తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మరోసారి బహిరంగ లేఖ రాశారు టి.పీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి… ఈసారి లేఖలో పోస్టింగుల కోసం వెయిటింగ్‌లో ఉన్న అధికారుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు.. ఎక్సైజ్ శాఖలో అకారణంగా మూడు సంవత్సరాలుగా పోస్టింగ్స్ ఇవ్వకుండా వెయిటింగ్‌లో పెట్టిన అధికారులకు వెంటనే పోస్టింగ్స్ ఇవ్వాలని విన్నవించారు.. ఆంధ్ర నుండి తెలంగాణకు కేటాయించిన తెలంగాణ బిడ్డలైన ముగ్గురు ఎక్సైజ్ సూపరింటెండెంట్లను ఎటువంటి కారణం లేకుండా రెండు సంవత్సరాలుగా పోస్టింగ్ ఇవ్వకుండా జీతాలు ఇవ్వకుండా వేధిస్తున్నారని.. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అతి సుదీర్ఘ విరామం సుమారు 7 సంవత్సరాల తర్వాత అన్ని శాఖలతో పాటు ఎక్సైజ్ శాఖలో 64 ఉన్నతాధికార్లకు పదోన్నతి ఇచ్చి అందులో 12 మంది అధికార్లకు మాత్రమే పోస్టింగ్ ఇచ్చి మిగతా అధికార్లకు పోస్టింగ్ ఇవ్వకుండా అదే స్థానాలలో కొనసాగిస్తున్నారని.. ఇందులో భాగంగా నలుగురు అసిస్టెంట్ కమిషనర్లను, ఒక డిప్యూటీ కమిషనర్‌ని మరియు ఒక జాయింట్ కమిషనర్‌ని 6 నెలలకు పైగా వెయిటింగ్ లో పెట్టి జీత భత్యాలు లేకుండా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉద్యోగుల పరువుపోయే విషయం ఏమిటంటే జీత భత్యాలు చెల్లించాల్సిన ప్రభుత్వం ఈ అధికారులకు బ్రతుకు వెళ్లదీయడానికి రెండు మూడు నెలలకు ఒకసారి కన్సాలిడేట్డ్ అప్పు ఏర్పాటు చేసింది. ఉద్యోగులను వెయిటింగ్ లో పెట్టి జీత భత్యాలు ఇవ్వకుండా అప్పు తీసుకొని బతకమంటున్నారని మండిపడ్డారు రేవంత్ రెడ్డి.. ఎక్సైజ్ శాఖకు బాధ్యుడిగా ఉన్న సోమేష్ కుమార్ మరియు సంబంధిత మినిస్టర్ కు ఎన్నిసార్లు విన్నవించుకున్నా సమస్య పరిష్కారం కాలేదు.. ఇదే విషయమై మీడియా ఎన్ని సార్లు ప్రముఖంగా ఈ వార్తను ప్రసారం చేసినా, ప్రభుత్వం దృష్టికి తెచ్చినా సమస్య పరిష్కారం కాలేదన్నారు. కాబట్టి.. వెయిటింగ్ లో ఉన్న ఉద్యోగులకు జీత భత్యాలు లేక వీరు మరియు కుటుంబ సభ్యులు నానా రకాలుగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరికి రావలిసిన పీఆర్సీ ఇంక్రిమెంట్, ప్రీమియం చెల్లించక ఆరోగ్య సేవలు నిలిచిపోయాయని.. డీపీఎఫ్ చెల్లింపులు మరియు ఇతర పొదుపు ఖాతాలునిలిచిపోయాయని.. ఎలాంటి తప్పు చేయకున్నా సామాజికంగా అవమానం ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఎక్సైజ్ లాంటి నేరాలను అదుపు చేసే శాఖలలో 20శాతం అధికార్లను వెయిటింగ్ లో పెట్టి పని చేస్తున్న అధికారులకే నాలుగు అయిదు అదనపు బాధ్యతలు అప్పగించడం వలన నేరాలు అదుపు లేకుండా పోయే ప్రమాదం ఉందన్నారు పీసీసీ చీఫ్.. ఇక, హైదరాబాద్ ఎక్సైజు సూపరింటెండెంట్ కి 3 అదనపు బాధ్యతలు, రంగారెడ్డి డీసీ కి 4 అదనపు బాధ్యతలు, మహబూబ్ నగర్ సూపరింటెండెంట్ కు 3 అదనపు బాధ్యతలు, ఇంచుమించు శాఖలో ప్రతి ఒక్కరికి అదనపు బాధ్యతలు ఉన్నాయని.. కానీ, పోస్టింగ్ ఇచ్చి పని చేయించుకోవడానికి ప్రభుత్వం ముందుకు రావడంలేదన్నారు.
ప్రభుత్వ ఉత్తర్వులు మరియు సర్క్యూలర్లు ఉద్యోగిని వెయిటింగ్‌లో పెట్టరాదని, రిపోర్ట్ చేసిన 10 రోజులలో పోస్టింగ్స్ ఇవ్వాలని, వెయిటింగులో పెట్టినట్లు అయితే సంబంధిత అధికారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని.. అంతే కాకుండా సంబంధిత అధికారి జీతం నుండి వెయిటింగ్ అధికారుల జీత భత్యాలు రికవరీ చెయ్యాలని ప్రభుత్వ ఉత్తర్వులు తెలియజేస్తున్నాయంటూ కొన్ని జీవోలను సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖకు జత జేశారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించి అతి దారుణంగా ప్రభుత్వ ఉద్యోగులను వేధింపులకు గురిచేస్తున్నారని.. ప్రభుత్వ పరిపాలన అవసరాల దృష్ట్యా అతి తక్కువ కాలం మరియు సందర్భోచితంగా వాడవలిసిన వెయిటింగ్ ని ఇష్టమొచ్చినట్లు వాడి ఉద్యోగులను సంవత్సరాల తరబడి వెయిటింగ్‌లో పెట్టి ఉద్యోగులను వారి కుటుంబాన్ని మానసిక మరియు ఆర్థిక వేధింపులకు గురిచేయడం దారుణమం అన్నారు రేవంత్‌రెడ్డి.