అగ్నిపథ్‌పై విపక్షాలు విమర్శలు గుప్పిస్తుంటే.. బీజేపీ నేతలు అగ్నిపథ్ స్కీం ఆమోదయోగ్యమని వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా బీజేపీ జాతీయ ఉపాధ్యాక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ.. సికింద్రాబాద్ అల్లర్ల ఘటనపై కేంద్రం సీబీఐ విచారణకు అదేశించాలని ఆమె డిమాండ్ చేశారు. టీఆర్‌ఎస్ పార్టీ మద్దతుతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం చేశారని ఆమె మండిపడ్డారు. కేంద్రంపై ప్రజల్లో వ్యతిరేకత సృష్టించేందుకు టీఆర్‌ఎస్, కాంగ్రెస్ కుట్రలో భాగమే ఈ అల్లర్లు అంటూ ఆమె ఆరోపించారు. అమాయకులను రెచ్చగొట్టి యువకుల ప్రాణాలతో చెలగాటం ఆడటం హరీష్ రావుకు వెన్నతో పెట్టిన విద్య అంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.
పశ్చిమ బెంగాల్ తరహాలో తెలంగాణలోనూ విధ్వంసాలకు పీకేతో కలిసి టీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. సికింద్రాబాద్ లో 10 గంటలు విధ్వంసం జరుగుతుంటే.. టీఆర్‌ఎస్ ప్రభుత్యం సినిమా చూస్తోందా..? అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్ల వరంగల్ యువకుని మృతి చెందాడని ఆమె విమర్శించారు. అగ్నిపథ్ పథకాన్ని టీఆర్‌ఎస్ రాజకీయం చేస్తోందని ఆమె ధ్వజమెత్తారు.