విద్యా సంస్థల ప్రత్యక్ష తరగతులపై తెలంగాణ ప్రభుత్వం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. కొన్ని రాష్ట్రాలు ప్రత్యక్ష తరగతులకు సమాయత్తం అవుతున్నాయి. ఒకటి రెండు రాష్ట్రాల్లో పాక్షికంగా ప్రారంభమయ్యాయి కూడా. ఈ పరిస్ధితుల్లో… తెలంగాణ ప్రభుత్వం ప్రత్యక్ష తరగతులపై దృష్టి పెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.గత రెండేళ్లుగా విద్యార్థులు తరగతి గది బోధనకు దూరం అయ్యారు. పాఠశాల విద్యార్థులయితే పరీక్షలు కూడా లేకుండానే పై తరగతులకు వెళ్లారు. డిజిటల్ తరగతులు నిర్వహిస్తున్నా.. ఎంత వరకు బుర్రకు ఎక్కుతున్నాయో తెలియని పరిస్థితి.
ఎంత మంది విద్యార్థులు స్కూలు మానేసారో క్లారిటీ లేదు. తెలంగాణ ప్రభుత్వం జులై ఒకటి నుంచి ఫిజికల్ క్లాసెస్ ప్రారంభించాలని అనుకున్నా కోవిడ్ కేసులు, థర్డ్ వేవ్ వస్తుందన్న ప్రచారంతో వెనకడుగు వేసింది. ఆన్లైన్ ,డిజిటల్ తరగతులే నిర్వహించాలని ఆదేశించింది. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో కోవిడ్ పరిస్థితుల పై చర్చించినా ప్రత్యక్ష తరగతుల పై మాత్రం నిర్ణయం తీసుకోలేదు… విద్యా శాఖ అధికారులు మాత్రం ప్రభుత్వం ఆదేశిస్తే ప్రత్యక్ష తరగతులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని అంటున్నారు. మరోవైపు విద్యార్థులు ఇంకా ఇంటికే పరిమితమైతే ఎన్నో అనర్థాలు జరుగుతాయని మేధావులు అంటున్నారు. చిన్న పిల్లలకు కరోన ప్రభావం అంతగా ఉండక పోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇక పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కూడా ఏదో ఒక విధంగా విద్యా సంస్థలు ప్రారంభించాలని సూచించింది.
బాల్య వివాహాలు జరుగుతున్నాయని, పిల్లలు చదువుకు దూరం ఆవుతున్నారని పేర్కొంది. తల్లి దండ్రులు, పిల్లలకి మధ్య సంబంధాలలో తేడా వస్తుందని రిపోర్ట్ ఇచ్చింది. విద్యా సంస్థల్లో ప్రత్యక్ష తరగతులు ప్రారంభించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి . ప్రైవేట్ విద్యా సంస్థలూ కోరుతున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ప్రారంభించాయని, మరికొన్ని రాష్ట్రాలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయని అంటున్నాయి..ప్రభుత్వం ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోకున్నా… ప్రస్తుత పరిస్ధితుల్లో ప్రత్యక్ష తరగతుల ప్రారంభంపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఎప్పటి నుండి ప్రారంభించాలి, ఏ తరగతులకు ప్రారంభించాలి అనే దానిపై ఈ వారం లోనే డిసైడ్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇంటర్ మొదటి సంవత్సరం ఆన్లైన్ తరగతుల పై ఇంటర్ బోర్డ్ ఇంకా నిర్ణయం తీసికోలేదు.. వెంటనే ఆన్లైన్ తరగతులు అయిన ప్రారంభించాలనే డిమాండ్ వస్తోంది.