తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ రెండో దశ ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ పాదయాత్ర ముగింపు సభను తెలంగాణ బీజేపీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ నెల 14న ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభను మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అంతేకాకుండా ఈ సభకు కేంద హోంశాఖ మంత్రి అమిత్ షా రానున్నారు. ఈ నేపథ్యంలో బహరింగ సభకు భారీ జన సమీకరణతో సత్తా చాటేందుకు బీజేపీ సిద్ధమైంది. బూత్ అధ్యక్షుడు సహా ప్రతి పోలింగ్ బూత్‌కు 20 మంది చొప్పున కార్యకర్తలు జన సమీకరణ చేసే దిశగా బీజేపీ పెద్దలు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
నియోజకవర్గానికి 5 వేల చొప్పున జన సమీకరణ చేసే విధంగా అడుగులు వేస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా, మండల, రాష్ట్ర నేతలతో బండి సంజయ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కనీవినీ ఎరగని రీతిలో ముగింపు సభను సక్సెస చేయాలని పిలుపునిచ్చారు. రేపటి నుండి కరెంట్ ఛార్జీల పెంపును నిరసిస్తూ ర్యాలీలు, నిరసనలు చేప్టటాలని ఆదేశించారు. దళిత బిడ్డ నాగరాజు హత్యోదంతంపైనా ఊరూవాడ నిరసన తెలపాలన్నారు.