Gutha Sukender Reddy: తాను పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతోందన్నారు. తాను పార్టీ మారాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. తాను రాజ్యాంగ శాసన మండలి చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నానని, తనకు ఏ పార్టీతో సంబంధం లేదని చెప్పారు. నల్గొండలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. చట్టబద్ధంగా విధులు నిర్వహిస్తామని, ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందన్నారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ పై వ్యతిరేకత లేదని, ప్రజల్లో ప్రేమ, నమ్మకం ఉందన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు నమ్మి ప్రజలు ఓట్లు వేశారని అనుకోవడం లేదని చెప్పారు. కేసీఆర్ రావాలి-మా ఎమ్మెల్యేలు పోవాలని ఓటర్లు అనుకున్నట్లు ఉందన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కేటీఆర్ పనితీరుకు ఓట్లు పడ్డాయని తెలిపారు. ఇందుకు అవసరమైన సలహాలు, సూచనలను ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం కూడా సాధ్యాసాధ్యాలు, అసాధ్యాలను బేరీజు వేసుకోవాలని సూచించారు.
Read also: Goodachari 2 : కొత్త మిషన్ తో మొదలైన అడివి శేష్ గూఢచారి 2..
వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరించి పథకాలు అమలు చేయాలని, వాస్తవాలు చెబితే ప్రజలకు కచ్చితంగా అర్థమవుతుందని అన్నారు. ప్రజలు తమకు వ్యతిరేకంగా ఎందుకు తీర్పు ఇచ్చారో కూడా బీఆర్‌ఎస్ నాయకత్వం విశ్లేషిస్తోందని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని, శాశ్వతంగా ఎవరికీ అధికారం ఉండదని వెల్లడించారు. మంత్రుల వ్యాఖ్యలు పేపర్లలో చూశానని, ఇప్పుడు విమర్శలకు సమయం కాదన్నారు. పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేస్తూనే తగు కార్యాచరణతో పని కొనసాగించాలని సూచించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు రెండు మంత్రి పదవులు రావడం సంతోషంగా ఉందన్నారు. జిల్లా అభివృద్ధికి మంత్రులిద్దరూ కృషి చేయాలని కోరారు. జిల్లాలో ఇరిగేషన్ పనులు అసంపూర్తిగా ఉన్నాయని, వాటిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టి పెట్టాలన్నారు. జిల్లాలో రోడ్ల అభివృద్ధికి మంత్రి వెంకట్ రెడ్డి కృషి చేస్తారన్న నమ్మకం ఉందన్నారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ త్వరలో సంపూర్ణ ఆరోగ్యంతో బయటకు రావాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
Ponnam Prabhakar: గత ప్రభుత్వం మాదిరిగానే మేము ఇస్తాం.. రైతుపెట్టుబడి పై పొన్నం ప్రభాకర్