తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలు రోజుకో మలుపు తిరుగుతుంటాయి. నేతలు కీలక ప్రకటనలతో హోరెత్తిస్తూ వుంటారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం ఉంది. అలా అని హద్దు మీరితే అధిష్టానం ఊరుకోదు. గీత దాటితే వేటు తప్పదన్నారు. ఎలాంటి చర్యలు తీసుకోవాలో అధిష్టానంకి తెలుసు. వ్యక్తిగత సమస్యలు ఉంటే అంతర్గతంగా చర్చించుకోవాలన్నారు.
పీసీసీలో ఎన్నో కమిటీలు ఉన్నాయి. ఏఐసీసీ కూడా ఉంది. ఏదైనా సమస్య ఉంటే ఏఐసీసీకి చెప్పుకొనే అవకాశం ఉంది. ఏఐసీసీ నాయకులు అన్నీ పరిశీలిస్తున్నారు. ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఈసమయంలో ఇలాంటి మీటింగ్ లు కరెక్ట్ కాదు. జగ్గారెడ్డి ప్రజాబలం ఉన్న నాయకుడు. మీ సవాళ్లు మనపై కాదు.. అధికార పార్టీపై విసరాలన్నారు మహేష్ కుమార్ గౌడ్. మంత్రి హరీష్ ని వీహెచ్ ఎందుకు కలిశారు అనేది ఏఐసీసీ పరిశీలిస్తోంది.
ఏఐసీసీ నియమించిన పీసీసీనీ గౌరవించాలి. పార్టీకి నష్టపరిచే ఎటువంటి కార్యక్రమాలను ఏఐసీసీ సహించదు. కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరూ విధేయులు. సోనియాకు, రాహుల్ కి అందరం విధేయులం. ప్రత్యేకించి మేము విధేయులం అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బాహాటంగా మాట్లాడటం సరైంది కాదని హితవు పలికారు. మన ఊరు మన పోరు సభలు విజయవంతం అవుతున్నాయి. కేసీఆర్ మరో కొత్తనాటకానికి తెరలేపారని మండిపడ్డారు మహేష్ కుమార్ గౌడ్.