విజయవాడలో క్రిస్మస్ వేడుకలు.. హాజరైన సీఎం జగన్
అధికారంలో ఉన్న వారు ప్రజలకు సేవకులని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. అధికారంలో ఉండి ఇంకా ఒదిగి ఉండేలా నేర్చుకోవాలని, ప్రజలకు ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని సీఎం ప్రార్థించారు. క్రిస్మస్ సందర్భంగా ప్రభుత్వం తేనీటి విందు కార్యక్రమాన్ని విజయవాడ ఏ ప్లస్ కన్వెన్షన్‌లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం వైయస్ జగన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రైస్తవ మత పెద్దలు క్రిస్మస్ సందేశాన్ని వినిపించారు. మన హృదయం అనే ఇంటికి క్రీస్తు యేసును ఆహ్వానించడమే ఈ క్రిస్మస్ సందేశమని దైవజనులు జోసఫ్ తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి వైయస్ జగన్ తన సందేశాన్ని వినిపించారు. ఆయన మాట్లాడుతూ..ఈ రోజు నాతో పాటు వేదికపై ఉన్న పెద్దలు మోస్ట్ రెవ. జోసప్, డాక్టర్ జార్జ్, పాస్టర్ జాన్‌వెస్లీ, బాలస్వామి, ఇక్కడ ఉన్న పాదర్లు, పాస్టర్లే కాకుండా ఇక్కడికి వచ్చినా, రాలేకపోయినా నా అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములందరికీ కూడా ఈ క్రిస్మస్‌మాసంలో ఈ వేడుక జరుపుకుంటున్న శుభసందర్భంలో అందరికీ మేరీ క్రిస్మస్ తెలియజేస్తున్నాను. దేవుడి దయతో ఇంకా మంచి చేసే అవకాశం ఇవ్వాలని, ఇంకా ఒదిగి ఉండే అవకాశం దేవుడు ఇవ్వాలని, ఇంకా గొప్ప సేవకుడిగా మీ అందరికీ సేవ చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రతి ఇంట్లో ఉన్న వారికి మరొక్కసారి మేరీ క్రిస్మస్ శుభాకాంక్షలు అంటూ సీఎం వైయస్ జగన్ తన సందేశాన్ని అందించారు.
పార్లమెంట్ లో స్పెషల్ మిల్లెట్ లంచ్… ఆస్వాదించిన మోడీ
అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరం(మిల్లెట్ ఇయర్) 2023ని పురస్కరించుకుని వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర తోమర్ ఏర్పాటు చేసిన లంచ్‌లో తోటి పార్లమెంటు సభ్యులతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఆనందించారు. దాదాపు 40 నిమిషాల పాటు ఈ కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. భోజనం చేస్తున్నప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ పక్కన వ్యవసాయ మంత్రి నరేంద్ర తోమర్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌కర్, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూర్చున్నారు. ఈ తృణధాన్యాల భోజనం( మిల్లెట్ లంచ్) గురించి ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. 2023ని అంతర్జాతీయ మిల్లెట్ ఇయర్‌గా సిద్ధమవుతున్న తరుణంలో, పార్లమెంట్‌లో మిల్లెట్ వంటకాలు వడ్డించే విలాసవంతమైన మధ్యాహ్న భోజనానికి హాజరయ్యామన్నారు. పార్టీలకు అతీతంగా ఈ భోజనంలో పాల్గొనడం బాగుందన్నారు.
పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తో సీఎం కేసీఆర్ భేటీ
టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారిన తర్వాత జాతీయ స్థాయి నేతలతో సీఎం కేసీఆర్ భేటీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మంగళవారం సాయంత్రం సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో దేశంలోని ప్రస్తుత రాజకీయాలతో పాటు పలు అంశాలపై చర్చించారని సమాచారం. పలు కార్యక్రమాల నిమిత్తం ఇవాళ మధ్యాహ్నం సీఎం భగవంత్ మాన్ హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు. భారత రాష్ట్ర సమితి పార్టీ కేంద్ర కార్యాలయాన్ని కేసీఆర్ ఢిల్లీలో ఇటీవలే ప్రారంభించిన సంగతి తెలిసిందే. నాటి నుంచి పలు రాష్ట్రాలకు చెందిన ఆయా పార్టీల నాయకులు, రైతు సంఘాల నేతలు కేసీఆర్‌తో సమావేశమవుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న రైతు వ్యతిరేక నిర్ణయాలు, పథకాలు, ఇతర అంశాలపై చర్చించారు. బీజేపీపై పోరాటం విషయంలో కేసీఆర్‌కు పలువురు నేతలు మద్దతు తెలుపుతున్నారు. ఆప్ నేతలు కూడా కేసీఆర్ కు బాసటగా నిలుస్తున్నారు. ఇదిలా ఉంటే.. 24న పంజాబ్ స్పీకర్ సర్దార్ కుల్తార్‌సింగ్ సంధ్వాన్ తెలంగాణకు రానున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ స్పీకర్ జైకిషన్ సింగ్ రౌరీ, రాజ్యసభ సభ్యుడు విక్రమ్‌జీత్ సింగ్ సాహ్ని, ఎమ్మెల్యే కుల్వంత్ సింగ్ పండోరి, మరో ఇద్దరు కూడా హైదరాబాద్‌కు రానున్నారు.
మా సీఎం తాగి రాష్ట్రాన్ని నడుపుతున్నారు.. అకాలీదళ్ ఎంపీ సంచలన ఆరోపణలు
పంజాబ్ ముఖ్యమంత్రిపై శిరోమణి అకాలీదళ్ ఎంపీ హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ మంగళవారం లోక్‌సభలో సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మద్యం మత్తులో రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని వ్యాఖ్యానించారు. దేశంలో డ్రగ్స్ దుర్వినియోగం సమస్య, ప్రభుత్వం తీసుకున్న చర్యలపై లోక్‌సభలో కాల్ అటెన్షన్ తీర్మానంపై చర్చను ప్రారంభించిన హర్‌సిమ్రత్ కౌర్ బాదల్.. మద్యం తాగి పార్లమెంట్‌లో కూర్చున్న వ్యక్తి ఇప్పుడు డ్రగ్స్ సమస్యను ఎదుర్కొంటున్న రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని ఎద్దేవాచ చేశారు. మాన్ దగ్గర కూర్చునే సభ్యులు తమ సీట్లను మార్చాలని కోరినట్లు కూడా ఆమె చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీ సర్కారుపై హర్‌సిమ్రత్ విమర్శలు చేసిన సమయంలో సభలో ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా నవ్వులు చిందించారు. పంజాబ్‌లో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ బాదల్ ఆరోపించారు. ముఖ్యమంత్రి ఇలాగే ఉంటే రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చునని, రోడ్లపై ‘డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్’ అని రాసి ఉన్నారని, అయితే తాగి రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని ఆమె అన్నారు.
కొడుకు ఫోటో షేర్ చేసిన షర్మిల.. వైరల్ అవుతున్న ఫోటోలు
ఏపీ ముఖ్యమంత్రి జగన్ చెల్లి షర్మిల. ప్రస్తుతం తెలంగాణలో కొత్త పార్టీ పెట్టి ప్రజల మన్ననలు అందుకోవడానికి ప్రయత్నిస్తున్న విషయం తెల్సిందే. షర్మిల భర్త అనిల్ కుమార్ సైతం ఒక పాస్టర్ గా అందరికి సుపరిచితుడే. వీరందరిని ప్రతి ఒక్కరు నిత్యం టీవీల్లో, సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం. కానీ, వీరి పిల్లలు మాత్రం ఎప్పుడు బయట కనిపించిందే లేదు. సాధారణంగా సినీ ప్రముఖుల పిల్లలను చూడాలని అభిమానులు ఎలా కోరుకుంటారో.. రాజకీయ నేతల పిల్లలు ఎలా ఉంటారు అనేది చాలామందికి ఆసక్తి. ఇక ఇటీవలే షర్మిల తన ముద్దుల తనయుడి ఫోటోను షేర్ చేయడం, అది కాస్తా వైరల్ గా మారడం జరిగిపోయాయి. షర్మిలకు ఏకైక వారసుడు వైఎస్ రాజారెడ్డి. ప్రస్తుతం రాజా విదేశాల్లో చదువుకుంటున్నాడు. ఇక ఈ మధ్యనే రాజా పుట్టినరోజు కావడంతో షర్మిల, కొడుకుకు ప్రత్యేకంగా విషెస్ తెలిపింది. సముద్రపు ఒడ్డున తల్లిని పట్టుకొని రాజా చిరు మందహాసం చేస్తూ కనిపించాడు.
యూట్యూబ్ యూజర్లకు గుడ్‌న్యూస్.. త్వరలో కొత్త ఫీచర్
ప్రస్తుతం ఎక్కడ చూసినా అందరూ యూట్యూబ్ వీడియోలతో కాలం గడిపేస్తున్నారు. దీంతో యూట్యూబ్ కూడా ఎప్పటికప్పుడు ఫీచర్లను అప్‌డేట్ చేస్తూ యూజర్లకు సరికొత్త అనుభూతిని కలిగిస్తోంది. చాలా భాషల్లో వాయిస్ సెర్చ్, టైపింగ్ వర్డ్స్ రూపంలో ఇంటర్నెట్ సెర్చ్ ఫెసిలిటీ తీసువస్తున్నట్లు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో యూట్యూబ్ ఆడియో ట్రాక్ ఆప్షన్‌ను కూడా త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈ ఆప్షన్ అందుబాటులోకి వస్తే ఓటీటీల తరహాలో నచ్చిన ఆడియో ట్రాక్‌ను ఎంచుకునే అవకాశం ఉంటుంది. దీంతో విభిన్న భాషల్లో వీడియోలను చూడవచ్చు. వీడియో చూసేటప్పుడు ఆడియో ట్రాక్ మార్చుకునేలా ఈ ఫీచర్ ఉంటుందని యూట్యూబ్ వర్గాలు వెల్లడించాయి. యూట్యూబ్ ఆడియో ట్రాక్ ఆప్షన్ విషయాన్ని గూగుల్ ఫర్ ఇండియాలో యూట్యూబ్ ప్రకటించినట్లు టెక్ క్రంచ్ సంస్థ రిపోర్ట్ చేసింది. ఈ ఫీచర్ ముందుగా హెల్త్ ఆడియోలకు అందుబాటులోకి వస్తుందని టెక్ క్రంచ్ వివరించింది.
