ISIS Australia Link: ఆస్ట్రేలియాలోని సిడ్నీ బోండి బీచ్‌లో కాల్పులు జరిపిన ఇద్దరు ఉగ్రవాదులు పాకిస్థానీ జాతీయులని అధికారులు తెలిపారు. లాహోర్‌కు చెందిన తండ్రీకొడుకులు హనుక్కా వేడుకలు జరుపుకునేందుకు బోండి బీచ్‌లో గుమిగూడిన జనంపై ఒక్కసారిగా కాల్పులు జరపడంతో సుమారుగా 15 మంది మృతి చెందారని అధికారుల దర్యాప్తులో తేలింది. సమాచారం అందించిన వెంటనే పోలీసులు రంగంలోకి దాడి చేసిన ఒక వ్యక్తిని ఎదురు కాల్పులలో చంపారు. ఈ సందర్భంగా న్యూ సౌత్ వేల్స్ పోలీస్ కమిషనర్ మాల్ లాన్యోన్ మాట్లాడుతూ.. మృతుడిని సాజిద్ అక్రమ్ (50) గా గుర్తించినట్లు తెలిపారు. అలాగే ఎదురుకాల్పుల్లో సాజిద్ కుమారుడు నవీద్ అక్రమ్ (24) గాయపడ్డాడని చెప్పారు.
READ ALSO: Ram Vilas Das Vedanti: విషాదం! రామజన్మభూమి ఉద్యమ ప్రధాన సూత్రధారి కన్నుమూత..
దాడికి ముందు ఈ ఇద్దరు ఉగ్రవాదులు దక్షిణ తీరంలో చేపలు పట్టడానికి వెళ్తున్నామని వారి కుటుంబానికి చెప్పారని దాడిపై దర్యాప్తు చేస్తున్న బృందం పేర్కొంది. అధికారులు ఈ దాడిని దాదాపు మూడు దశాబ్దాలలో ఆస్ట్రేలియాలో జరిగిన అత్యంత దారుణమైన ఘటనగా అభివర్ణిస్తున్నారు. కఠినమైన గన్ లైసెన్స్ చట్టాలకు పేరుగాంచిన ఈ దేశంలో కాల్పులు జరగడం ఆశ్చర్యకరంగా ఉందని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.
ఆస్ట్రేలియా హోం వ్యవహారాల మంత్రి టోనీ బర్క్ మాట్లాడుతూ.. నవీద్ అక్రమ్ ఆస్ట్రేలియాలో జన్మించిన పౌరుడని తెలిపారు. సాజిద్ అక్రమ్ 1998లో విద్యార్థి వీసాపై ఆస్ట్రేలియాకు వచ్చాడని, ఆ తర్వాత ఆయన ఆ వీసాని 2001లో భాగస్వామి వీసాగా, తరువాత నివాసి రిటర్న్ వీసాగా మార్చారని చెప్పారు. దాడి తర్వాత ఆదివారం రాత్రి నైరుతి సిడ్నీలోని బోనీరిగ్‌లో కాల్పులు జరిపిన ఉగ్రవాదుల ఇంటితో పాటు కెంప్సీలో పోలీసులు దాడి చేశారు. ఆస్ట్రేలియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ నివేదిక ప్రకారం.. జాయింట్ కౌంటర్ టెర్రరిజం టీం (JCTT), ఈ దాడి చేసినవారు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు విధేయత చూపారని చెబుతుంది. బోండి బీచ్ వద్ద దాడి చేసిన వారి కారులో రెండు ఐఎస్ జెండాలు కనిపించాయని ఒక అధికారులు తెలిపారు.
ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ మాట్లాడుతూ.. నవీద్ అక్రమ్ మొదటిసారిగా 2019 అక్టోబర్‌లో నిఘా సంస్థ ASIO దృష్టికి వచ్చాడని అన్నారు. ఆయనపై దాదాపు ఆరు నెలల పాటు దర్యాప్తు జరిగిందని, కానీ తరువాత అధికారులు ఆయన నుంచి ఎటువంటి ప్రమాదం లేదని నిర్ధారించి వదిలేశారని అన్నారు. పలువురు అధికారులు మాట్లాడుతూ.. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఏడేళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న ISIS ఉగ్రవాది మటారితో నవీద్ అక్రమ్‌కు సంబంధం ఉందన్నారు. నవీద్ తనను తాను ఉగ్రవాద సంస్థ ఆస్ట్రేలియన్ కమాండర్‌గా అభివర్ణించుకున్నాడని చెబుతున్నారు. సోమవారం ఉదయం కమిషనర్ లాన్యన్ మాట్లాడుతూ.. సాజిద్ అక్రమ్ గత 10 సంవత్సరాలుగా లైసెన్స్ పొందిన తుపాకీలను కలిగి ఉన్నాడని చెప్పారు. కాల్పులకు కొన్ని గంటల ముందు ఆదివారం ఉదయం తన కుమారుడు చివరిసారిగా కుటుంబ సభ్యులను సంప్రదించాడని నవీద్ తల్లి వెరినా స్థానిక మీడియాకు తెలిపింది. సంఘటన స్థలంలో తీసిన వీడియోలు, ఫోటోలలో తన కొడుకును గుర్తు పట్టలేకపోయానని, అతను హింస, తీవ్రవాద కార్యకలాపాలలో పాల్గొన్నాడంటే తాను నమ్మడం లేదని ఆమె వాపోయారు.