తెలంగాణ విజిలెన్స్ కొత్త డీజీగా విక్రమ్ సింగ్ మాన్
తెలంగాణ రాష్ట్ర విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖకు కొత్త డైరెక్టర్ జనరల్‌గా విక్రమ్ సింగ్ మాన్ నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఈ పదవిలో ఉన్న ఐపీఎస్ అధికారి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఆగస్టు 31తో పదవీ విరమణ చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 1998 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన విక్రమ్ సింగ్ మాన్ ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో అదనపు సీపీ (లా అండ్ ఆర్డర్)గా పనిచేస్తున్నారు. ఆయనను కొత్తగా విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం డీజీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ కె.రామకృష్ణరావు ఆగస్టు 28న ఉత్తర్వులు విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఆయన పదవీ విరమణతో ఖాళీ అయిన బాధ్యతలను విక్రమ్ సింగ్ మాన్ చేపట్టనున్నారు.ఈ నియామకంతో రాష్ట్ర విజిలెన్స్ విభాగం కొత్త డీజీగా విక్రమ్ సింగ్ మాన్ బాధ్యతలు స్వీకరించనున్నారు
నిందితులకు ఏసీబీ కోర్టు నోటీసులు.. అభ్యంతరాలు ఉంటే చెప్పాలంటూ..!
ఏపీ లిక్కర్ కేసు నిందితులకు ఏసీబీ కోర్టు నోటీసులు పంపింది. ఆస్తులను ఆటాచ్ చేస్తూ సిట్ దాఖలు చేసిన పిటిషన్‌పై అభ్యంతరాలు ఉంటే చెప్పాలని 11 మందికి నోటీసులు ఇచ్చింది. పలువురు డిస్టిలరీ డైరెక్టర్లు, బ్యాంకులు, లిక్కర్ కేసులో నిందితులకు ఏసీబీ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఆస్తుల అటాచ్ చేస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన నోటీసులపై అభ్యంతరం లేదని నోటీసులు అందుకున్న పలువురు తెలిపారు. నేడు కోర్టుకు హాజరైన కేసులో నిందితుడిగా ఉన్న వరుణ్ పురుషోత్తం, SNJ సుగర్స్, ఎంపీ డిస్టిలరీస్ ప్రతినిదులు ఉన్నారు.
ప్రభుత్వ ఉద్యోగులు మరీ ఇలా ఉన్నారేంటీ…
రోజురోజుకు ప్రభుత్వ ఉద్యోగులు మరి దారుణంగా తయారవుతున్నారు. క్లాస్ రూంలో ఓ ప్రభుత్వ టీచర్ ఫుల్ గా తాగి నిద్రపోయాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. చత్తీస్ ఘడ్ కోర్భా జిల్లా జార్వే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చంద్రపాల్ పైక్రా అనే ప్రధానోపాధ్యాయుడు ఫుల్ గా మద్యం తాగి స్కూల్ టేబుల్ పై కాళ్లు పెట్టుకుని దర్జాగా పడుకున్నాడు. ఆయన పడుకున్న వీడియోను ఎవరో వీడియో తీసి పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ పాఠశాలలో మొత్తం 46 మంది పిల్లలు చేరారు, వారు రెండు తరగతుల్లో కూర్చుంటారు. ఒక తరగతిలో దేవ్ ప్రసాద్ బర్మన్ అనే ఉపాధ్యాయుడు బోధిస్తుండగా, మరొక తరగతిలో పిల్లలు తమ సరదాలో బిజీగా ఉన్నారు, మరోవైపు ప్రధానోపాధ్యాయుడు తాగి తన కార్యాలయంలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇక్కడ చదువుతున్న పిల్లల భవిష్యత్తు తెలియదు కానీ నెలకు రూ. లక్ష జీతం పొందుతున్న హెడ్ మాస్టర్ చంద్రపాల్ జీవితం సురక్షితంగా ఉంది. ఈ హెడ్ మాస్టర్ కు చత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రి పేరు గానీ దేశ ప్రధాని పేరు కూడా తెలియదు.
ఎమ్మెల్యే కోటంరెడ్డి హత్యకి భారీ కుట్ర.. బయటకొచ్చిన సంచలన వీడియో!
