హైదరాబాద్, వరంగల్ తరవాత శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం కరీంనగర్. కానీ అక్కడ నిఘా వ్యవస్థ మాత్రం అంతంతమాత్రం. ఇక ట్రాఫిక్ కష్టాలు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కరీంనగర్‌లో పరిస్థితి నగరవాసులకు నరకం చూపిస్తోంది. తెలంగాణలో అభివృద్ధి చెందుతున్న నగరాల్లో కరీంనగర్ ఒకటి. ఇప్పటికే స్మార్ట్ సిటీ నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే…! కానీ సిటీలో ఎక్కడ చూసినా సమస్యలే కనిపిస్తాయి ముఖ్యంగా ట్రాఫిక్ కష్టాలు సాధారణంగా లేవు.
వాహన దారులు బయటకు వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి. కార్పొరేట్ ఆస్పత్రులు, విద్యా సంస్థలు ఇక్కడ ఎక్కువగా ఉండడంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎక్కవ మంది రాకపోకలు సాగిస్తుంటారు. దీనికి తోడు స్మార్ట్ సిటీ పనులు జరుగుతుండడంతో కొన్ని రోడ్లలోకి వెళ్లలేని పరిస్థితి. దీంతో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది.మరోవైపు ట్రాఫిక్ కంట్రోల్ చేయడం… మళ్లించడంపై దృష్టి పెట్టాల్సిన పోలీసులు.. ఆ పని చేయడం లేదు. కేవలం హెల్మెట్ లేని వాహనాల్ని ఫోటోలు తీయడం… చలాన్లు వేయడానికే పరిమితం అవుతున్నారు.
కేవలం ప్రజా ప్రతినిధులు వచ్చినప్పుడు హడావిడి చేయడం తప్ప… ఇతర సమస్యలపై దృష్టి పెట్టడం లేదన్నది కరీంనగర్ వాసుల ఆరోపణ. మరోవైపు ప్రధాన కూడళ్లలో నిఘా వ్యవస్థ అటకెక్కింది. కీలక ప్రాంతాల్లో సీసీ కెమేరాలు పనిచేయడం లేదు. సిటీలో గడిచిన నెల రోజుల్లో చాలా ప్రమాదాలు జరిగాయి. అయితే దానికి కారణం ఏంటన్నది నిఘా వ్యవస్థ లేకపోవడంతో కనుక్కోవడం కష్టంగా మారింది. ఇప్పటికైనా నిఘా వ్యవస్థను పటిష్టం చేసి భద్రతను కట్టుదిట్టం చేయాలని స్థానికులు కోరుతున్నారు.