Phone Tapping Row: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్రంలో అనేక మంది ఫోన్లు ట్యాపింగ్ చేశారని ఆరోపించారు. ఈ సందర్భంగా కేటీఆర్ కు కేంద్రమంత్రి సవాల్ విసిరారు. ఫోన్ ట్యాపింగ్ పై తడి బట్టలతో ప్రమాణం చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను.. కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేయించాడని నాకు తెలుసు.. నా కుటుంబం మొత్తాన్ని తీసుకొచ్చి ప్రమాణం చేయిస్తా.. ఏ గుడికి రమ్మాంటారో టైమ్, డేట్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక, ఎస్ఐబీ దేనికోసం పని చేయాలి.. ఎస్ఐబీ అనేది మావోయిస్టుల కదలికలపై పని చేయాలి.. ప్రభాకర్ రావుని తీసుకొచ్చి ఎస్ఐబీలో పెట్టారని బండి సంజయ్ పేర్కొన్నారు.
Read Also: Pellilo Pelli : ఇదేందయ్యా ఇదీ.. పెళ్ళిలో పెళ్లా ?
ఇక, ప్రభాకర్ రావు ఎవరని తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్రం అడిగితే.. ఎస్ఐబీ అని చెప్పకుండా ఐజీ అని తప్పుడు సమాచారం ఇచ్చిందని ఆరోపించారు. ఎస్ఐబీకి మావోయిస్టు సానుభూతిపరులుగా మా పేర్లు పోలీసులకు పంపారు.. ఆ జాబితాలో సీఎం రేవంత్ రెడ్డి పేరుతో పాటు నా పేరు కూడా ఉందని బండి సంజయ్ అన్నారు. దీంతో హైకోర్టు జడ్జిలు, సినిమా నటులు, వ్యాపారవేత్తలు, చివరికి బీఆర్ఎస్ నేతల ఫోన్లు కూడా ట్యాప్ చేసి బ్లాక్ మెయిల్ చేశారని పేర్కొన్నారు. కాగా, ముంబై ఎన్నికల కోసం ఇక్కడి నుంచి డబ్బు పంపలేదా అని ప్రశ్నించారు. అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయ్ అని అడిగారు. ఈ ఫోన్ ట్యాపింగ్ పై సీబీఐతో విచారణ జరిపించాలి.. అప్పుడే సమగ్రమైన నివేదిక వస్తుందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ వెల్లడించారు.