Mobile Immersion Ponds Innaugurates For Eco Friendly Visarjan: హైదరాబాద్ నగరంలో గణేశ్ నిమజ్జనం సమయంలో ఎంత హడావుడి వాతావరణం ఉంటుందో అందరికీ తెలుసు. అయితే.. ఈసారి ఈ హడావుడిని కాస్త అదుపు చేసేందుకు, కృత్రిమంగా ఏర్పాటు చేసిన భారీ నీటి తొట్టెలను అమర్చుతున్నారు. ఎకో ఫ్రెండ్లీ విసర్జన్ పేరుతో కొన్ని ప్రాంతాల్లో వాహనాల్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇంటి వద్దే చాలామంది చిన్న చిన్న గణేశుడి విగ్రహాలను పెట్టి, ఉత్సవాలను జరుపుకునే విషయం అందరికీ తెలిసిందే! ఈ విగ్రహాలను ఇంటి వద్దే నిమజ్జనం చేసేందుకు వీలుగానే.. ఈ నీటి తొట్టెల వాహనాల్ని సిద్ధం చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాల్లో ఇదొక భాగం. దూర ప్రాంతాలకు వెళ్లి నిమజ్జనం చేసేందుకు ఇబ్బందులు పడే వాళ్లకు, ఇకపై ఆ సమస్య ఉండదు.
జీహెచ్ఎంసీతో కలిసి ద ఫ్రీడమ్ గ్రూప్ ఈ మొబైల్ పాండ్స్‌ను సిద్ధం చేశారు. ప్రజల రిక్వెస్ట్ మేరకు, ఆయా ప్రాంతాల్లో ఈ వాహనాల్ని పంపించి, వినాయకుడి నిమజ్జనం కార్యక్రమాల్ని చేపట్టడం జరుగుతుంది. అయితే.. సైజులో చిన్నగా ఉండే విగ్రహాలనే ఇందులో నిమజ్జనం చేయాలి. భారీ విగ్రహాల్ని చేయడానికి వీలు లేదు. ఈ వాహనాల్ని టీఆఎస్ ఫుడ్ చైర్మన్ రాజీవ్ సాగర్‌తో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఇంటి వద్దే నిమజ్జనం చేయడమనేది ఒక మంచి ఆలోచన అని, ఎవరైతే గణేశుడి విగ్రహాలను ఇంటి వద్దే నిమజ్జనం చేయాలని అనుకుంటారో, వాళ్లు ఫ్రీడమ్ గ్రూప్‌ని సంప్రదించవచ్చని మంత్రి అన్నారు. అంతేకాదు.. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీసీ, టీఎస్‌పీసీడీ డిపార్ట్‌మెంట్స్ గణేశ్ నవరాత్రుల సందర్భంగా మొత్తం ఆరు లక్షల మట్టి విగ్రహాలను పంపిణీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.