమంది పేర్లు మార్చామని ,మోసం చేయలేదని వీడియోలో వెల్లడించారు. ఉన్నతాధికారులు తనను వేధించారని, అనేక మందికి జరిగిన తప్పుల్లో భాగస్వామ్యం ఉందని పేర్కొన్నారు నరేష్ చంద్రశేఖర్.. నరసరావుపేటలోని కరుణాకర్, చిలకలూరిపేటలోని హరీష్ కు ఈ స్కాం మొత్తం తెలుసని సంచలన విషయాలు వెల్లడించారు.. గతంలో అధికారులు ఒత్తిడి భరించలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని భార్యా బిడ్డలను చూసి ఆత్మహత్య ఆలోచన విరమించుకున్నానని వీడియోలో చెప్పుకొచ్చారు.. తనకు బతకాలని లేదని, చనిపోదామనుకుంటున్నానని సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు కీలక సూత్రధారి, బ్యాంక్ మేనేజర్ నరేష్ చంద్రశేఖర్..
శ్రీ సత్యసాయి జిల్లాలో దారుణం.. అత్తా కోడళ్లపై అత్యాచారం.. ఆ తర్వాత..!
దసరా పండుగ పూట శ్రీ సత్యసాయి జిల్లాలో దారుణం జరిగింది.. చిలమత్తూరు మండలం నల్లబొమ్మని పల్లి సమీపంలో అత్తా కోడళ్లపై అత్యాచారానికి తెగబడ్డారు గుర్తుతెలియని వ్యక్తులు.. నిర్మాణంలో ఉన్న ఓ పేపర్ మిల్లులో వాచ్‌మన్‌గా ఉంటుంది ఓ కుటుంబం.. అయితే, రెండు బైక్‌లపై వచ్చిన దుండగులు.. కొడవలితో బెదిరించి ఘాతుకానికి పాల్పడినట్టు బాధితులు చెబుతున్నారు.. చిలమత్తూరు మండలం నల్లబొమ్మని పల్లి సమీపంలో నిర్మాణంలో ఉన్న పేపర్ మిల్లులో వాచ్‌మన్‌గా చేరింది ఓ కుటుంబం.. ఐదు నెలల క్రితం ఇక్కడికి ఉపాధి కోసం వచ్చిన బళ్లారికి చెందిన ఆ కుటుంబం.. ఇక్కడే ఉంటున్నారు.. అయితే, శుక్రవారం రాత్రి సమయంలో రెండు బైక్‌లపై దుండగులు వచ్చినట్టుగా తెలుస్తోంది.. కొడవలితో బెదిరించి.. బలవంతంగా పక్కకు లాక్కెల్లి.. ఒకరి తర్వాత ఒకరిపై అత్తా కోడళ్లపై అత్యాచారానికి ఒడిగట్టారట దుండగులు.. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు.. ఇక, జరిగిన ఘటనపై సమగ్ర విచారణ చేపట్టారు పోలీసులు.. ఘటనా స్థలాన్ని పరిశీలించారు ఎస్పీ రత్న.. ఈ ఘాతుకానికి పాల్పడింది ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు..? తెలిసినవారి పనేనా..? ఇలా అనేక కోరణాలు దర్యాప్తు చేపట్టారు..
వ్యాపారులను వేధిస్తే సహించేది లేదు..
వ్యాపారులను వేధించే నైజం మాది కాదు.. వ్యాపారులను ఎవరైనా వేధిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు ఏపీ రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి.. ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన సరుకులు అందించడమే మా ప్రభుత్వ ధ్యేయం అన్నారు. వ్యాపారులను ఎవరు వేధించినా సహించేది లేదన్నారు.. వినియోగదారులకు సరసమైన ధరలకే వ్యాపారులు సరుకులు అందించాలి అన్నారు.. గత ప్రభుత్వం లాగా వ్యాపారులను వేధించే నైజం మాది కాదని వ్యాఖ్యానించారు మంత్రి రాంప్రసాద్‌రెడ్డి..
శక్తివంతమైన సమాజ నిర్మాణం కోసం పాటుపడదాం..
