తెలంగాణ రాష్ట్రంలో అధికార సాధనే లక్ష్యమంటోన్న బీజేపీ ఇవాళ హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నేడు సాయంత్రం 6 గంటలకు జరగబోచే విజయ సంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. ప్రధాని సభ సందర్భంగా జంట నగరాల్లో భారీ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సుమారు వెయ్యి ఆర్టీసీ బస్సులను బీజేపీ బుక్ చేసుకోవడం..జిల్లాల నుంచి వచ్చే బస్సులు ట్రాఫిక్ లో చిక్కుకునే అవకాశం ఉండటంతో ఇవాళ ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మంచిదని పోలీసులు చెబుతున్నారు.
నేడు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 వరకు హైదరాబాద్ లో భారీ ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. ఈనేపథ్యంలో.. సికింద్రాబాద్, పరేడ్ గ్రౌండ్స్, జూబ్లీ బస్ స్టేషన్, రాష్ట్రపతి రోడ్, సరోజినిదేవి రోడ్, సర్దార్ పటేల్ రోడ్, బేగంపేట ఎయిర్ పోర్ట్, మహాత్మా గాంధీ రోడ్, పంజాగుట్ట, బేగంపేట, రాజ్ భవన్, జూబ్లీ చెక్ పోస్ట్, మాదాపూర్ హెచ్ఐసీసీ తదితర ప్రాంతాల వైపు వాహనదారులు తమ ప్రయాణాలను మానుకుంటే మంచిదని సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ప్రకటించారు. నేడు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో ఇవాళ మెట్రో రైళ్ల రాకపోకలపై వస్తున్న ఊహాగానాలకు హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెరదించారు. అంతేకాకుండా మూడు కారిడార్ల పరిధిలో రైళ్లు యథావిధిగా నడుస్తాయని, రోజూ మాదిరిగానే అన్ని స్టేషన్లలో రైళ్లు ఆగుతాయని పేర్కొన్నారు.