తెలంగాణలో రెండేళ్లకు ఒకసారి జరిగే మేడారం సమ్మక్క -సారలమ్మ జాతరకు ఏర్పాట్లు ప్రారంభం కానున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు భారీ స్థాయిలో ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జాతర జరగనుంది. ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర, దక్షిణ కుంభమేళాగా మేడారం జాతరకు పేరుంది. ఈ జాతర నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం రూ.75 కోట్ల నిధులు విడుదల చేసింది. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే మేడారం జాతరను ప్లాస్టిక్ రహితంగా నిర్వహించాలని ప్రభుత్వం తలపెట్టింది.
Read Also: 2023లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీదే అధికారం
కరోనా కష్టకాలంలో బడ్జెట్ సమస్యలు నెలకొని ఉన్నా సమక్క సారలమ్మ జాతరకు జీవో నంబర్ 195 ద్వారా నిధులు విడుదల చేసిన సీఎం కేసీఆర్కు మంత్రి సత్యవతి రాథోడ్ ధన్యవాదాలు తెలిపారు. రూ.75 కోట్లు విడుదల చేయడం గిరిజన ఆదివాసీలు, వారి ఆచారాలు, పండగలు, జాతరల పట్ల సీఎం కేసీఆర్కు ఉన్న ప్రేమకు నిదర్శనంగా కనపడుతోందని ఆమె కొనియాడారు. కాగా మేడారం జాతర కోసం వారం రోజుల కిందటే రూ.2.24 కోట్ల వ్యయంతో భక్తులు దుస్తులు మార్చుకునేందుకు గదులు, ఓహెచ్ఆర్ఎస్, కమ్యూనిటీ డైనింగ్ హాలు పనులకు శంకుస్థాపన చేశామని తెలిపారు. మిగిలిన వసతులన్నీ డిసెంబరులోపు పూర్తి చేస్తామని మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు.