సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట!
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. 2021లో నమోదైన కేసులో వ్యక్తిగత హాజరు నుంచి తెలంగాణ హైకోర్టు మినహాయింపు ఇచ్చింది. కౌంటర్ దాఖలు చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వర్ రావును కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేసింది. సైఫాబాద్ పోలీస్‌స్టేషన్‌లో తనపై నమోదైన కేసును కొట్టేయాలని సీఎం రేవంత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏఐసీసీ పిలుపు మేరకు 2021లో పీసీసీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదు అయింది. రేవంత్ రెడ్డిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో ఈ కేసు పెండింగ్‌లో ఉంది. ఈ కేసును కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్ట్.. రేవంత్ రెడ్డికి హాజరు మినహాయింపు ఇచ్చింది. తదుపరి విచారణ వచ్చే నెల 7వ తేదీకి వాయిదా వేసింది.
బిగ్ బ్రేకింగ్.. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవిత బహిష్కరణ!
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సొంత కూతురు పైనే క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవితను బహిష్కరించారు. ఈ మేరకు బీఆర్ఎస్ అధిష్టానం మరి కాసేపట్లో అధికారికంగా నోట్ విడుదల చేయనుంది. కవిత గత కొంతకాలంగా సొంత పార్టీ నేతలపై విమర్శలు చేయడమే ఈ వేటుకు కారణమైంది. సొంత పార్టీ నేతలనే టార్గెట్ చేసిన కవితపై ప్రస్తుతం గులాబీ బాస్ గుర్రుగా ఉన్నారు. గత కొంతకాలంగా బీఆర్ఎస్, ఆ పార్టీ నేతకు వ్యతిరేకంగా ఎమ్మెల్సీ కవిత విమర్శలు చేస్తున్నారు. బీజేపీలో బీఆర్ఎస్ కలవబోతుందని షాకింగ్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ తర్వాత కవిత మొదట తండ్రికి లేఖ రాశారు. పార్టీ నేతలను ఉద్దేశించి.. కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీనియర్ నేత జగదీష్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాజాగా అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన కవిత.. సీనియర్ నేతలు హరీష్ రావు, సంతోష్ రావులపై సంచలన ఆరోపణలు చేశారు. కొంతకాలంగా బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా విమర్శలు చేస్తున్న కవితపై అధిష్టానం చర్యలు తీసుకుంది.
చనిపోయిన నా తల్లిపై దుర్భాషలా? కాంగ్రెస్, ఆర్జేడీపై మోడీ ఆగ్రహం
చనిపోయిన తన తల్లిపై కాంగ్రెస్, ఆర్జేడీ దుర్భాషలాడిందని ప్రధాని మోడీ ధ్వజమెత్తారు. తన తల్లికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని.. అయినా కూడా తన తల్లిని దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు. బీహార్ రాజ్య జీవితా నిధి సాఖ్ సహకారి సంఘ్ లిమిటెడ్‌ను మోడీ ప్రారంభించారు. అనంతరం వీడియో కాన్ఫరెన్సింగ్‌లో దాదాపు 20 లక్షల మంది మహిళలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. తన తల్లిపై కాంగ్రెస్, ఆర్జేడీ ఉపయోగించిన వ్యాఖ్యలు.. ‘‘నా తల్లినే కాదు.. దేశంలో ఉన్న ప్రతి తల్లిని.. సోదరిని అవమానించారు.’’ అని తెలిపారు. తన తల్లిని గురించి మాట్లాడిన మాటలు వింటే.. తనలాగే మీరు కూడా బాధపడతారని తనకు తెలుసు అన్నారు. కుటుంబాన్ని పోషించడానికి తన తల్లి హీరాబెన్ ఎంతో కష్టపడిందని గుర్తుచేశారు. తనను, తన తోబుట్టువులందరినీ పెంచడానికి పేదిరకంతో పోరాడిందని జ్ఞాపకం చేశారు. తన తల్లి ఎప్పుడూ అనారోగ్యంతో ఉండేదని.. అయినా కుటుంబ పోషణ కొరకు నిత్యం పని చేస్తూనే ఉండేదని పేర్కొన్నారు. మా బట్టల కోసం ప్రతి పైసాను ఆదా చేసేదన్నారు. దేశంలో అలాంటి తల్లులు కోట్లాది మంది ఉన్నారని చెప్పారు. దేవతల కంటే తల్లి స్థానం గొప్పదని కొనియాడారు.
లిక్కర్ స్కాం కేసులో సిట్ దూకుడు..