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని శక్తివంతమైన సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆకాంక్షించారు. ఈరోజు కరీంనగర్ లోని మహాశక్తి ఆలయం ఆవరణలో బండి సంజయ్ కుమార్ పార్టీ నేతలు, భక్తులతో కలిసి శమీ పూజ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాతూ.. హిందూ బంధువులందరికీ పవిత్రమైన శక్తివంతమైన విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరికీ విజయాలు అందించాలి. స్వార్ధం, కల్మషం వీడి శక్తివంతమైన సమాజ నిర్మాణం కోసం అందరం కలిసి పనిచేద్దాం. కష్టసుఖాలను పంచుకుందాం అన్నారు. గతంలో జరిగిన మంచి చెడులను బేరీజు వేసుకుని మంచి జరిగేలా అమ్మవారిని వేడుకుందాం. గతంలో పడిన కష్టాలు, ఇబ్బందులన్నీ తొలగిపోవాలి. అందరిలో మంచి ఆలోచనలు కలిగాలి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆధ్వర్యంలో శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం చేస్తున్న కార్యక్రమాల్లో ఎలాంటి అవరోధం లేకుండా విజయం చేకూర్చాలి. భారతమాతను విశ్వగురు స్థానంలో ఉంచేందుకు మోదీ చేస్తున్న క్రుషి సాకారమయ్యేలా అమ్మవారి ఆశీస్సులందించాలి. అట్లాగే కరీంనగర్ పార్లమెంట్ తోపాటు తెలంగాణ అభివ్రుద్ధి చెందేలా అందరం కలిసి భాగస్వాములు కావాలని అమ్మవారిని వేడుకున్నా అన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి పొన్నం క్లారిటీ
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం దసరా పండుగ సందర్భంగా ఎల్లమ్మతల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, సామాజిక, రాజకీయ, ఆర్థిక సర్వే కోసం జీవో 18ను తీసుకొచ్చారని వివరించారు. ఈ సర్వే 60 రోజుల పాటు కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. బీసీ కులగణనను పూర్తిగా సేకరించిన తర్వాత రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు (గ్రామ్ పంచాయతీ ఎన్నికలు) జరుగుతాయని స్పష్టత ఇచ్చారు. కులగణన ప్రక్రియలో రాష్ట్ర ప్రజలు అందరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కులగణన కోసం ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందించిందని, 60 రోజుల వ్యవధిలో ప్రతి ఇంటి వివరాలను సేకరించే విధానాన్ని ఖరారు చేసినట్లు తెలిపారు.
ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నా గుణపాఠాలు నేర్చుకోరా..
తమిళనాడు రాష్ట్రంలోని తిరువళ్లూరు సమీపంలో భాగమతి ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురైంది. ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కేంద్ర సర్కార్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ ఘటన బాలాసోర్‌లో గూడ్స్ రైలును, ప్యాసింజర్ రైలు ఢీకొన్న ఘటనకు ప్రతిరూపంగా చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఆయన ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. ‘మైసూర్- దర్బాంగా రైలు ప్రమాదం భయంకరమైన బాలాసోర్ ఘటనకు అద్దం పడుతుందని ఆయన చెప్పుకొచ్చారు. ఇక, ఆ ప్రమాదంలో ఒక ప్యాసింజ్ రైలు ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీ కొట్టగా.. పలుమార్లు ప్రమాదాలు జరిగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నా గుణపాఠాలు నేర్చుకోవడం లేదని మండిపడ్డారు. ఈ ప్రభుత్వానికి జవాబుదారీతనం పైస్థాయి నుంచే ఉండాలన్నారు. ఈ ప్రభుత్వం మేల్కొనేలోపు ఇంకా ఎన్ని కుటుంబాలు నాశనం కావాలి? అని రాహుల్ గాంధీ విమర్శించారు.
