GHMC : రాబోయే గణేష్ ఉత్సవాలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎటువంటి అవాంఛనీయ పరిస్థితులు లేకుండా, శాంతియుత వాతావరణంలో జరగాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారుల సహకారం అవసరమని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ కోరారు. సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో, ఈ నెల 27న ప్రారంభమై సెప్టెంబర్ 6వ తేదీ వరకు నిర్వహించనున్న గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి, ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో కమిషనర్ అధ్యక్షతన సన్నాహక సమన్వయ సమావేశం జరిగింది.
Income Tax Bill: లోక్ సభలో కొత్త ఆదాయపన్ను బిల్లు పాస్..
కమిషనర్ ఆర్.వి. కర్ణన్ మాట్లాడుతూ, గత సంవత్సరం లాగా ఈసారి కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఘనంగా గణేష్ ఉత్సవాలు జరగేందుకు జీహెచ్ఎంసీ, పోలీస్ ఇతర ప్రభుత్వ శాఖలు తగినంత సహకారం అందిస్తాయని తెలిపారు. నగరంలో అధిక వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేయడానికి చర్యలు చేపడుతున్నట్లు, గణేష్ ప్రతిమల ఊరేగింపు జరిగే జాతీయ రహదారుల్లోని రోడ్ల మరమ్మతులు కూడా త్వరగా పూర్తి చేయబోతున్నట్లు తెలిపారు.
పోలీస్ సూచన మేరకు నిమజ్జన కార్యక్రమం సజావుగా, వేగంగా జరిగేలా గత సంవత్సరంతో పోలిస్తే ఎక్కువ క్రేన్‌లు వినియోగిస్తామని తెలిపారు. గణేష్ ఉత్సవాలకు బడ్జెట్ లో ఎలాంటి సమస్యలేవని, వివిధ ఏర్పాట్ల కోసం గత సంవత్సరంతో పోలిస్తే మరింత నిధులు కేటాయించి, అవసరమైన లాజిస్టిక్స్ అందజేస్తామని కమిషనర్ తెలిపారు. వేడుకలు సజావుగా జరిగేందుకు జోనల్ పరిధిలో సమన్వయ సమావేశాలు నిర్వహిస్తామని, గత లోటుల సమీక్ష ద్వారా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని చెప్పారు.
లా అండ్ ఆర్డర్ అదనపు సిపి విక్రమ్ సింగ్ మాన్ గణేష్ ఉత్సవాల నిర్వహణకు సంబంధించి పలు సూచనలు చేశారు. ప్రతి సంవత్సరం భాగ్యనగర్ సహా ఇతర గణేష్ ఉత్సవ సమితులు, ప్రభుత్వ శాఖల సమన్వయంతో పండుగలను సజావుగా జరుపుకుంటున్నట్లు ఆయన తెలిపారు. వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉన్నందున, గణేష్ పండాలు, మండపాల నిర్మాణానికి నాణ్యమైన మెటీరియల్, వైరింగ్ ఇతర లాజిస్టిక్స్ వినియోగించాల్సిందిగా సూచించారు. ఊరేగింపులో ప్రతిమల అధిక ఎత్తుతో సమస్యలు, ట్రాఫిక్ జామ్ తలెత్తకుండా ముందుగా రూట్ మ్యాప్ రూపొందించి వాహన హైట్ ఆధారంగా ప్రతిమలను ప్రతిష్ఠించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రతి మండపంలో కనీసం ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేయాలని, పెద్ద మండపాల్లో ముగ్గురికిపైగా వాలంటీర్లను నియమించాలని సూచించారు. సందర్శకుల మార్గాలు వేర్వేరు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఖైరతాబాద్, బాలాపూర్ తదితర నగర ప్రాంతాల్లో గణేష్ విగ్రహాల ఊరేగింపులు సమయానికి ప్రారంభమై, నిమజ్జనం సజావుగా జరగాలన్నారు.
భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు గణేష్ ఉత్సవాల విజయవంతమైన నిర్వహణకు సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు. సమావేశంలో ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్, అడిషనల్ కమిషనర్ రఘు ప్రసాద్, CE రత్నాకర్, జోనల్ కమిషనర్లు, HMDA, HMRL, TSRTC, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పోలీసులు, HMS&SB, అగ్నిమాపక, నీటిపారుదల, పర్యాటకం, ఆరోగ్యం, కాలుష్య నియంత్రణ బోర్డు, ట్రాన్స్‌కో అధికారులు పాల్గొన్నారు.
Tollywood : రేపు ఫెడరేషన్, ఛాంబర్ భేటీ.. ముగింపు పలుకుతారా..?