తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ రెండో దశ ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో నేడు 5వ రోజుల జోగులాంబ గద్వాల్ జిల్లాలోని ఇటిక్యాల మండలం వేముల నుంచి పాదయాత్రను బండి సంజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంలో టీఆర్ఎస్ శ్రేణులు పాదయాత్రను అడ్డుకున్నారు. దీంతో ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. దీంతో కొంత మంది కార్యకర్తలు కిందపడిపోయారు. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
ఈ ఘటనపై ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపూరావు స్పందిస్తూ.. ఖబడ్దార్…. కేసీఆర్.. మా ఓపికను చేతగానితనంగా భావించొద్దని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ కార్యకర్తలు తిరగబడితే తట్టుకోలేవ్.. ప్రశాంతంగా కొనసాగుతున్న ప్రజా సంగ్రామ యాత్రపై టీఆర్ఎస్ గూండాల దాడి హేయనీయమని ఆయన మండిపడ్డారు. ప్రజా సంగ్రామ యాత్రలో బండి సంజయ్ కుమార్ కు వస్తున్న స్పందన చూసి టీఆర్ఎస్ నేతలు తట్టుకోలేకపోతున్నారని ఆయన అన్నారు. ఈ యాత్రతో టీఆర్ఎస్ నేతల కాళ్ల కింద భూమి కదులుతోందని, అక్కసుతో ప్రజా సంగ్రామ యాత్రను ఎట్లయినా అడ్డుకోవాలని కొంతమంది చిల్లరగాళ్లకు మందు తాగించి పంపిస్తున్నారని ఆయన విమర్శించారు.
కొందరు చెంచాగాళ్లు, కేసీఆర్ మోచేతి నీళ్లు తాగే నాయకులు అడ్డుకున్నంత మాత్రాన ప్రజా సంగ్రామ యాత్ర ఆగదని, ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ నుండి కుట్రలు చేస్తున్నారనే విషయాన్ని బండి సంజయ్ ముందే పసిగట్టి బయటపెట్టిన రాష్ట్ర ప్రజానీకానికి తెలిసిందేనని ఆయన వెల్లడించారు. బండి సంజయ్ కనుసైగ చేస్తే చాలు… బీజేపీ కార్యకర్తలు తిరగబడతారు. మా పార్టీ కార్యకర్తలు తిరగబడితే టీఆర్ఎస్ ఉంటదా? అని ఆయన ప్రశ్నించారు.
కానీ మా అధ్యక్షుడు బండి సంజయ్ లక్ష్యం ఇది కాదని, ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకోవాలని, కేసీఆర్ ప్రభుత్వం గత 8 ఏళ్లుగా తెలంగాణ ఫ్రజలను చేస్తున్న మోసాలను బయటపెట్టడమే లక్ష్యంగా పాదయాత్ర చేస్తున్నారన్నారు. అందుకే మేం సంయమనంతో ఉన్నామని, మా ఓపికను చేతగానితనంగా భావించొద్దని హెచ్చరిస్తున్నానన్నారు. టీఆర్ఎస్ చిల్లరగాళ్ల కారు కూతలు, చిల్లర చేష్టలతో బీజేపీని ఏమీ చేయలేరని గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు.