మాజీ మంత్రి పేర్నినానికి షాకిచ్చిన పోలీసులు..
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నానికి షాకిచ్చారు పోలీసులు.. ఆర్.పేట సీఐ ఏసుబాబుపై దౌర్జన్యం చేశారంటూ చిలకలపూడి పోలీసు స్టేషన్‌లో పేర్ని నానిపై కేసు నమోదు చేశారు.. అయితే, వైసీపీ నేత సుబ్బన్నను నిన్న (శుక్రవారం) విచారణకు పిలిచారు మచిలీపట్నం టౌన్ పోలీసులు.. ఈక్రమంలో ఆ పీఎస్‌కు వెళ్లిన పేర్ని నాని.. సీఐపై సీరియస్ అయ్యారు.. ఓ దశలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించారు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు.. మాజీ మంత్రి పేర్ని నానిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు.. ఈ నేపథ్యంలో.. పేర్ని నానిపై కేసు నమోదు చేశారు పోలీసులు.. పేర్ని నాని సహా 29 మందిపై కేసు నమోదు చేశారు..
ప్రధాని మోడీ ఏపీ టూర్ ఖరారు.. పూర్తి షెడ్యూల్ ఇదే..
భారత ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు.. ప్రధాని మోడీ ఈ నెల 16వ తేదీన ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటన ఖరారు అయ్యింది.. దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ విడుదల చేశారు.. ఏపీ పర్యటన కోసం.. 16న ఉదయం 7.50కి ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరనున్నారు ప్రధాని.. ఉదయం 10.20కి కర్నూలు ఎయిర్‌పోర్ట్‌కి చేరుకుంటారు.. ఇక, 10.25కి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో కర్నూలు ఎయిర్‌పోర్ట్ నుంచి సున్నిపెంట హెలిప్యాడ్‌కు బయల్దేరనున్నారు.. ఉదయం 11.05 గంటలకు సున్నిపెంట చేరుకుని.. అక్కడి నుంచి ఉదయం 11.10కి రోడ్డు మార్గంలో శ్రీశైలం భ్రమరాంబ గెస్ట్ హౌస్ చేరుకుంటారు.. 11.45కి భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు.. మధ్యాహ్నం 12.45కి భ్రమరాంబ గెస్ట్ హౌస్ చేరుకొని 1.25కి సున్నిపెంటకు బయల్దేరనున్నారు.. ఇక, మధ్యాహ్నం 1.40కి సున్నిపెంట హెలిప్యాడ్ నుంచి నన్నూరు హెలిప్యా్‌డ్ చేరుకుంటారు. మధ్యాహ్నం 2.30 రాగమయూరి గ్రీన్ హిల్స్ వెంచర్ కు చేరుకొని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు.. సాయంత్రం 4.00 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారు.. 4.15కి రోడ్డు మార్గంలో నన్నూరు హెలిపాడ్‌కు చేరుకొని.. హెలికాఫ్టర్‌లో 4.40కి కర్నూల్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని.. అక్కడి నుంచి ఢిల్లీ బయల్దేరి వెళ్లడంతో.. ప్రధాని మోడీ ఏపీ పర్యటన ముగియనుందవి.. ఇక, అక్కడి నుంచి బయల్దేరి రాత్రి 7.15కి ఢిల్లీ చేరుకోనున్నారు ప్రధాని మోడీ..
ఆ రైతులకు గుడ్‌న్యూస్.. ఖాతాల్లో కౌలు నిధులు జమ..
అమరావతి రైతులకు గుడ్‌న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. వారి ఖాతాల్లో వార్షిక కౌలు జమ చేసింది ప్రభుత్వం.. రాజధాని రైతుల వార్షిక కౌలు నిమిత్తం రూ.6.64 కోట్ల నిధులు విడుదల చేసింది ప్రభుత్వం.. ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు, భూ యజమానులకు ప్రభుత్వం నుంచి చెల్లించాల్సిన వార్షిక కౌలు ఈ రోజు జమ చేసింది.. అయితే, రైతుల బ్యాంక్ ఖాతాల లింకేజీ ప్రక్రియలో తలెత్తిన సాంకేతిక కారణాల వలన కొందరు రైతులకు సొమ్ము జమ కాలేదు.. కొంతమంది రైతులు తమ ప్లాట్లను విక్రయించినందున, అదే విధంగా మరణించిన రైతుల యొక్క వారసుల ఖాతాల సర్టిఫికెట్ ఇవ్వడంలో ఆలస్యం జరిగింది.. కౌలు లబ్ధి జమ చేయడానికి నిర్ణీత ధ్రువపత్రాలు అధికారులకు అందిన తర్వాత కౌలు జమ చేయనున్నట్టు అధికారులు స్పష్టం చేశారు.. మరోవైపు, పలువురు రైతుల ఖాతాలలో 9వ, 10వ, 11వ ఏడాదికి సంబంధించి సొమ్ము కూడా జమ కానుట్టగా గుర్తించారు.. ఈ తరహా సమస్యలను పరిష్కరించిన సీఆర్డీఏ.. 495 మందికి అందాల్సిన పెండింగ్ వార్షిక కౌలు నిధులు విడుదల చేసింది..
లెఫ్టిస్ట్.. రైటిస్ట్ అనేది కాదు.. బ్యాలెన్స్ ముఖ్యం
లెఫ్టిస్ట్.. రైటిస్ట్ అనేది కాకుండా బ్యాలెన్స్ ముఖ్యం అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ‘ఆమె సూర్యుడిని కబళించింది’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నా గురించి నాకు ఏమి చెప్పుకోవాలో తెలియదు అన్నారు.. అయితే, తప్పనిసరిగా చెప్పగలను.. నేను రచయితను మాత్రం కాదు అన్నారు.. మానసిక పరిపక్వత రావాలంటే పుస్తకాలు చదవాలని సూచించారు.. భారతీయ ఆలోచనా విధానం నుంచి వచ్చినవాడిని.. లెఫ్టిస్ట్, రైటిస్ట్ అనేది కాకుండా.. బ్యాలెన్స్ ముఖ్యం అని వ్యాఖ్యానించారు.. చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవడం అలవాటుగా చేసుకున్నా.. సూర్యుడిని కబళించింది పుస్తకంలో మాలతి అనే క్యారెక్టర్ లో ధైర్య సాహసాలు, మేధస్సు కనిపిస్తాయని తెలిపారు.. భారతీయ స్వాతంత్ర్యం, ఆనాటి సంస్కృతి, సంప్రదాయాలు పుస్తకంలో కనిపిస్తాయి.. మనది మాతృస్వామ్య వ్యవస్థ… అందుకే మహిళలకు ఆది నుంచి పెద్దపీట వేస్తున్నాం అన్నారు పవన్ కల్యాణ్.. నేను పూజించేది దుర్గా దేవిని.. ప్రతి మహిళను దుర్గాదేవిగా భావిస్తాను అని వెల్లడించారు పవన్ కల్యాణ్.. మన దేశంలో స్త్రీకి అత్యున్నత విలువలు ఉన్నాయి.. జనసేన మహిళా విభాగానికి ఝాన్సీ వీరమహిళగా పేరు పెట్టాం అన్నారు. మా అమ్మ వంట గది నుంచే ప్రపంచాన్ని చూసిందన్నారు.. మా అమ్మ, వదిన పెంపకంలో పెరిగాను అని తెలిపారు. 33 శాతం మహిళలకు రిజర్వేషన్లను నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకువచ్చింది, అవి త్వరలో అమలు కాబోతున్నాయి అని వెల్లడించారు జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్..
