రామాయణంలో రాముడికి హన్మంతుడు అండగా ఉన్నట్టు.. తాను రాహుల్ గాంధీకి ఎప్పుడూ అండగా ఉంటానని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. రావణాసురుడిని చంపడం కోసం ఎంత దూరమైనా వెళ్తానన్నారు. తనకు సోనియా గాంధీ గొప్ప అవకాశం ఇచ్చారని.. ప్రధాని, సీఎం పదవుల కంటే పీసీసీ పదవి చాలా గొప్పదని చెప్పారు. జీవితాంతం తాను సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు విశ్వాసపాత్రుడిగా పని చేస్తానని తెలిపారు. గురువారం పార్టీలో చేరినవారిని ఘనస్వాగతం పలికిన రేవంత్.. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, బీజేపీ పార్టీలపై ధ్వజమెత్తారు.
తెలంగాణ రాష్ట్రంలో దళితులు, గిరిజనులు కన్నీరు పెట్టుకుంటున్నారని.. వారికి డబుల్ బెడ్రూం ఇళ్లు, మూడెకరాల భూమి రాలేదని రేవంత్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ వారికి ఇచ్చిన భూముల్ని కేసీఆర్ వెనక్కి తీసుకుంటున్నారని ఆరోపించారు. తండ్రి, కొడుకులు 90 వేల ఉద్యోగాలు ఇస్తామని నమ్మబలికారని.. ఇప్పటికీ ఉద్యోగాల భర్తీ జరగలేదని అన్నారు. వడ్లు కొనను అంటూ బీజేపీ, టీఆర్ఎస్ డ్రామాలు వేస్తే.. మెడలు వంచి వడ్లు కొనుగోలు చేసేలా తాము చేశామన్నారు. ధరణి పోర్టల్ దరిద్రంగా మారిందని, తాము అధికారంలోకి వచ్చాక దాన్ని రద్దు చేస్తామన్నారు. తెలంగాణను కాపాడాల్సిన బాధ్యత యువతదేనని పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి పనైపోయిందని కొందరు సంకలు గుద్దుకున్నప్పుడు.. ఉప ఎన్నికల్లో కుక్క కాటుకి చెప్పు దెబ్బ అన్నట్టు జనం కేసీఆర్ చెంప ఛెళ్లుమనిపించారన్నారు.
ఏడాది సమయంలో తాము ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని, కానీ హుజురాబాద్‌లో ఇబ్బందులు ఎదుర్కొన్నామని, అప్పుడు పార్టీ కార్యకర్తలు తనకు కొండంత అండగా నిలబడ్డారని రేవంత్ అన్నారు. రాహుల్ రాముడైతే నేను హన్మంతుడిని, మీరంతా వానర సైన్యమని నమ్ముతానని, అందుకే ఏఐసీసీ డిజిటల్ సభ్యత్వం టార్గెట్‌ను పూర్తి చేశామన్నారు. 90 రోజుల్లో 45 లక్షల సభ్యత్వం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు. 2001 సిద్దిపేట ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కి 3700 ఓట్లు వచ్చినప్పుడు వైఎస్ పని ఖతం అయ్యిందన్నారని.. కానీ 2004లో అత్యధిక మెజారిటీ సీట్లతో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని గుర్తు చేసుకున్నారు. ప్రతి ఓటమి.. గెలుపుకి, అనుభవానికి అవకాశమన్నారు.
ఇక రాహుల్ గాంధీ మీద కక్ష గట్టి ఈడీ కేసులు పెట్టిస్తున్నారని రేవంత్ ఆరోపించారు. వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకుని.. ప్రజలకు మోదీ క్షమాపణ చెప్పే పరిస్థితికి రాహుల్ గాంధీ తీసుకొచ్చారని, అందుకే ఆ కుటుంబంపై మోదీ కక్ష కట్టారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం, సోనియమ్మ రాజ్యం రావడం తథ్యమని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.