తెలంగాణలో టీఆర్‌ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లు ఉంది. టీఆర్‌ఎస్ నేతలు బీజేపీ నాయకులపై విమర్శలు చేస్తుంటే.. అది కూడా డైరెక్టుగా సీఎం కేసీఆర్ రంగంలోకి దిగి బీజేపై విమర్శల వర్ష కురిపిస్తున్నారు. దీంతో బీజేపీ నేతలు సైతం టీఆర్ఎస్ అధినేతతో సహా నేతలకు కౌంటర్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. హుజురాబాద్‌లో నన్ను ఓడిస్తారా అని అహంకార పూరితంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. కేసీఆర్ కుటుంబానికి ఉద్యమ కారులతో సహా అందరూ బానిసలుగానే ఉండాలి తప్ప.. ఎదురు మాట్లాడకూడదని ఆయన మండిపడ్డారు. సీఎంగా కేసీఆర్ తీరు దిగజారుడుగా దివాళా తనంగా ఉందని ఆయన అన్నారు. అబద్దాలు మాట్లాడడం, భయపెట్టడం, రాజ్యాంగానికి విరుద్ధంగా హింసను ప్రేరేపిస్తున్నారు.. అధికార దుర్వినియోగం కి అద్దం పడుతోందని ఆయన ఆరోపించారు.
అంతేకాకుండా.. కేసీఆర్ మాట్లాడినట్టు పాకిస్తాన్ కూడా మాట్లాడలేదని, బీజేపీకి, కేంద్రానికి శత్రువులు ఎవరు లేరు.. కేవలం ప్రత్యర్థులు మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. పాకిస్థాన్ మాత్రం శత్రువేనని ఆయన అన్నారు.నియంతగా ఎవరు వ్యవహరించిన ప్రజలు సహించరని, కేసీఆర్ నిజాం ల పాలన కొనసాగించాలని… తను ,తన తరవాత కొడుకు, కొడుకు తర్వాత ఆయన కొడుకు అధికారంలో ఉండాలని అనుకుంటున్నాడని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ అమరవీరుల స్తూపం సాక్షిగా నరేంద్ర మోడీ ప్రభుత్వం 7 ఏళ్లలో ఏమి చేసిందో చర్చించేందుకు సిద్ధమని ఆయన సవాల్ విసిరారు. చూడాలి మరి.. దీనిపై టీఆర్‌ఎస్ ఏ విధంగా స్పందిస్తారో..