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే, టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకి భారీ కుట్ర జరిగింది. టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డిని హత్య చేయాలని ఐదుగురు రౌడీ షీటర్లు మాస్టర్ ప్లాన్ వేసిన వీడియో ఒకటి బయటకొచ్చింది. ఎమ్మెల్యే కోటంరెడ్డిని హతమారిస్తే డబ్బే డబ్బు అంటూ రౌడీ షీటర్లు మాట్లాడుకుంటున్న సంచలన వీడియో వైరల్‌గా మారింది. మర్డర్ మాస్టర్ ప్లాన్ వెనుక రౌడీ షీటర్ శ్రీకాంత్ ముఖ్య అనుచరుడు జగదీష్ ఉన్నట్లు తెలుస్తోంది. పూటుగా మద్యం సేవించి.. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్య ప్లాన్ గురించి రౌడీషీటర్లు జగదీష్, మహేష్, వినీత్‌తో పాటు మరో ఇద్దరు చర్చిస్తున్నట్లు సదరు వీడియోలో కనిపిస్తోంది. ఎమ్మెల్యేను చంపేయాలని అయిదుగురు రౌడీషీటర్లు మందు తాగుతూ మాస్టర్ ప్లాన్ వేశారు. గదిలో మొత్తంగా ఏడుగురు ఉన్నారు. అందులోని ఒకరే వీడియో తీయగా.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ మాస్టర్ ప్లాన్ వెనుక రౌడీ షీటర్ శ్రీకాంత్ హస్తం ఉందని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.
ఒకేసారి 5 ప్రభుత్వ ఉద్యోగాలు.. చరిత్ర సృష్టించిన రాధాకుమారి..
నిజంగా ఓ మహిళ చరిత్ర సృష్టించింది. కలలు కన్న ఉద్యోగాన్ని ఒడిసి పట్టుకోడానికి పెళ్లి, పిల్లలు అడ్డురావని తన విజయంతో నిరూపించింది. ఏకంగా 5 ప్రభుత్వ కొలువులు సాధించి ఔరా అనిపించింది. ఇదేం అంత సామాన్య విషయం కాదు. నిజంగా తన పోరాటం అసామాన్యం. ఇద్దరు పిల్లలకు తల్లిగా, భర్తకు భార్యగా అనుక్షణం వారి వెంటనే ఉంటూ.. తన లక్ష్యాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా నిరంతరం చదువుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన మోగా డీఎస్సీలో ఒకేసారి 5 ప్రభుత్వ ఉద్యోగాలను సాధించి ఎంతో మహిళలకు ప్రేరణగా నిలిచింది రాధాకుమారి. అనితరసాధ్యమైన విజయాన్ని సాధించిన ఈ మహిళ కథ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
శ్రీకాకుళం జిల్లాలోని సరుబుజ్జిలి మండలం మతలబు పేట గ్రామానికి చెందిన చింతాడ రాధాకుమారి – కేఎల్ నాయుడు భర్యాభర్తలు. రాధాకుమారి భర్త కేఎల్ నాయుడు హైదరాబాదులో ఎల్ఐసీ ఏజెంట్‌గా పనిచేస్తున్నారు. 2016లో ఈ జంటకు ట్విన్స్ (పాప, బాబు) జన్మించారు. ఆమె అందరిలాగానే ఓ సాధారణ గృహిణి. తన భర్త, ఇద్దరు పిల్లలు ఇదే తన జీవితం. వాస్తవంగా తనకు పెద్దగా కోరికలేవీ లేవని, ఎప్పటికైనా టీచర్ కావాలన్నది తన జీవితాశయం అని చెప్పారు. రాధాకుమారి.. నాగార్జున యూనివర్సిటీ నుంచి MA తెలుగు సబ్జెక్టులో పీజీ పూర్తి చేశారు. ఆ తర్వాత వైజాగ్ నుంచి ల్యాంగ్వేజ్ పండిట్ కోర్సు (2018-19), ఉమ్మడి హైదరాబాద్‌లో టీటీసీ (2013), ఆంధ్రా యూనివర్సిటీ నుంచి 2023 బీఎడ్ డిగ్రీలు పూర్తి చేశారు. ఓ వైపు సంసారసాగరంలో ముగిని తేలుతూనే.. మరోవైపు ఐదేళ్ల పాటు డీఎస్సీకి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్నారు. ఏపీలో కూటమి సర్కార్ వచ్చిన తర్వాత ప్రకటించిన మెగా డీఎస్సీకి తాను చదివిన డిగ్రీలన్నింటికీ సరిపోయే ఉద్యోగాలకు ఆమె దరఖాస్తులు చేసుకున్నారు. అలాగే అన్ని పరీక్షలు కూడా రాశారు. ఇక్కడ విశేషం ఏమిటంటే తాజాగా వెలువడిన మెగా డీఎస్సీ ఫలితాల్లో ఆమె రాసిన అన్ని సబ్జెక్టుల్లోనూ ఎంపికై అందరినీ ఆశ్చర్యపరిచారు. ఒకే దెబ్బకు 5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి రికార్డు సృష్టించారు.