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వ్యాఖ్యలను తోసిపుచ్చిన కేంద్రం
లావోస్‌లో నిర్వహించిన భారత్-ఆసియాన్ శిఖరాగ్ర సదస్సులో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో చర్చలు జరిపినట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రకటించారు. దీనిపై భారత్ రియాక్ట్ అయింది. ఇరువురి మధ్య ఎలాంటి చర్చలు జరగలేదని స్పష్టం చేసింది. కేవలం వారిద్దరూ ఎదురు పడ్డారని భారత్ అధికారులు చెప్పుకొచ్చారు. అయితే, ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ హస్తం ఉందంటూ గతంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య దౌత్య, వాణిజ్య సంబంధాలు దెబ్బ తిన్నాయి. ఈ క్రమంలో ప్రధాని మోడీతో భేటీ అయినట్లు జస్టిన్ ట్రూడో తెలిపారు. అయితే, నరేంద్ర మోడీతో జరిగిన సమావేశంలో పలు అంశాలపై చర్చించానని.. ఇందులో భాగంగా తర్వాత చేయాల్సిన పనుల గురించి ప్రస్తావించినట్లు కెనడ ప్రధాని జస్టిన్ ట్రూడో తెలిపారు. కెనడియన్ల భద్రత, చట్టబద్ధ పాలనే తమ ప్రభుత్వ బాధ్యతలు.. వాటిపైనే దృష్టిసారించినట్లు పేర్కొన్నారు. ట్రూడో చేసిన ఈ కామెంట్స్ ను భారత అధికారులు ఖండించారు. మోడీ, ట్రూడో ఇద్దరూ కలిసి ఒకరిని ఒకరు పలకరించుకున్నారు.. కానీ, వారి మధ్య ఎలాంటి చర్చలు జరగలేదు అని స్పష్టం చేశారు. కెనడాతో సంబంధాలను తాము గౌరవిస్తాం.. అయితే, అక్కడ భారత వ్యతిరేక కార్యకలాపాలపై కెనడా సర్కార్ కఠిన చర్యలు తీసుకునేంత వరకు పరిస్థితి సాధారణ స్థితికి చేరుకోవడం కష్టం అని భారత విదేశాంగ శాఖ అధికారులు వెల్లడించారు.
కమలా హారిస్ ఎన్నికల ప్రచార సభకు ఏఆర్ రెహమాన్ వీడియో
నవంబర్ 5న అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఈ క్రమంలో ఆమెకు సపోర్టుగా ‘ద ఏషియన్ అమెరికన్ పసిఫిక్ ఐ లాండర్స్ (ఏఏపీఐ)’ నిధుల సేకరణ టీమ్ ఓ సభను ఏర్పాటు చేయబోతుంది. ఆ సభలో మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ కాన్సర్ట్ నిర్వహించనున్నారు. అయితే, ఈ కార్యక్రమానికి సంబంధించిన ఓ వీడియోను ఏఆర్ రెహమాన్ రూపొందించారని ఏఏపీఐ విక్టరీ ఫండ్ ఛైర్‌పర్సన్ శేఖర్ నరసింహన్ తెలిపారు. ఈ ప్రదర్శనతో అమెరికాలో పురోగతి, ప్రాతినిధ్యానికి నిలబడిన నాయకులు, కళాకారుల బృందానికి ఏఆర్ రెహమాన్ గాత్రాన్ని అందించనున్నారు. ఇది కేవలం సంగీత కార్యక్రమం మాత్రమే కాదు.. ఇది మా సంఘాలు, మేము అమెరికాలో చూడాలనుకునే భవిష్యత్తుకు ఓటు వేయాలనే కార్యాచరణకు పిలుపు నిచ్చారని నరసింహన్ చెప్పుకొచ్చారు.
