MP Raghunandan Rao : బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారంపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ లకు ఆయన బహిరంగ సవాల్ విసిరారు. గత మూడు రోజులుగా ఎక్కడ చూసినా బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ నేతలు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని రఘునందన్ రావు ధ్వజమెత్తారు.
“నాలుగున్నర దశాబ్దాలలో బీజేపీ బీసీలకు ఏం చేసిందో నేను చెబుతా. మరి బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో పీసీసీ చీఫ్, విప్ ఆది శ్రీనివాస్ చెబుతారా?” అని రఘునందన్ రావు సవాల్ విసిరారు. తాను గణాంకాలతో చర్చకు వస్తానని, ఎక్కడ రమ్మంటే అక్కడ వస్తానని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే మంత్రివర్గం మళ్ళీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. “రాష్ట్రంలో 56 శాతం బీసీలు ఉంటే ముగ్గురికి మంత్రి పదవులు ఇవ్వడం కరెక్టేనా ఆది సీనన్నా?” అని ప్రశ్నించారు.
World Leaders: భారత్‌లో చదువుకున్న ప్రపంచ నాయకులు వీరు..
దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ 250 మందిని ముఖ్యమంత్రులను చేస్తే అందులో 43 మంది మాత్రమే ఓబీసీలు ఉన్నారని తెలిపారు. అదే బీజేపీ 68 మంది ముఖ్యమంత్రులను చేస్తే అందులో 21 మంది ఓబీసీలు ఉన్నారని పేర్కొన్నారు. అంటే, “బీజేపీ 31 శాతం ఓబీసీలను సీఎంలుగా చేసింది, కాంగ్రెస్ పార్టీ 17 శాతం మందిని మాత్రమే సీఎం చేసింది” అని వివరించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా లక్ష్మణ్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ చీఫ్‌గా ఉన్నారని గుర్తు చేశారు. బీజేపీకి బండి సంజయ్ ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్‌గా ఉన్నారని పేర్కొన్నారు.
ఎన్‌డీఏ కూటమిలో 20 మంది ముఖ్యమంత్రులు ఉంటే ఐదుగురు ఓబీసీలు, ముగ్గురు ఎస్టీలు, ఇద్దరు మైనార్టీలు ముఖ్యమంత్రులుగా ఉన్నారని తెలిపారు. మన్మోహన్ సింగ్ క్యాబినెట్‌లో కేవలం ఇద్దరు ఓబీసీలు మంత్రులుగా ఉంటే, మోడీ క్యాబినెట్‌లో 21 మంది ఓబీసీలు మంత్రులుగా ఉన్నారని గణాంకాలు చెప్పారు.
దేశానికి రాష్ట్రపతిగా దళితులను, గిరిజనులను చేసిన ఘనత బీజేపీదని రఘునందన్ రావు అన్నారు. తెలంగాణకు రెండు కేంద్ర మంత్రి పదవులు ఇస్తే, అందులో ఒక బీసీకి మంత్రి పదవి ఇచ్చామని గుర్తుచేశారు.
కేటీఆర్, ఎంపీ సీఎం రమేష్ ఎపిసోడ్ పై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. హెచ్‌సీయూ (HCU) భూముల విషయంలో కేటీఆర్ బీజేపీ ఎంపీలపై “బట్ట కాల్చి మీద వేశాడని” మండిపడ్డారు. హెచ్‌సీయూ విషయంలో కేటీఆర్ మొదట కొండా విశ్వేశ్వర్ రెడ్డి, తనపై ఆరోపణలు చేశారని రఘునందన్ రావు గుర్తుచేశారు.