అధిష్టానానికి ఓ మంత్రిపై కొండా మురళీ ఫిర్యాదు
కాంగ్రెస్ లో మరోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. అధిష్టానానికి ఓ మంత్రి పై కొండా మురళీ ఫిర్యాదు చేశారు. వరంగల్ జిల్లా రాజకీయాలలో ఆ మంత్రి మితిమీరిన జోక్యం, మేడారం పనుల వ్యవహారాల్లో ఆయన సొంత కంపెనీలకు ఇచ్చుకున్న టెండర్ల వ్యవహారాలపై కాంగ్రెస్ అధ్యక్షులు ఖర్గేకు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఫిర్యాదు చేశారు. ఫోన్ లో మాట్లాడిన కొండా మురళీధర్‌రావు.. ప్రస్తుతం జిల్లాలో జరుగుతున్న అంశాలను సమగ్రంగా వివరించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మీనాక్షి నటరాజన్ లకు కూడా మేడారం పనుల వ్యవహారాలు, వరంగల్ జిల్లా రాజకీయాల్లో ఓ మంత్రి పెడుతున్న ఇబ్బందులను కొండా దంపతులు నివేదించినట్ల సమాచారం. తమ జిల్లాలో.. తన శాఖలో ఆయన పెత్తనం ఏంటని అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. గతంలో కూడా కొండా దంపతులు వరంగల్ కు చెందిన కాంగ్రెస్ లీడర్ల మధ్య విభేధాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. దీనిపైన కాంగ్రెస్ క్రమశిక్షణ వ్యవహారాల కమిటీ కలుగజేసుకుని వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టింది.
గాంధీపై సినీ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ అనుచిత వ్యాఖ్యలు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన బల్మూరి వెంకట్
మహాత్మా గాంధీ పై సినీ నటుడు శ్రీకాంత్ భరత్ చేసిన అనుచిత వ్యాఖ్యల పై ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫిర్యాదు చేశాడు. సైబర్ క్రైమ్ ఏసీపీ శివ మూర్తి ని కలిసి జాతిపిత మహాత్మా గాంధీ జీ పై సోషల్ మీడియాలో సినీ నటుడు చేసిన అనుచిత వాఖ్యల పై చర్యలు తెవాకోవాలని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కోరారు. ఈ సందర్భంగా బల్మూరి వెంకట్ మాట్లాడుతూ.. సినీ నటుడు కొద్ది రోజులుగా గాంధీ జీ ని ఉద్దేశించి అసభ్య పోస్టులు పెడుతున్నాడు.. దేశానికి స్వాతంత్ర సాధనలో గాంధీ జీ ది ప్రత్యేక పాత్ర ఉంది.. శ్రీకాంత్ అయ్యాంగార్ అదొక హీరో ఇజం అనుకుంటున్నాడు.. మా అసోసియేషన్ నుండి నటుడు శ్రీకాంత్ ను తొలగించాలని వారిని కలిసి కోరుతాను అని తెలిపారు. తోటి నటుడు ఇలాంటి అసభ్యకర పోస్టులు చేస్తుంటే.. స్పందించాల్సిన అవసరం సినీ పెద్దలపై ఉందని గుర్తు చేశారు. చిరంజీవి, నాగార్జున, మంచు విష్ణు, అల్లు అర్జున్ స్పందించాలని కోరారు. మీ సినిమాల్లో ఇలాంటి వ్యక్తులకు అవకాశం ఇవ్వకుండా వెలెయ్యాలన్నారు.. గాంధీ జీ పై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే ఎవ్వరు స్పందించలేదు.. తెలంగాణా పోలీసులు శ్రీకాంత్ అయ్యాంగార్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.. సినిమాటోగ్రాఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దిల్ రాజు దృష్టి కి కూడా తీసుకెళ్తానని తెలిపారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కుదరదని హెచ్చరించారు.
బీజేపీలో చేరిక గాయకుడు పవన్ సింగ్.. బీహార్‌లో పోటీ కోసమేనా?