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దూకుడు చూపిస్తోంది.. ఈ కేసులో ఏసీబీ కోర్టులో ఇప్పటికే ఛార్జిషీట్ దాఖలు చేసింది సిట్.. అయితే, ఛార్జిషీట్‌పై ఏసీబీ కోర్టు పలు అభ్యంతరాలను లేవనెత్తుతూ.. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.. దీంతో, ఛార్జిషీట్‌లో ఏసీబీ కోర్టు లేవనెత్తిన అభ్యంతరాలపై ఈ రోజు కౌంటర్ దాఖలు చేసింది సిట్.. ప్రైమరీ ఛార్జ్‌షీట్, రెండో అదనపు ఛార్జిషీట్ లో మొత్తం 20కి పైగా అభ్యంతరాలు లేవనెత్తి.. నివృత్తి చేయాలని సిట్‌కు ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేయగా.. వీటిని నివృత్తి చేస్తూ కోర్టులో కౌంటర్ దాఖలు చేసింది సిట్.. సీల్డ్ కవర్ లో రెండు ఛార్జిషీట్లలో అభ్యంతరాలపై విడివిడిగా కౌంటర్లు కోర్టుకు సమర్పించింది సిట్..
చంద్రబాబు సవాల్ ఏడ్చినట్లుగా వుంది.. దమ్ము, ధైర్యం ఉంటే ప్రతిపక్ష హోదా ఇచ్చి చూడు..!
వైఎస్ జగన్ అసెంబ్లీ హాజరుపై సీఎం చంద్రబాబు విసిరిన సవాల్ ఏడ్చినట్లుగా ఉంది అంటూ కౌంటర్ ఇచ్చారు వైసీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి.. చంద్రబాబుకి దమ్ము, ధైర్యం ఉంటే జగన్ కి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఛాలెంజ్ చేశారు.. అసలు, ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు..? అని ప్రశ్నించారు.. ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రజల పక్షాన గొంతు వినిపిస్తాం… మీ మంద బలంతో మా గొంతు నొక్కాలని చూస్తున్నారు. అందుకే జగన్ కి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు.. ప్రతిపక్ష హోదా ఇస్తే మీకు సమాధానాలు చెప్పటానికి జగన్ ఒక్కరు చాలు అన్నారు.. జగన్ మీడియా సమావేశంలో మాట్లాడితేనే సమాధానం చెప్పలేక బూతులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.. అయితే, జగన్ ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలు సమస్యలు చెప్పడానికి వస్తున్నారని తెలిపారు..
మామ, అల్లుడు వాటా ఎంత?.. సీబీఐ విచారణలో తేలుతుంది!
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో మామ కేసీఆర్ వాటా ఎంత?, అల్లుడు హరీశ్ రావు వాటా ఎంత?, ఇతరుల వాటా ఎంత? అనేది సీబీఐ విచారణలో తేలుతుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. కాళేశ్వరంలో కర్త, కర్మ, క్రియ అని తానే అని చెప్పుకున్న కేసీఆర్.. అవినీతికి కూడా బాధ్యత వహించాల్సిందే అని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కవిత మాటలతో కాళేశ్వరంలో అవినీతి జరిగిందని స్పష్టంగా తేలిపోయిందన్నారు. కేసీఆర్ కుటుంబం దొంగల ముఠా అని.. వాటాల పంపకాల తేడాతోనే గులాబీ బాస్ కుటుంబంలో అంతర్గత కుమ్ములాట మొదలయిందన్నారు. కేసీఆర్ ఆజ్ఞ లేనిదే కుటుంబంలో చీమ కూడా కదలని పరిస్థితి అని మహేశ్ కుమార్ గౌడ్ ఎద్దేవా చేశారు. గాంధీభవన్‌లో మహేశ్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు.
దేనికి చప్పట్లు కొడుతున్నారంటూ.. నవ్వులు పూయించిన ప్రధాని..
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిపక్షాలపై మాటల తూటాలను పేల్చడం చూసి ఉంటారు.. కానీ ఆయన సరదాగా అందరి మోములపై నవ్వులు పూయించడం ఎప్పుడైనా చూశారా.. ఆయన తాజాగా తన హాస్య చతురతతో వార్తల్లోకి ఎక్కారు. మంగళవారం న్యూఢిల్లీలో సెమికాన్ ఇండియా 2025 ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా ప్రధాని మోడీ సభలోని వారందరితో నవ్వులు పూయించారు. న్యూఢిల్లీలోని యశోభూమి కన్వెన్షన్ సెంటర్‌లో సెమికాన్ ఇండియా 2025 ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ప్రధాని మోడీ హాజరై మాట్లాడారు.. “లేడీస్ అండ్ జెంటిల్మెన్, నేను నిన్న రాత్రి జపాన్, చైనాలను సందర్శించి తిరిగి వచ్చాను’ ఆయన ఇలా చెప్పగానే, అక్కడున్న సభికులందరూ చప్పట్లు కొట్టడం ప్రారంభించారు. దీనిపై ప్రధాని మోడీ చమత్కారంగా మాట్లాడుతూ… “నేను వెళ్లానని చెప్పి మీరు చప్పట్లు కొడుతున్నారా లేదా నేను తిరిగి వచ్చానని చెప్పి చప్పట్లు కొడుతున్నారా” అని అన్నారు. ప్రధాని మాటలతో హాలు చప్పట్లతో మారుమోగింది. కార్యక్రమంలో పాల్గొన్న విదేశీ ప్రతినిధులు కూడా తమ నవ్వును ఆపుకోలేకపోయారు. ప్రధాని మోడీకి అత్యంత తీవ్రమైన వాతావరణాన్ని కూడా తేలిక పరచగల నాయకుడని పేరుంది. గతంలోనూ ప్రధాని ఇలాగే సభికులందరితో నవ్వులు పూయించిన పలు సందర్భాలు ఉన్నాయి.. కొన్నేళ్ల క్రితం ప్రధానమంత్రి ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. “ఒకసారి ఎవరో నన్ను మీ ముఖం ఎందుకు అంత మెరుస్తున్నదని అడిగారు? అప్పుడు నా శరీరం నుంచి చాలా చెమట వస్తుందని సమాధానం చెప్పాను. నేను ఆ చెమటతోనే మసాజ్ చేస్తానని, అందుకే నా ముఖం మెరుస్తుంది” అని చెప్పినట్లు పేర్కొన్నారు.
కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్తున్నారా.. ఇకపై వీరికి నో ఎంట్రీ..
తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఇంద్రకీలాద్రి ముందు వరుసలో ఉంటుంది. అమ్మవారిని దర్శించుకోడానికి ఎక్కడెక్కడి నుంచో భక్తజనం తరలి వస్తుంటారు. ఈ మధ్యకాలంలో కొందరు ఆలయానికి వచ్చి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. ఆలయంలో ఉన్నప్పుడూ ఎలా ఉండాలి, ఎలా రావాలి అనేది పూర్తిగా మరిచి నడుచుకుంటున్నారని తోటి భక్తుల నుంచి అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. కొందరు తెలిసి తెలియక ఆలయంలో సెల్ఫీలు దిగడం అమ్మవారి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడం లాంటి పనులు చేస్తున్నారు. ఒక పక్క డ్రెస్ కోడ్ పాటించక పోవడం, మరోపక్క అమ్మవారి మూలవిరాట్ సోషల్ మీడియాలో వైరల్ చేయడం లాంటి పనులు చేస్తున్నారు. ఇక్కడ భక్తులందరూ తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది.. సెల్ ఫోన్స్ ఉన్న వ్యక్తులు ఆలయంలో దొంగచాటుగా అమ్మవారి స్వరూపం చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టకూడదని నిబంధన ఉంది.
పార్టీకి, ఎమ్మెల్సీ సభ్యత్వానికి రాజీనామా యోచనలో…!
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. పార్టీకి, ఎమ్మెల్సీ సభ్యత్వానికి రాజీనామా చేసే యోచనలో ఉన్న కవిత, ఈ విషయాన్ని త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీఆర్‌ఎస్ అధిష్టానం ఎమ్మెల్సీ పదవిపై ఫిర్యాదు చేసే ముందే స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని ఆమె నిర్ణయించుకున్నట్లు తెలిసింది. పార్టీతో పూర్తిగా తెగదెంపులు చేసుకోవాలని కూడా కవిత భావిస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక మరోవైపు, బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సొంత కూతురిపైనే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటూ కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరించారు. ఈ మేరకు అధికారిక ప్రకటన త్వరలోనే విడుదల కానుంది. గత కొంతకాలంగా కవిత తన సొంత పార్టీ, ఆ పార్టీ నేతలపై విమర్శలు చేస్తూ వార్తల్లో నిలిచారు. బీజేపీతో బీఆర్ఎస్ కలిసిపోతుందనే సంచలన వ్యాఖ్యలు చేశారు. రజతోత్సవ సభ అనంతరం తన తండ్రి కేసీఆర్‌కు లేఖ రాస్తూ, ఆయన చుట్టూ “దెయ్యాలు” ఉన్నాయంటూ విమర్శలు గుప్పించారు. సీనియర్ నేత జగదీష్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.
ఏపీని గ్లోబల్ లాజిస్టిక్స్ హబ్‌గా తీర్చిదిద్దుతాం: సీఎం చంద్రబాబు
విశాఖపట్నంలో గ్లోబల్ ఫోరం ఫర్ సస్టెయినబుల్ ట్రాన్సఫర్మేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన విశాఖ- ఈస్ట్ కోస్ట్ మారిటైమ్ లాజిస్టిక్స్ సమ్మిట్‌కు ముఖ్యఅతిథిగా ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మారిటైమ్ లాజిస్టిక్స్ అభివృద్ధిపై దేశంలోని వివిధ పోర్టులు, కార్గో హ్యాండ్లింగ్ కంపెనీలకు చెందిన 62 మంది సీఈఓలతో సమావేశం అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలలో భాగంగా ఏపీని గ్లోబల్ లాజిస్టిక్స్ హబ్‌గా తీర్చిదిద్దుతాం అని అన్నారు. ఏపీ మారిటైమ్ లాజిస్టిక్స్ రంగంలో ఉన్న అవకాశాలు, పోర్టు కార్గో హ్యాండ్లింగ్ మౌలిక సదుపాయాల కల్పన, రోడ్- రైలు కనెక్టివిటీలపై సమావేశంలో చర్చించారు. పోర్టుల పరిధిలో ఉన్న వివిధ ప్రాంతాలు, హింటర్ ల్యాండ్ కనెక్టివిటి, కార్గో రవాణా అంశాల గురించి మాట్లాడారు.