Jagadish Reddy : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేడెక్కుతున్న వేళ, ప్రచార రంగంలో బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఘాటుగా స్పందించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ బీఆర్ఎస్ నాయకులను బెదిరిస్తున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ మంత్రులు, పోలీసులు, గుండాయిజాన్నే నమ్ముకున్నారని, కానీ ప్రజలు ఈ రౌడీయిజాలను, బెదిరింపులను ఎప్పుడూ లెక్కపెట్టరు అని వ్యాఖ్యానించారు. తండ్రి లాగానే కుమారుడూ భయపెడతానంటూ మాట్లాడుతున్నారని, కానీ ఇప్పుడు ప్రజలు ఎవరి భయానికీ లొంగరని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి రౌడీలు, గుండాల అంతు ప్రజలు ఎప్పుడో చూశారని, మనం డెమోక్రసీలో ఉన్నామన్న విషయం వీళ్లు మర్చిపోయారన్నారు.
కానీ ప్రజల్లో ఒక్కసారి తిరుగుబాటు వచ్చిందంటే ఆ ఉప్పెన ముందు ఎవరూ తట్టుకోలేరు అని హెచ్చరించారు. కాంగ్రెస్ అభ్యర్థి సహజత్వం అదే… చాయ్ కొట్టు, కిల్లీ కొట్టోళ్లను భయపెట్టే వాళ్లని నాయకులంటారా? ప్రజలు ఇప్పుడు ఆలోచిస్తున్నారు అటువంటి నాయకులు నిజంగా అవసరమా అని, ఈ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు.