అల్లు రామలింగయ్య తెరపై కనిపిస్తే చాలు, నవ్వులు ఇట్టే పూసేవి. డాక్టర్ గరికపాటి రాజారావు నిర్మించిన ‘పుట్టిల్లు’ చిత్రం ద్వారా అల్లు రామలింగయ్య చిత్రసీమకు పరిచయం అయ్యారు. ఇదే చిత్రంతో జమున కూడా తెరకు పరిచయం కావడం విశేషం. ‘పరివర్తన, వద్దంటే డబ్బు, దొంగరాముడు, సంతానం, మిస్సమ్మ’ చిత్రాలతో అల్లు రామలింగయ్య మంచి గుర్తింపు సంపాదించారు. ‘మంచిమనసుకు మంచిరోజులు’లో ప్రతినాయకుని అనుచరునిగా నటించి మెప్పించారు. పెద్దా,చిన్నా అన్న తేడా లేకుండా ఎవరు ఏ పాత్ర ఇచ్చినా కాదనకుండా నటించేవారు రామలింగయ్య. పైగా ఆయనకు హోమియోపతి వైద్యంలోనూ మంచి ప్రవేశం ఉంది. దాంతో చిత్రసీమలోని వారికి తగిన వైద్యం చేస్తూ సాగేవారు. అందువల్ల అందరితోనూ ఇట్టే కలిసిపోయేవారు. అందరూ ఆయనంటే ఎంతగానో అభిమానించేవారు. ‘నాదీ ఆడజన్మే’ చిత్రంలో సావిత్రి, జమున అన్నయ్యగా కరుణరసమైన పాత్రలో అల్లు రామలింగయ్య ఆకట్టుకొనే అభినయం ప్రదర్శించారు. యన్టీఆర్, ఏయన్నార్ చిత్రాలలో తప్పకుండా అల్లు రామలింగయ్యకు తగిన పాత్రలు ఉండేవి. అల్లు కూడా ఆ పాత్రల్లో తనదైన బాణీ పలికించేవారు. దాదాపు వెయ్యి చిత్రాలలో నటించి అలరించారు అల్లు రామలింగయ్య.
అల్లు రామలింగయ్య తనయుడు అల్లు అరవింద్ కూడా కొన్ని చిత్రాలలో నటించారు. కానీ, తండ్రిలాగా ఆకట్టుకోలేక పోయారు. దాంతో నిర్మాతగా మారి గీతా ఆర్ట్స్ పతాకంపై జనం మెచ్చే చిత్రాలను అందించే స్థాయికి ఎదిగారు అరవింద్. ఇక అల్లువారి చిన్నకూతురు భర్త చిరంజీవి తెలుగు చిత్రసీమలో మెగాస్టార్ గా జేజేలు అందుకున్నారు. అల్లువారి తనయుని కొడుకు అల్లు అర్జున్, కూతురు కొడుకు రామ్ చరణ్ సైతం తాతయ్య పేరు నిలుపుతూ కామెడీలో మంచి టైమింగ్ చూపిస్తూనే స్టార్ హీరోస్ గా రాణిస్తున్నారు. తెలుగు చిత్రసీమలో అల్లువారి కుటుంబం అల్లుకు పోయింది. ఆయన చిన్న మనవడు శిరీష్ సైతం హీరోగా నటిస్తున్నాడు. తెలుగు చిత్రసీమలో హాస్యం గురించిన చర్చ సాగిన ప్రతీసారి అల్లు రామలింగయ్య పేరు వినిపిస్తూనే ఉంటుంది. ఈ నాటికీ బుల్లితెరపై కనిపించే ఆ నాటి అల్లువారి అభినయం చూసి జనం మురిసిపోతూనే ఉండడం విశేషం!