హైదరాబాద్‌లో ఉస్మానియా ఆస్పత్రిపై కమిటీ త్వరగా రిపోర్ట్ ఇవ్వాలన్నారు మంత్రి హరీష్ రావు. ఉస్మానియా ఆసుపత్రిపై నియమించిన చీఫ్ ఇంజినీర్ల కమిటీ తన రిపోర్టును త్వరగా ఇవ్వాలని మంత్రులు హరీశ్ రావు, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను కోరారు. ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం సోమవారం ఎంసిఅర్ హెచ్ ఆర్ డి లో మంత్రుల బృందం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీతో కలిసి చీఫ్ ఇంజనీర్ల కమిటీతో భేటీ అయ్యారు.
హైకోర్టు సూచనలు, కమిటీ రిపోర్టు ప్రకారం హెరిటేజ్ బిల్డింగ్ కి ఇబ్బంది కలగకుండా కొత్త నిర్మాణాలు చేపట్టడంపై సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తామన్నారు.ఈ సందర్బంగా కమిటీకి పలు సూచనలు చేశారు. చారిత్రాత్మకమయిన ఉస్మానియా ఆస్పత్రి భవనాన్ని కూల్చి కొత్త భవనం నిర్మించాలని ప్రభుత్వం గతంలోనే భావించింది. సీఎం కేసీఆర్ 2015 జూలై 21న ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించి వారం రోజుల్లో పాత భవనాన్ని పూర్తిగా ఖాళీ చేయించి వెంటనే రెండు టవర్ల నిర్మాణ పనులు చేపడుతున్నట్లు హామీ ఇచ్చారు. పాత భవనాన్ని కూల్చవద్దంటూ కొంతమంది న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో హామీ కార్యరూపం దాల్చలేదు.
రెండోసారి టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పాతభవనం మరమ్మతులు చేయాలని భావించింది. ఆగాఖాన్ ట్రస్ట్ సహకారంతో పనులు మొదలు పెట్టేందుకు రూ.25 కోట్లు మంజూరు చేసి పాత భవనంలోని రోగులను సగం వరకు ఇతర భవనాల్లోకి తరలించారు. జూలై 14, 2020న భారీవర్షం కురిసి పాతభవనాల్లోకి వర్షం నీరు చేరడంతో రోగులు ఇబ్బందులు పడ్డారు. రోగులను ఇతర భవనాల్లోకి తరలించారు. అక్కడ ట్విన్ టవర్స్ నిర్మించాలని ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అయితే కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. భవనాన్ని కూల్చరాదని కొందరు, కూల్చాలంటూ మరికొందరు కేసులు వేయడంతో ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టు పరిధిలోకి వెళ్లింది. తాజాగా ప్రభుత్వం ఆర్‌అండ్‌బీ, ఎంఏ అండ్ యూడీ విభాగం, పంచాయితీరాజ్ అండ్ రూరల్ డెవల్‌పమెంట్ విభాగపు చీఫ్ ఇంజినీర్లతోపాటు జీహెచ్‌ఎంసీ చీఫ్ సిటీ ప్లానర్లతో కమిటీ వేసింది. ఈ కమిటీ నివేదిక ఆధారంగా కోర్టు నిర్ణయం తీసుకోనుంది. కమిటీ నివేదిక కోసం అంతా ఎదురుచూస్తున్నారు.
Harish Rao : ఆసుపత్రిలో హరీష్ రావు సడన్ ఎంట్రీ.. ఆ డాక్టర్ సస్పెండ్..