KTR : రాజన్న సిరిసిల్ల జిల్లాలో నూతనంగా ఎన్నికైన బీఆర్ఎస్ సర్పంచులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సర్పంచులకు దిశానిర్దేశం చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎలా ఉంటాడో, గ్రామానికి సర్పంచ్ కూడా అలానే ఉంటారని కేటీఆర్ అన్నారు. సర్పంచులు ఎవరి కింద పనిచేసేవారు కాదని, వారు సర్వస్వతంత్రులని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు బెదిరించినా భయపడాల్సిన అవసరం లేదని, వారి చేతిలో ఏమీ ఉండదని ధైర్యం చెప్పారు. ముందుగా సర్పంచులు తమ గ్రామపంచాయతీ హక్కులు, అధికారాలను పూర్తిగా తెలుసుకోవాలని సూచించారు.
సర్పంచుల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ముఖ్యమంత్రిని తాను ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించిన కేటీఆర్, కాంగ్రెస్ పార్టీ ఎన్ని కిరాతకాలు చేసినా రెండు దశల్లో గులాబీ జెండా సత్తా చాటిందని అన్నారు. రెండేళ్ల పాలనలో కాంగ్రెస్ నాయకులు ఏమి చేశారో ఆత్మవిమర్శ చేసుకోవాలని, ఇప్పటికి 800 రోజులు గడిచినా హామీలు నెరవేర్చలేదని విమర్శించారు. మళ్లీ వచ్చే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీరు మరో రెండేళ్లు సర్పంచులుగా కొనసాగుతారని విశ్వాసం వ్యక్తం చేసిన కేటీఆర్, అప్పటివరకు ఎదురయ్యే ఇబ్బందులను ఓర్చుకోవాలని సూచించారు. గ్రామాల అభివృద్ధికి వచ్చే నిధులను ఎవ్వరూ ఆపలేరని స్పష్టం చేశారు. సర్పంచులను ఇబ్బంది పెడితే వెంటనే లీగల్ సెల్ ఏర్పాటు చేసి కోర్టులను ఆశ్రయించాలని సూచించారు.
ISIS Australia Link: నిఘా సంస్థలను మోసం చేసిన సిడ్నీ కసాయి..
బీఆర్ఎస్ పాలనలో గ్రామాల అభివృద్ధిలో దేశంలో ఏ ప్రభుత్వం సాధించని రికార్డులను సాధించామని కేటీఆర్ తెలిపారు. గ్రామాల్లో సర్పంచులు పనిచేసి చూపించాలన్నారు. పదవులు వస్తే కుర్చీల్లో కూర్చోవడం కాదు, పదవులకు వన్నె తెచ్చేలా పనిచేయాలని హితవు పలికారు. సర్పంచ్ పదవిని ప్రజల కోసం, గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసం వినియోగించుకోవాలని సూచించారు. రాజ్యాంగబద్ధంగా వచ్చే నిధులు గ్రామాలకు తప్పకుండా వస్తాయని, ఒకవేళ రాకపోతే అసెంబ్లీలో కొట్లాడి అయినా నిధులు తెప్పిస్తామని హామీ ఇచ్చారు. ఎవరు బెదిరించినా భయపడకుండా గ్రామాలను అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు. అధికారం పోయిందని బాధ లేదని, ఎక్కడ పోయినా అక్కడి నుంచే అధికారాన్ని తిరిగి తెచ్చుకోవాలని ధీమా వ్యక్తం చేశారు. ఎలక్షన్ల వరకే రాజకీయమని, ఎన్నికలు పూర్తయ్యాక గ్రామాభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలని కేటీఆర్ సర్పంచులకు పిలుపునిచ్చారు.
Varanasi : ‘వారణాసి’లోకి పవర్‌ఫుల్ యాక్టర్ ఎంట్రీ.. వైరల్ అవుతున్న క్రేజీ న్యూస్!