వచ్చే నెలలో బీజేపీ కార్యవర్గ సమావేశం తెలంగాణలో నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ కార్యవర్గ సమావేశాలకు ప్రధాని మోడీ కూడా హాజరవుతున్నారు. అయితే ఇప్పటికే కేంద్రమంత్రులు తెలంగాణలో పర్యటిస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో కేంద్ర విమానయాన, రోడ్లు భవనాల శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గత ఎనిమిది సంవత్సరాల పాలనలో చేసిన అభివృద్ధి పథకాలను పల్లె పల్లెకు తీసుకుని వెళతామని ఆయన వెల్లడించారు. మోడీ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. మా సిద్ధాంతం ప్రకారం కులం, మతం, వర్గం వంటి భేధ భావాలు వుండవని ఆయన స్పష్టం చేశారు.
ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అదేవిధంగా కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన వెల్లడించారు. సూర్యాపేట నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు, నాయకులను కలిసి పార్టీ విస్తరణ కొరకు పనిచేస్తామని ఆయన తెలిపారు. సీఎ కేసీఆర్ నీళ్లు, నిధులు, నియామకం పేరుతో అధికారంలోకి వచ్చారు. కానీ వీటిలో ఏ ఒక్కటి అమలు చేయలేదని ఆయన మండిపడ్డారు. సీఎం కేసీఆర్ పాలన పట్ల ప్రజలలో అసంతృప్తి నెలకొని ఉందని, కేంద్ర ప్రభుత్వం భయం వల్లనే కేసీఆర్ ముందుగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం దేశంలో ఎక్కడ లేదని వీకే సింగ్ ఎద్దేవా చేశారు.