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కులాల వారీగా జనగణన జరగలేదు
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి భారత ప్రభుత్వం జనాభా గణనలో షెడ్యూల్డ్ కులం (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ) మినహా కులాల వారీగా జనాభాను లెక్కించలేదని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇవాళ తెలిపింది. ప్రతిపాదిత 2021 జనాభా లెక్కల ప్రస్తుత స్థితిపై పార్లమెంటు సభ్యులు ప్రశ్నలు అడిగారు. దీంతోపాటు ప్రతిపాదిత జనాభా గణనలో కులం, ఉపకులాల ప్రాతిపదికన జనగణన నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తోందా అని సభ్యులు పార్లమెంట్‌లో అడిగారు. ఆ ప్రశ్నలకు హోం మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ సమాధానమిస్తూ.. 2021 జనాభా లెక్కలను నిర్వహించాలనే ప్రభుత్వ ఉద్దేశాన్ని మార్చి 28, 2019న గెజిట్ ఆఫ్ ఇండియాలో తెలియజేసినట్లు తెలిపారు. కొవిడ్ మహమ్మారి వ్యాప్తి కారణంగా.. 2021లో జరగాల్సిన జనగణనతో పాటు సంబంధిత కార్యకలాపాలు తదుపరి ఉత్తర్వుల వరకు వాయిదా వేయబడ్డాయని ఆయన చెప్పారు. రాజ్యాంగంలోని ఆర్డర్ ప్రకారం కాలానుగుణంగా సవరించబడిన షెడ్యూల్డ్ కులాలు(ఎస్సీలు), షెడ్యూల్డ్ తెగలు(ఎస్టీలు)గా ప్రత్యేకం నోటిఫై చేయబడిన కులాలు, తెగలు లెక్కించబడ్డాయి. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి భారత ప్రభుత్వం జనాభా గణనలో ఎస్సీ, ఎస్టీలు మినహా కులాల వారీగా జనాభాను లెక్కించలేదని ఆయన బదులిచ్చారు. ప్రతిపాదిత జనాభా లెక్కల కోసం ఖర్చు చేసే నిధుల వివరాలను అడిగినప్పుడు.. 2021 భారత జనాభా లెక్కల అమలు కోసం ప్రభుత్వం రూ. 8754.23 కోట్లను ఆమోదించిందని చెప్పారు.
పాక్ కు ఘోర పరాభవం.. ఇంగ్లండ్ చేతిలో చిత్తు చిత్తు
పాకిస్థాన్‌కు సొంతగడ్డపై ఘోర పరాభవం ఎదురైంది. ఇంగ్లండ్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను 0-3 తేడాతో పాకిస్థాన్ కోల్పోయింది. మంగళవారం ముగిసిన మూడో టెస్టులో పాకిస్థాన్‌పై 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఘనవిజయం సాధించింది. 167 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 28.1 ఓవర్లలో 2 వికెట్లకు 170 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. బెన్ డక్కెట్(78 బంతుల్లో 12 ఫోర్లతో 82 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగగా.. బెన్ స్టోక్స్(35 నాటౌట్), జాక్ క్రాలీ(41) రాణించారు. తాజా ఓటమితో పాకిస్థాన్ సొంతగడ్డపై వరుసగా నాలుగు టెస్ట్ మ్యాచ్‌లు ఓడిపోయింది. ఒక ఏడాది కాలంలో సొంతగడ్డపై ఇలా నాలుగు మ్యాచ్‌ల్లో వరుసగా పాకిస్థాన్ ఓడటం ఇదే తొలిసారి. మరోవైపు 17 ఏళ్ల తర్వాత పాక్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్ టెస్ట్ టీమ్ చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. పాకిస్థాన్ గడ్డపై ఆ జట్టును వైట్ వాష్ చేయడం ఇదే తొలిసారి. దీంతో బాబర్ ఆజమ్ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నట్లు అయ్యింది. అటు ఈ ఏడాది పాకిస్థాన్ సొంతగడ్డపై వరుసగా నాలుగు సిరీస్‌లలో ఓటమిపాలైంది. ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ ఓడిన పాకిస్థాన్.. టీ20 సిరీస్‌లోనూ ఓటమిపాలైంది. అంతేకాకుండా ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ ఓడిన బాబర్ సేన.. తాజాగా టెస్ట్ సిరీస్‌ను కోల్పోయింది. ఇంగ్లండ్‌పై తాజా ఓటమితో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ రేసు నుంచి తప్పుకున్న పాకిస్థాన్.. పాయింట్ల టేబుల్‌లో ఏడో స్థానంలో నిలిచింది.