గూస్ బంప్స్ తెప్పించిన విశ్వంభర టీజర్.. ఇది వేరే లెవల్
లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా, త్రిష హీరోయిన్ గా వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ విజువల్ ట్రీట్ చిత్రం “విశ్వంభర”. యువీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించిన సంగతి తెలిసిందే. దాదాపు 200కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా నుండి చాలా కాలంగా ఎదురుచూస్తున్న భారీ ట్రీట్ టీజర్‌ను ఈ దసరా పండుగ కానుకగా మేకర్స్ విడుదల చేశారు. చాలా ఏళ్ల తర్వాత చిరు చేస్తున్న ఫాంటసీ వండర్ విశ్వంభర. ఈ సినిమా నుంచి ఇప్పటికే టైటిల్ గ్లింప్స్, పోస్టర్స్ రిలీజ్ చేయగా తాజాగా నేడు దసరా పండగ పూట ‘విశ్వంభర’ టీజర్ రిలీజ్ చేశారు. మరి ఈరోజు విడుదలైన టీజర్ ఎలా ఉందో చూద్దాం. టీజర్ స్టార్ కాగానే హలీవుడ్ మూవీ అవతార్ సినిమాలో మాదిరి రెక్కల పక్షులు కనిపిస్తాయి. వెంటనే ఆకాశం నుంచి ఓ రాక్షకుడు ఇక్కడికి వస్తాడు. వెంటనే విశ్వాన్ని అలుముకున్న ఈ చీకటి విస్తరిస్తున్నంత మాత్రాన వెలుగు రాదని కాదు. ప్రశ్నలు పుట్టించిన కాలమే సమాధానాన్ని కూడా పుట్టిస్తుంది. విర్రవీగుతున్న ఈ అరాచకానికి ముగింపు పలికే మహా యుద్దాన్ని తీసుకొస్తుంది. అంటూ బ్యాగ్రౌండ్ డైలాగ్స్ వినిపిస్తాయి. తర్వాత ఓ పాప మిత్రా.. యుద్ధం వస్తందని అన్నావు కదా ఎలా ఉంటుంది ఆ యుద్ధం అని ప్రశ్నిస్తుంది. తర్వాత రెక్కల గుర్రంపై మెగాస్టార్ ఎంట్రీ అదిరి పోయిందనే చెప్పాలి. తర్వాత రాక్షకులకు యోధుడికి మధ్య జరిగే యుద్ధం కధాంశంగా చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది.
హిట్ కాంబో..బాలయ్య, బోయపాటి మరో చిత్రానికి ముహూర్తం ఫిక్స్
నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను నాలుగో చిత్రానికి సన్నాహాలు మొదలయ్యాయి. బాలయ్య – బోయపాటి హిట్ కాంబినేషన్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన సింహా, లెజెండ్, అఖండ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించాయి. బాలయ్యకు పెద్ద కమర్షియల్ చిత్రాలే కాకుండా తన కెరీర్‌లో చెప్పుకోదగ్గ చిత్రాలుగా నిలిచాయి. ఆ క్రెడిట్ కచ్చితంగా బోయపాటికే దక్కుతుంది. తాజాగా రామ్ ఆచంట, గోపీ ఆచంట, 14 రీల్స్ ప్లస్, ఎమ్ తేజస్విని నందమూరి సమర్పణలో #BB4 అక్టోబర్ 16న ఉదయం 10 గంటలకు గ్రాండ్ ఓపెనింగ్ జరుగనుంది. బాలకృష్ణ, బోయపాటి శ్రీను నాల్గవ సారి కలిసి నటిస్తున్న #BB4 చిత్రం దసరా సందర్బంగా అధికారికంగా ప్రకటించబడింది. లెజెండ్ నిర్మాతలుగా ఉన్న రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై #BB4ని భారీ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. బాలయ్య చిన్న కూతురు ఎం తేజస్విని నందమూరి ఈ చిత్రాన్న సమర్పిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో నాలుగో సినిమాగా BB4 వర్కింగ్ టైటిల్ తో ఓ పోస్టర్ రిలీజ్ చేసి సినిమాని అనౌన్స్ చేసారు. అక్టోబర్ 16న ఈ సినిమా షూటింగ్ ప్రారంభానికి మూహూర్తంగా నిర్ణయించారు. త్వరలోనే షూటింగ్ మొదలుపెడతారని సమాచారం. రిలీజ్ చేసిన పోస్టర్లో BB4 అని వర్కింగ్ టైటిల్ పెట్టి వెనుక అమ్మవారి ఫోటో పెట్టడంతో ఇది అఖండ 2 సినిమానేనా లేక వేరే సినిమానా అని ఆలోచన చేస్తున్నారు బాలయ్య ఫ్యాన్స్.