యువతకు ఇష్టమైన నేత, పవర్ స్టార్‌గా పేరు గాంచిన భోజ్‌పురి గాయకుడు పవన్ సింగ్ తిరిగి బీజేపీ గూటికి చేరారు. 2024, మే నెలలో ఎన్డీఏ అభ్యర్థిపై స్వతంత్ర అభ్యర్థిగా కరకట్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ సమయంలో బీజేపీ నుంచి పవన్ సింగ్ బహిష్కరణకు గురయ్యారు. తాజాగా బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన తిరిగి సొంత గూటికి చేరడంతో మళ్లీ ఊహాగానాలు మొదలయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేయొచ్చని తెలుస్తోంది. ఈ సందర్భంగా పవన్ సింగ్ మాట్లాడుతూ.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదని తెలిపారు. తాను బీజేపీకి నిజమైన సైనికుడినని చెప్పారు. పోటీ చేసే ఉద్దేశంతో బీజేపీలో చేరలేదని పేర్కొన్నారు. పార్టీ పట్ల విధేయత కలిగిన నేతగా చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే పవన్ సింగ్ భార్య జ్యోతి సింగ్ ఇటీవల ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ను కలిశారు. జన్ సురాజ్ పార్టీ నుంచి పోటీ చేయొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం పవన్ సింగ్-జ్యోతి సింగ్ మధ్య వైవాహిక విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జ్యోతి సింగ్.. ప్రశాంత్ కిషోర్‌ను కలిసి తన గోడు వెళ్లబుచ్చుకుంది.
చైనాకు ధీటుగా అణ్వాయుధ ప్రదర్శన.. బలాన్ని ప్రదర్శించిన కిమ్
గత నెలలో చైనా భారీ కవాతు నిర్వహించింది. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌పై విజయానికి 80 ఏళ్ల పూర్తయిన సందర్భంగా బీజింగ్‌లో భారీ కవాతు నిర్వహించింది. ఈ కార్యక్రమానికి రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సహా 25 దేశాధినేతలంతా హాజరయ్యారు. తొలిసారి అధునాతన యుద్ధ విమానాలు, క్షిపణులను ప్రదర్శించింది. ప్రపంచానికి ఒక సందేశం పంపించేందుకు చైనా ఈ ప్రదర్శన చేపట్టింది. తాజాగా ఉత్తర కొరియా కూడా భారీ ఆయుధ కవాతు నిర్వహించింది. త్వరలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో కిమ్ కూడా తన బలాన్ని చూపించే ప్రయత్నం చేశాడు. శుక్రవారం ప్యోంగ్యాంగ్‌లో పాలక వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా 80వ వార్షికోత్సవం సందర్భంగా భారీ కవాతు నిర్వహించారు. ఈ కార్యక్రమంతో కిమ్ తన ఆత్మవిశ్వాసాన్ని చూపించారు. సంవత్సరాల తరబడి ఒంటరితనం, ఆంక్షల తర్వాత ప్రపంచ వేదికపై ఉత్తర కొరియా శక్తిని ప్రదర్శించేందుకు ప్రయత్నించినట్లు కనిపించింది.
ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్.. సగం ధరకే స్మార్ట్‌ఫోన్‌లు..