విద్యా బోధనలో నాణ్యత ప్రమాణాలు పెంచాలి….
పాఠశాలలు మొదలు విశ్వ విద్యాలయాల వరకు ప్రతి విద్యా సంస్థలోనూ మెరుగైన బోధన సాగాలని.. విద్యా బోధనలో నాణ్యత ప్రమాణాలు మరింతగా పెంచాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. పాఠశాలలు, కళాశాలలు, ప్రొఫెషినల్ కోర్సులు బోధించే కళాశాలల్లో విద్యార్థులు, బోధన సిబ్బందికి ఫేషియల్ రికగ్నేషన్ తప్పనిసరి చేయాలని సీఎం ఆదేశించారు. ముఖ గుర్తింపుతో హాజరు శాతం మెరుగవడంతో పాటు ప్రొఫెషనల్ విద్యా సంస్థల్లో లోటుపాట్లను అరికట్టవచ్చన్నారు. విద్యా శాఖపై ఐసీసీసీలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. విద్యా శాఖ పరిధిలో అదనపు గదులు, వంట గదులు, మూత్రశాలలు, మరుగుదొడ్లు, ప్రహారీల నిర్మాణం వివిధ విభాగాలు చేపట్టడం సరికాదని సీఎం అభిప్రాయపడ్డారు. ఈ నిర్మాణాల నాణ్యతప్రమాణాలు, నిర్మాణ పర్యవేక్షణ, నిధుల మంజూరు, జవాబుదారీతనానికి గానూ ఒకే విభాగం కింద ఉండాలన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న విద్యా, సంక్షేమ వసతుల అభివృద్ధి సంస్థ (EWIDC) కిందనే రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థల నిర్మాణాలు కొనసాగాలని సీఎం ఆదేశించారు.
త్వరలో తాడిపత్రి వెళ్తా.. ప్రజలకు అందుబాటులో ఉంటా!
వైసీపీ సీనియర్ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి సుప్రీంకోర్టులో భారీ ఊరట దక్కింది. అనంతపురం జిల్లా తాడిపత్రి ఎంట్రీకి పెద్దారెడ్డికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తనను తాడిపత్రిలోకి రాకుండా టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారంటూ సుప్రీంకోర్టును మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఆశ్రయించారు. విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది. తాడిపత్రికి వెళ్లేందుకు పెద్దారెడ్డికి సెక్యూరిటీ ఇవ్వాలని కూడా పోలీసులను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. సుప్రీంకోర్టు తీర్పుపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ‘నేను తాడిపత్రి వెళ్లేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టులో న్యాయం గెలిచింది. సుప్రీంకోర్టు తీర్పు కాపీలను ఎస్పీకి అందజేస్తా. త్వరలోనే నేను తాడిపత్రి వెళ్తాను. తాడిపత్రి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటా, సేవ చేస్తా. సుప్రీంకోర్టు నిబంధనల మేరకు పోలీసులకు సహకరిస్తాను’ అని పెద్దారెడ్డి స్పష్టం చేశారు.
పాక్‌ను గడగడలాడించిన మిగ్-29 విమానాలు..
