హైదరాబాద్ మహానగరంలో దారుణాలు, దాడులు, అత్యాచారాలు, హత్యలు, దొంగతనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో బాలికలపై వేధింపులు, అత్యాచారాలు జరగడం ఆందోళనకరంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ సామూహిక అత్యాచార ఘటన మరవకముందే నగరంలో మరో దారుణం జరిగింది. ప్రేమ పేరుతో ఇద్దరు మైనర్ అక్కా(17) చెల్లెళ్లను(15) ఇద్దరు యువకులు మోసం చేశారు. ఈ ఘటన చిలకలగూడ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది.
సికింద్రాబాద్ చిలకలగూడలో మైనర్ అక్కాచెల్లెళ్లపై అత్యాచారం చేసిన ఘటనలో ఇద్దరు యువకులపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. చిలకలగూడ పోలీసుల కథనం ప్రకారం.. అంబర్‌పేట్‌కు చెందిన ఇంతియాజ్(21), నవాజ్(21) యువకులు ఇద్దరు అక్కాచెల్లెళ్లని ఫేస్‌బుక్‌లో పరిచయం చేసుకున్నారు. మొదట స్నేహితులుగా ఉన్న వారు క్రమంగా ఆ యువకుల ప్రేమలో పడ్డారు. వాళ్ల మధ్య సాన్నిత్యం పెరిగి.. ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఆ యువకులతో శారీరకంగా కలిశారు. మైనర్ బాలికల తండ్రికి ఈ విషయం తెలిసి యువకులను పలుమార్లు హెచ్చరించారు. తమ కుమార్తెల జోలికి రావొద్దని వార్నింగ్ కూడా ఇచ్చారు.
అయినా వారు వినకపోవడంతో బాధిత తండ్రి తమను ఆశ్రయించినట్లు పోలీసులు తెలిపారు. మైనర్లయిన తమ కుమార్తెలపై రెండేళ్లుగా నవాజ్, ఇంతియాజ్‌లు అత్యాచారం చేస్తున్నట్లు ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గత రెండు సంవత్సరాలుగా ప్రేమ పేరుతో అత్యాచారం చేసి బ్లాక్ మెయిల్ చేసినట్లు సమాచారం.