హైదరాబాద్ జలసౌధలో గురువారం సాయంత్రం కేఆర్‌ఎంబీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో కృష్ణా నది పరివాహక ప్రాంత రాష్ట్రాల నీటిపారుదలశాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీశైలం ఎడమగట్టు కాల్వ పనులను గెజిట్ నోటిఫికేషన్‌లో రెండుగా చూపడంపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు మరో లేఖ రాసింది. ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా నదీ ఆయకట్టును 3 నుంచి 4 లక్షల ఎకరాలకు పెంచారని, కానీ నీటి కేటాయింపులు పెంచలేదని లేఖలో తెలిపింది.
Read Also: ప్రశాంత్ కిషోర్‌తో విభేదాలపై తృణమూల్ క్లారిటీ
అయితే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అనంతరం ప్రభుత్వం నీటి కేటాయింపులను 30-40 టీఎంసీలకు పెంచిందని, దీంతో 10 టీఎంసీలకు సంబంధించి పనులు అదనపు కాంపొనెంట్ కిందకు రావని తెలంగాణ ప్రభుత్వం లేఖలో వివరించింది. 75 శాతం నీటి లభ్యత కింద ప్రాజెక్టుకు కేటాయింపుల అంశాన్ని కూడా కృష్ణా జలవివాదాల రెండో ట్రైబ్యునల్ ముందు ఉంచినట్లు లేఖలో పేర్కొంది. కృష్ణా బేసిన్‌లోని అవసరాలకు ముందు ప్రాధాన్యం ఇవ్వాలని మొదటి ట్రైబ్యునల్ కూడా స్పష్టం చేసిందని… ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణకు అన్యాయం జరగకుండా చూడాలని లేఖలో కోరింది. కాగా ఈ లేఖ ప్రతిని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖకు కూడా పంపింది.
మరోవైపు కేఆర్ఎంబీ సమావేశంలో చెన్నైకి తాగునీటి కేటాయింపులపై అధికారులు చర్చించారు. చెన్నైకి 5 టీఎంసీల కేటాయింపునకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు సమ్మతి తెలిపాయి. అయితే 10 టీఎంసీల నీటి విడుదలపై మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలు స్పష్టత ఇవ్వలేదు. తమిళనాడుకు భారీ వరదలు రావడంతో పెద్దగా నీటి సమస్య తలెత్తలేదు. ఇప్పటికే చెన్నై తాగునీటి కోసం నీటిని తెలంగాణ విడుదల చేసింది. ఇప్పటివరకు ఐదున్నర టీఎంసీలను చెన్నై వాడుకుంది.