రాజన్న సిరిసిల్లా జిల్లాలో మాజీ మేయర్, కరీంనగర్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ అభ్యర్థి రవీందర్ సింగ్ ఆదివారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ పార్టీపై మంత్రి కేటీఆర్ పై విమర్శల దాడులకు దిగారు. సిరిసిల్ల మునిగిపోతుంటే మంత్రిగా కేటీఆర్ ఏం చేస్తున్నారు. మీరు కేవలం ఐటీమంత్రిగానే పనిచేస్తారు… మీరు మున్సిపల్ మంత్రిగా పనికిరారు. 500 సెక్షన్లు ఉన్న మున్సిపల్ చట్టాన్ని 200 సెక్షన్లుగా మార్చి.. కౌన్సిలర్లను, కార్పోరేటర్లను ఉత్సవ విగ్రహాలుగా మార్చిన ఘనత మీదేనని ఎద్దేవా చేశారు. దళితులపై సిరిసిల్లలో దాడులు జరిగాయి. కేటీఆర్ క్యాంపు రాజకీయాలతో ఎమ్మెల్సీలను గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌కు ఓట్లు తప్ప వేరే ధ్యాస లేదన్నారు.
కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్సీలను గెలిపించుకునేందుకు దాదాపు 6 గురు మంత్రులున్నా వ్యర్థమన్నారు. 15 మంది ఎమ్మెల్యేలు, 5 జెడ్పీ ఛైర్ పర్సన్లు క్యాంపులో ఎందుకు కాపలాగా ఉన్నారు. మీ నాయకులపై మీకు నమ్మకం లేదా? సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ రెబల్ గా నిలబడిన వారు 12 మంది కౌన్సిలర్లుగా గెలిచారు. దీనికి స్థానిక ఎమ్మెల్యేగా కేటీఆర్ ఏం సమాధానం చెబుతారని రవీందర్ సింగ్ ప్రశ్నించారు. క్యాంపులు పెడుతున్న మంత్రులు.. ఎందుకు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. సిరిసిల్ల నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ఇసుక దందా నడుస్తుంటే ఏం చేస్తున్నారు ఎవ్వరికి కొమ్ము కాస్తున్నారని మండిపడ్డారు.
ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న భానుప్రసాద్‌ను ఎందుకు గెలిపించాలి, ఆయన ఎప్పుడైనా ఇక్కడికి వచ్చారా..? ఏ సమస్యలు పట్టించుకోని ఆయనకు ఎందుకు మీరు ఓటేయాలో ప్రజలు ఆలోచించుకో వాలన్నారు. డబ్బులిచ్చి ఈ ఎన్నికల్లో ఏకగ్రీవంగా గెలుద్దామను కున్నారు. కానీ నేను నామినేషన్ వేసి ఏకగ్రీవం కాకుండా చేశానని రవీందర్ సింగ్ చెప్పారు. క్యాంపుల్లో మీకు ఇస్తున్న డబ్బులు మీవే.. అవే మీకు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. నా నామినేషన్ వల్లే ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రజాప్రతినిధులకు గౌరవం దక్కుతుందన్నారు. శాసనమండలిలో మున్సిపల్, పంచాయతీ రాజ్ చట్టాల సందర్భంగా భానుప్రసాద్ ఎందుకు మాట్లాడలేదని విమర్శించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు జాతీయ జెండా ఎగురవేసే అవకాశం ఇవ్వాలి. నేను నామినేషన్ వేయడం వల్లనే పెండింగ్‌లో ఉన్న ఎంపీటీసీల, జెడ్పీటీసీల జీతాలు విడుదలయ్యాయి. ఆత్మగౌరవం కోసమే నేను ఎమ్మెల్సీగా పోటి చేస్తున్నాని రవీందర్ సింగ్ అన్నారు. మీ గొంతుకగా మారి మీ సమస్యలపై శాసనమండలిలో మాట్లాడుతా.. నన్ను ఆశీర్వదించండి ఆయన ప్రజలను కోరారు.
మీరు ఎవరికీ భయపడకండి.. సీక్రెట్ ఓటింగ్ విధానం వల్ల మీరు ఎవరికి ఓటు వేస్తున్నారనేది ఎవరికీ తెలియదు. హుజురాబాద్ ఎన్నికల్లో డబ్బులు పంచినా.. టీఆర్ఎస్ ఓడిపోయింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరోసారి హుజురాబాద్ లాంటి ఫలితం రిపీట్ కావాలి. ఈ రాష్ట్రంలో ఉద్యమకారులు లేరా? భానుప్రసాద్, ఎల్. రమణలకు ఎలా టికెట్ ఇచ్చారు? ఉద్యమకారులపై రాళ్లు విసిరిన కౌశిక్ రెడ్డి పార్టీలో చేరిన 18 గంటల్లోనే ఎమ్మెల్సీ ఎలా ఇచ్చారు? ఉద్యమకారులకు అండగా ఉండాల్సిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏం చేస్తున్నారు? మంత్రులు క్యాంపులో పండుకుని కాపాలా కాసిన రోజులున్నాయా అంటూ ధ్వజమెత్తారు.
నాలుగు కోట్లకు ప్రతినిధులుగా ఉండాల్సిన మంత్రులు చేసే పనులేనా? కేసీఆర్ అనరాని మాటలు అన్న తలసాని శ్రీనివాస్, సబితా ఇంద్రారెడ్డి లాంటి వాళకు పదవులు ఇచ్చారని ఆయన ఆరోపించారు. నానా మాటాలు తిట్టిన తలసాని శ్రీనివాస్, సబితా ఇంద్రారెడ్డి లాంటి వాళ్లకు మంత్రి పదవులిచ్చారు. టీఆర్‌ఎస్‌లో నేడు ఉద్యమాన్ని వ్యతిరేకించిన వాళ్లే మంత్రులుగా ఉన్నారిని ఎమ్మెల్సీ అభ్యర్థి రవీందర్ అన్నారు.