Unknow Persons Following Pawan Kalyan In Hyderabad: గుర్తు తెలియని కొందరు ఆగంతకులు పవన్ కళ్యాణ్‌ను వెంబడిస్తున్నారని జనసేన నేతలు ఆందోళన చెందుతున్నారు. గత రెండు, మూడు రోజుల నుంచి.. హైదరాబాద్‌లోని పవన్ ఇంటి ఒక వాహనం చక్కర్లు కొట్టడాన్ని గమనించారు. ఈరోజు పవన్ ఇంటి వద్ద కారు ఆపి.. సెక్యూరిటీతో గొడవకు దిగారు. ఈ వ్యవహారంపై జనసేన తెలంగాణ ఇన్‌ఛార్జ్ శంకర్ గౌడ్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వీడియో రికార్డింగ్స్‌తో పాటు ఇతర సాక్ష్యాలను పోలీసులకు సమర్పించారు. ఆ వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకొని, దీని వెనుక ఎవరున్నారో నిగ్గు తేల్చాలని పోలీసుల్ని కోరారు.
ఈ వ్యవహారంపై జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్‌ను ఈమధ్య అనుమానాస్పద వ్యక్తులు ఎక్కువగా అనుసరిస్తున్నారన్నారు. విశాఖ సంఘటన తరువాత పవన్ ఇల్లు, పార్టీ కార్యాలయం దగ్గర సందేహాస్పద వ్యక్తులు తచ్చాడుతున్నారని పేర్కొన్నారు. పవన్ ఇంటి నుంచి బయటకు వెళుతున్నప్పుడు, అలాగే తిరిగి వస్తున్నప్పుడు.. ఆయన వాహనాన్ని వెంబడిస్తున్నారని తెలిపారు. ఆ వాహనంలో ఉన్న వ్యక్తులు పవన్ కారుని నిశితంగా పరిశీలిస్తున్నారని.. వెంబడిస్తున్న ఆ వ్యక్తులు అభిమానులు ఎంతమాత్రం కాదని పవన్ వ్యక్తిగత రక్షణ సిబ్బంది చెప్తోందన్నారు. ఆగంతుకుల కదలికలు అనుమానించే విధంగా ఉన్నాయని.. ఇవాళ కారులో, మంగళవారం ద్విచక్రవాహనాలపై ఆ ఆగంతకులు అనుసరించారని చెప్పారు.
అంతకుముందు సోమవారం అర్థరాత్రి ముగ్గురు వ్యక్తులు పవన్ ఇంటి వద్దకు వచ్చి గొడవ పడ్డారని నాదెండ్ల మనోహర్ వివరించారు. పవన్ ఇంటి ముందు వారు కారు ఆపడంతో, సెక్యూరిటీ సిబ్బంది నివారించారని.. అప్పుడు వాళ్లూ బూతులు తిడుతూ, పవన్‌ని దుర్భాషలాడుతూ గొడవ చేశారని అన్నారు. సిబ్బందిని కవ్వించి, రెచ్చగొట్టే ప్రయత్నం చేశారన్నారు. అయినా సెక్యూరిటీ సిబ్బంది సంయమనం పాటించి, ఈ సంఘటనకు సంబంధించిన వీడియో తీశారని వెల్లడించారు. పవన్ కళ్యాణ్‌పై దాడి చేయొచ్చని ఇంతకుముందే కేంద్ర ఇంటెలిజెన్స్ హెచ్చరించిందని, ఈ ఆగంతుల కదలికలు అలాగే కనిపిస్తున్నాయని నాదెండ్ల మనోహర్ అనుమానం వ్యక్తం చేశారు.