ఫ్లిప్‌కార్ట్‌లో కొత్త సేల్ ప్రారంభమైంది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్ ప్రారంభమైంది. ఈ సేల్‌ను సద్వినియోగం చేసుకుని డిస్కౌంట్ ధరలకు అనేక స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయవచ్చు. స్మార్ట్‌ఫోన్‌లు మాత్రమే కాకుండా, ఈ సేల్ గృహోపకరణాలు, ఇతర ఉత్పత్తులపై కూడా డిస్కౌంట్లను అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఐఫోన్ 16, నథింగ్ ఫోన్ 3, గూగుల్ పిక్సెల్ వంటి ఫోన్‌లపై డిస్కౌంట్లను అందిస్తోంది. స్మార్ట్‌ఫోన్‌లతో పాటు, మీరు టీవీలు, ల్యాప్‌టాప్‌లు, ఇతర గృహోపకరణాలను కూడా తగ్గింపు ధరలకు కొనుగోలు చేయొచ్చు. ఐఫోన్ లవర్స్ ఈ సేల్ ను మిస్ చేసుకోకండి. ఐఫోన్ 16 రూ. 54,999 తగ్గింపు ధరకు లభిస్తుంది. ఇందులో రూ. 3,000 బ్యాంక్ డిస్కౌంట్ కూడా ఉంటుంది. అదనంగా, మీరు iPhone 16 Proని రూ. 84,999కి కొనుగోలు చేయవచ్చు. iPhone 16 Pro Max రూ. 1,02,999కి అందుబాటులో ఉంటుంది. ఈ ధర తగ్గింపు తర్వాత వర్తిస్తుంది. iPhone 14 తగ్గింపు తర్వాత రూ. 42,999కి అందుబాటులో ఉంటుంది. మీరు Samsung Galaxy S24 ను Flipkart సేల్ నుండి రూ.38,999 కు కొనుగోలు చేయవచ్చు. Galaxy A35 5G కూడా రూ.17,999 కు లభిస్తుంది. Samsung Galaxy S24 FE రూ.29,999 కు లభిస్తుంది. Galaxy F36 కేవలం రూ.13,999 కు లభిస్తుంది.
హ్యాపీ బర్త్ డే బిగ్ బీ.. మీతో కలిసి స్క్రీన్ పంచుకోవడం నాకు దక్కిన గౌరవం
బాలీవుడ్ సూపర్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ ఈరోజు 83వ ఏడాదిలోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా అతడికి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక, టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా బిగ్ బీకి బర్త్ డే విషెస్ తెలిపారు. ఈ పోస్టులో ‘‘మీకు దగ్గర ఉండి మీ వర్క్‌ను చూడడం, మీతో కలిసి స్క్రీన్ పంచుకోవడం నాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నాను.. మీరు ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలి అంటూ రెబల్ స్టార్ ప్రభాస్ విషెస్ చేశారు. ఇక, వీరిద్దరి కాంబినేషన్‌లో గతేడాది విడుదలైన ‘కల్కి 2898 ఏడీ’ థియేటర్లలో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే, భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రంలో అమితాబ్ బచ్చన్.. అశ్వత్థామగా, ప్రభాస్ భైరవగా నటించారు. ప్రస్తుతం దీని సీక్వెల్ పనులు కొనసాగుతున్నాయి. అయితే, ప్రస్తుతం ‘కల్కి2’కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. ఈ భారీ ప్రాజెక్ట్ నుంచి ఇప్పటికే దీపిక పదుకొణెను వైజంతి మూవీస్ తొలగించిన విషయం తెలిసిందే. దీంతో కల్కి2 సీక్వెల్‌లో ఆమె పాత్రను ఎవరు పోషిస్తారా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఈ పాత్రలో బాలీవుడ్ క్వీన్ అలియా భట్ నటించనున్నట్లు న్యూస్ వస్తుంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన కోసం అభిమానులు వేచి చూస్తున్నారు.
కాంబినేషన్ అదిరింది.. విజయ్ దేవరకొండ కొత్త మూవీ స్టార్ట్!
రౌడీ బాయ్, స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో నటిస్తున్న కొత్త సినిమా ఈ రోజు హైదరాబాద్ లో పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ చిత్రాన్ని సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. రాజా వారు రాణి గారు సినిమాతో టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న రవి కిరణ్ కోలా ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్వీసీ సంస్థలో వస్తున్న 59వ సినిమా ఇది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన కీర్తి సురేష్ కథనాయికగా నటిస్తోంది. ఇక, ఈ చిత్ర ముహూర్తపు సన్నివేశానికి ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ క్లాప్ ఇవ్వగా, ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. డైరెక్టర్ హను రాఘవపూడి ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు. రూరల్ యాక్షన్ డ్రామా నేపథ్యంతో తెరకెక్కనున్న ఈ సినిమా ఈ నెల 16వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. ఈ ప్రెస్టీజియస్ మూవీని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.