సైనిక బలగాల నియామకం విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అగ్నిపథ్ రిక్రూట్ మెంట్ స్కీంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అగ్నిపథ్ ఓ అనాలోచిత నిర్ణయమని, 46 వేల మందిని 90 రోజులలో నియామకం, కేవలం రూ.30 వేల జీతం అర్థం లేనిదన్నారు. దేశ భద్రత విషయంలో ఇంత అనాలోచిత నిర్ణయం అవివేకమని ఆయన మండిపడ్డారు. పదవ తరగతి పాసైన వారు అగ్నిపథ్ లో చేరి తిరిగి వెళ్లేటప్పుడు 12 వ తరగతి పాసైన సర్టిఫికెట్ ఇస్తామనడం సిగ్గుచేటని, దేశ రక్షణ కోసం తీసుకుంటున్నారా .. సర్టిఫికెట్ లో అప్రెంటీస్ షిప్ కోసం తీసుకుంటున్నారా అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ పాపం ముదిరి పాకానపడిందని, మొన్న నల్ల వ్యవసాయ చట్టాలతో రైతుల ఉసురుపోసుకున్నారని, నేడు అగ్నిపథ్ లాంటి నిర్ణయాలతో యువత ఉసురు పోసుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
నల్లధనం తెస్తాం .. రూ.15 లక్షలు పేదల ఖాతాలలో వేస్తాం అని అమాయకుల ఓట్లు కొల్లగొట్టారని, జీఎస్టీ పేరుతో రాష్ట్రాల ఆదాయం కొల్లగొట్టారన్నారు. ఉపాధిహామీని వ్యవసాయానికి అనుసంధానం చేస్తాం, స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేస్తాం అని రైతులను మోసం చేశారన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు అడ్డికి పావుశేరు కింద అమ్మేస్తున్నారని, మోడీ పాలనలో దేశంలో నిరుద్యోగ శాతం 5.6 శాతం నుండి 7.83 శాతానికి పెంచారన్నారు. ఆకలిసూచిని 110 దేశాలలో భారత్ ను 101 స్థానంలో నిలపడం దుర్మార్గమని ఆయన ధ్వజమెత్తారు.