భారత దేశం తన అజేయమైన శక్తిసామర్థ్యాలను ఆపరేషన్ సింధూర్‌తో ప్రపంచానికి చాటిచెప్పింది. భారత నావికాదళం క్రమంగా హిందూ మహాసముద్రంలో సూపర్ పవర్‌గా మారుతోంది. మే నెలలో పాకిస్థాన్‌పై ఆపరేషన్ సింధూర్ సందర్భంగా ఈ విషయాన్ని ప్రపంచానికి రుజువు చేసింది. ఇరుదేశాల మధ్య వివాదం ప్రారంభమైన తర్వాత, పాక్ నావికాదళాన్ని దాని స్వంత భూభాగంలోనే 15 మిగ్-29కె విమానాలతో చుట్టుముట్టినట్లు భారత వైస్ అడ్మిరల్ తాజాగా వెల్లడించారు. మధ్యప్రదేశ్‌లోని డాక్టర్ అంబేద్కర్ నగర్‌లోని ఆర్మీ వార్ కాలేజీలో జరిగిన రణ్ సంవాద్-2025లో డిప్యూటీ చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ (DCNS) వైస్ అడ్మిరల్ తరుణ్ సోబ్తి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఇండియన్ నేవీ శక్తిసామర్థ్యాల గురించి, ఆపరేషన్ సింధూర్ సమయంలో నేవీ పని తీరు గురించి ఆయన వివరించారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ ఆపరేషన్ సింధూర్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో భారత నావికాదళం ప్రధాన యుద్ధనౌక TROPEX అప్పటికే ప్రారంభమైంది. దానితో పాటు అనేక యుద్ధనౌకలు పశ్చిమ తీరంలో మోహరించబడ్డాయని తెలిపారు.
ఉత్తరాఖాండ్ లో క్లౌడ్ బరస్ట్.. రాష్ట్రమంతా అస్తవ్యస్తం
దేశంలో ఎక్కడ చూసినా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో దేశం మొత్తం అతలాకుతలమైంది. ఉత్తరాఖాండ్ లోని డ్రెహ్రడూన్ లో గతంలో లేని విధంగా వర్షాలు కురుస్తున్నాయి. చమోలి, రుద్ర ప్రయాగ జిల్లాల్లో క్లౌడ్ బరస్ట్ జరిగింది. దీంతో వరదలు వచ్చి గ్రామాలన్ని నీట మునిగాయి. భారీ వర్షాలతో ఉత్తరాఖాండ్ మొత్తం విలవిలాడిపోతుంది. ఎటు చూసినా వరదలు, కొట్టుకుపోయిన గ్రామాలు, లోయలను తలపిస్తున్న రోడ్డు కనిపిస్తున్నాయి. వరదలు పోటెత్తడంతో గ్రామాలకు గ్రామాలు కొట్టుకుని పోతున్నాయి. వరదలతో మూగజీవాలు, జనాలు నిలువ నీడ లేక ఇబ్బందులు పడుతున్నారు. దేవల్ లోని మోపాటా ప్రాంతాల్లో వరదల ఉదృతికి భార్యా భర్తలిద్దరూ కొట్టుకునిపోయారు. గోశాలలో ఉన్న 20 మూగజీవాలు నీటిలో మునిగి చనిపోయాయి. అదేవిధంగా రుద్ర ప్రయాగలో ఆరుగురు వ్యక్తులు గల్లంతయ్యారు.
హైదరాబాద్‌లో కొత్త తరహా డ్రగ్స్ మాఫియా.. వస్తువుల మాటున సరఫరా!
హైదరాబాద్‌లో డ్రగ్స్ మాఫియా కొత్త పద్ధతులతో పోలీసులను తప్పుదోవ పట్టిస్తోంది. సాధారణంగా కనిపించే వస్తువుల మాటున డ్రగ్స్‌ను సరఫరా చేస్తూ యువతను బారిన పడేస్తోంది. పుస్తకాలు, కాస్మెటిక్స్, తినుబండారాలు, ఫుడ్ ఆర్టికల్స్ వంటి వస్తువుల మధ్య దాచిపెట్టి ముఠాలు డ్రగ్స్ పంపిణీ చేస్తున్నాయి. ఇప్పటివరకు పోలీసులు బయటపెట్టిన వివరాల ప్రకారం దాదాపు 38 రకాల వస్తువుల రూపంలో డ్రగ్స్‌ను తరలిస్తున్నట్టు తెలిసింది. ముఖ్యంగా విద్యార్థులను టార్గెట్ చేస్తూ ఈ ముఠాలు విశ్వవిద్యాలయాలు, మెడికల్ కాలేజీలు, హాస్టళ్లలోకి కూడా డ్రగ్స్ చొరబెడుతున్నాయి.