Talasani Srinivas Yadav Promises To Build Krishnam Raju Statue In Film Nagar: ఫిలింనగర్ సొసైటీలో దివంగత సినీనటుడు కృష్ణంరాజు విగ్రహం పెట్టేందుకు కృషి చేస్తామని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ విషయమై ఒకసారి సొసైటీ సభ్యులతో చర్చలు జరుపుతామన్నారు. క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సంస్మరణ సభలో మంత్రి తలసాని ఆ విషయం చెప్పారు. కృష్ణంరాజు మంచికి మారుపేరు అని, అందరినీ ప్రేమాభిమానాలతో పలకరించేవారని పేర్కొన్నారు. అందరూ చనిపోతారు కానీ కొంతమందే చరిత్రలో నిలిచిపోతారని.. అలాంటి వారిలో కృష్టంరాజు ఒకరని అన్నారు. చిన్నప్పుడు తాను కృష్ణంరాజు సినిమాలు చూశానని, రాజులు మర్యాదకు మారు పేరు అని కొనియాడారు. ప్రభాస్ ఎంతో ఎత్తుకు ఎదగాలనే సంకల్పంతో కృష్ణంరాజు ఉండేవారని వెల్లడించారు.
ఇక ఈ సభకు హాజరైన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కృష్ణంరాజు మరణం తమ పార్టీకి దురదృష్టకరమన్నారు. కృష్ణంరాజు కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో తాను బీజేపీ యూత్ నాయకుడిగా ఉన్నానని, అప్పుడు ప్రతీరోజూ ఆయన్ను కలిసేవాడినని చెప్పారు. ఇటీవలే కృష్ణంరాజు ప్రధానిని కలవాలని కోరారని, భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవ కార్యక్రమంలో పాల్గొంటానని అన్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కోవిడ్ సమయంలో ప్రత్యేక విమానంలో లండన్ వెళ్లేందుకు కృష్టంరాజు ప్రయత్నించారని, కానీ అది సాధ్యపడలేదని పేర్కొన్నారు. అందరూ అభిమానించే వ్యక్తి కృష్ణంరాజు అని, మనసులో కల్మషం లేని వ్యక్తి ప్రశంసించారు. రాబోయే ఎన్నికల్లో దేశంలోని పలు రాష్టాల్లో బీజేపీ ప్రచారంలో పాల్గొంటానని కృష్ణంరాజు తనతో చెప్పారని కిషన్ రెడ్డి వెల్లడించారు.