మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్‌కు సమయం దగ్గర పడుతోంది.. దీంతో ప్రధాన పార్టీలు గెలిచేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి.. ఆరోపణలు, విమర్శలు ఎలా ఉన్నా.. మద్యం ఏరులైపారుతోంది.. ఓటర్లను డబ్బులు ఆశచూపి ఆకట్టుకుంటున్నారు.. మూడు ప్రధాన పార్టీలు.. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ ఉంటుందని సర్వేలు చెబుతున్నాయి.. ఇక, బీఎస్పీ, కోదండరాం పార్టీ, ప్రజాశాంతి పార్టీ, కొందరు స్వతంత్ర అభ్యర్థులు కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.. అయితే, ఫైనల్‌గా మునుగోడు ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీదే విజయం అంటున్నారు సీపీఐ నేత చాడ వెంకట్‌రెడ్డి.. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి పట్ల తిరస్కరణ మొదలైందన్న ఆయన… మునుగోడులో గెలిచేది టీఆర్‌ఎస్ పార్టీయే అని ధీమా వ్యక్తం చేశారు.
Read Also: Munugode Bypoll : ఆ విషయంలో బీజేపీ ముందు టీఆర్ఎస్ కూడా నిలవడంలేదు..!
రాజగోపాల్ రెడ్డికి ప్రతిఘటన ఎదురైతే బూతులు మాట్లాడుతున్నారని విమర్శించారు చాడ వెంకట్‌రెడ్డి… అన్నదమ్ముల అనుబంధాన్ని (కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి-రాజగోపాల్‌రెడ్డి) కూడా రాజకీయాలకు వాడుకోవాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు.. కాగా, కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. ఆ తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.. ఆయన రాజీనామాతో మునుగోడులో ఉప ఎన్నిక వచ్చింది.. మరోసారి బీజేపీ నుంచి మునుగోడు ఉప ఎన్నిక బరిలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి దిగారు.. ఇక, కాంగ్రెస్ సిట్టింగ్ స్థానమైన మునుగోడులో మరోసారి విజయం సాధించాలన్న పట్టుదలతో పాల్వాయి స్రవంతిని పోటీకి పెట్టింది ఆ పార్టీ.. మరోవైపు.. మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధించి.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విక్టరీ కొట్టాలన్న ఊపుతో ఉన్న అధికార టీఆర్ఎస్ పార్టీ.. తన అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని బరిలోకి దించిన విషయం విదితమే.