Revanth Reddy Sensational Allegations On Rajagopal Reddy: మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. రాజగోపాల్ రెడ్డిపై ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఏం తక్కువ చేసిందని ఆ పార్టీకి రాజగోపాల్ రెడ్డి ద్రోహం చేశాడు? అని ప్రశ్నించారు. రాజగోపాల్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వడం కాంగ్రెస్ చేసిన తప్పా..? మునుగోడులో ఎమ్మెల్యేగా గెలిపించడం తప్పా..? అని నిలదీశారు. రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ చెట్టంత మనిషిని చేసిందని, కానీ ఆయన కాంగ్రెస్‌ను కత్తితో పొడిచిపోయాడని మండిపడ్డారు. కాంగ్రెస్ దుష్మణ్‌తో రాజగోపాల్ రెడ్డి దోస్తీ చేశాడని.. కాంగ్రెస్ పార్టీని చంపనీకి ఆయన వచ్చాడని విమర్శించారు. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఐదుసార్లు ఎమ్మెల్యే అయినా ఏం సంపాదించలేదని.. కానీ ఒక్కసారి ఎమ్మెల్యే అయి రాజగోపాల్ రెడ్డి 22 వేల కోట్లు సంపాదించాడని ఆరోపించారు. అమ్ముడుపోయిన సన్నాసులతో ఊరంతా పోతుందా..? అని వ్యాఖ్యానించారు.
ఇదే సమయంలో టీఆర్ఎస్ పార్టీపై కూడా రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ ఇప్పట్లో బీఆర్ఎస్‌గా మారే అవకాశం లేదని బాంబ్ పేల్చారు. గులాబీ కూలీ పేరుతో టీఆర్ఎస్ పాల్పడిన వసూళ్లకు సంబంధించి.. తాను త్వరలోనే ఈసీకి ఫిర్యాదు చేస్తానన్నారు. అలాగే.. కేంద్ర ఇన్‌కమ్ టాక్స్ సంస్థకు కూడా టీఆర్ఎస్‌పై ఫిర్యాదు చేయబోతున్నట్టు తెలిపారు. ఈ విషయంపై కోర్టును కూడా ఆశ్రయిస్తానన్నారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్‌గా మారితే.. ఈ కేసు దర్యాప్తుకు ఆటంకం కలుగుతుందని, దీనిపై కోర్టు నుంచి ఆదేశాలు వచ్చే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలతో అభివృద్ధి జరిగిందని శూన్యమన్న ఆయన.. అమ్ముడుపోయిన నేతలను ఆదరించొద్దని ప్రజల్ని కోరారు. నియోజక ఆడబిడ్డగా ఉన్న పాల్వాయి స్రవంతిని గెలిపించి.. మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలని కోరారు. డబ్బు సంచులతో వచ్చే వారి మాటలను నమ్మి మోసపోవద్దని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.