ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలపై నల్లగొండ జిల్లా బీజేపీ కార్యాలయంలో కార్యశాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం జరిగిందని ఆరోపించారు. కాంగ్రెస్‌కు ఎన్నికల్లో మద్ధతునిస్తున్నామని బీఆర్ఎస్ చెప్పిందని బండి సంజయ్ పేర్కొన్నారు. అందుకే కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్, ఫార్ములా ఈ కార్ రేసుల్లో బీఆర్ఎస్ నేతలను జైలుకు వెళ్లకుండా ఒప్పందం చేసుకున్నారని బండి సంజయ్ తెలిపారు.
Read Also: Thandel : తండేల్ సక్సెస్ పై నాగార్జున రియాక్షన్.. సోషల్ మీడియాలో పోస్ట్
మరోవైపు.. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు కరువయ్యారు.. బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులే లేరని బండి సంజయ్ ఆరోపించారు. నిరుద్యోగ భృతి ఏది అని.. యువత కాంగ్రెస్ నాయకులను గల్లా పట్టుకొని అడగాలని బండి సంజయ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేరు.. పాఠశాలలో కనీస వసతులు లేవని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన లెక్కలు తప్పుల తడక.. బీసీలు లెక్క పెరగాలి కానీ ఎలా తగ్గుతుందని బండి సంజయ్ ప్రశ్నించారు.
Read Also: INDIA bloc: మేమంతా కలిసే ఉన్నాం, లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ వస్తాం..
ముస్లిమ్ మైనార్టీల ఓట్లతో స్థానిక సంస్థల్లో గెలవాలని కాంగ్రెస్ కుట్ర చేస్తుందని బండి సంజయ్ అన్నారు. బీసీ సంఘాలు ఎందుకు మాట్లాడడం లేదు.. విద్యా వ్యవస్థ మొత్తం అర్బన్ నక్సల్స్ చేతిలో పెట్టారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ఫలితాల స్ఫూర్తితో మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని బండి సంజయ్ కోరారు. ఈ 11 ఏళ్లలో తెలంగాణకు ఎంత బడ్జెట్ విడుదల చేసామో.. చర్చకు తాము సిద్ధమని తెలిపారు.