ఈ మధ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి.. ఢిల్లీ వెళ్లి బీజేపీ గూటికి చేరిన సీనియర్ రాజకీయ నేత దాసోజు శ్రవణ్ కుమార్.. ఇప్పుడు బీజేపీకి ఊహించని షాక్ ఇచ్చారు.. అసలు మునుగోడు ఉప ఎన్నిక సమయంలో.. ఇతర పార్టీల నేతలను ఆకర్షించే పనిలో కమలం పార్టీ నేతలు ఉండగా.. బీజేపీకి రాజీనామా చేశారు దాసోజు.. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు రాజీనామా లేఖ పంపిన ఆయన.. ఇవాళ సాయంత్రం.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకునేందుకు సిద్ధం అయ్యారు.. అయితే, సుదీర్ఘకాలం టీఆర్ఎస్‌లోనే కొనసాగారు దాసోజు.. తెలంగాణ ఉద్యమం సమయంలో టీఆర్ఎస్‌లో కీలకంగా వ్యవహరించిన ఆయన.. 2014లో అప్పటి కేంద్ర మంత్రి జైరామ్ రమేష్, పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.. కాంగ్రెస్ పార్టీ ఆయనకు పీసీసీ అధికార ప్రతినిధి హోదాను కల్పించి ప్రాధాన్యత ఇచ్చింది. కానీ, 2018లో ఖైరతాబాద్‌లో పోటీచేసి ఓడిపోయిన ఆయన ఈసారి ఎలాగైనా గెలవాలని క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచేస్తున్నారు. అయితే, దివంగత నేత పీజేఆర్ కూతురు విజయారెడ్డి రాకతో ఆయన కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి.. తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.. ఇప్పుడు కాషాయ పార్టీకి కూడా షాకిచ్చారు.
Read Also: Ginna Movie Review: జిన్నా రివ్యూ
బండి సంజయ్‌కు పంపిన రాజీనామా లేఖలో ఆసక్తికర విషయాలు రాసుకొచ్చారు దాసోజు శ్రవణ్.. “ప్రత్యామ్నాయ రాజకీయాలు చేస్తాం అని చెప్పిన తమరు.. మునుగోడు ఉప ఎన్నికలో అనుసరిస్తున్న రాజకీయల తీరు అత్యంత జుగుప్సాకరంగా ఉంది.. సామాజిక బాధ్యత లేకుండా ఎన్నికలు అనగానే డబ్బు సంచులు గుప్పించాలన్నట్లుగా, బడా కాంట్రాక్టర్లే రాజ్యాలేలాలే, పెట్టుబడి రాజకీయాలు చేయాలన్నట్లుగా కొనసాగిస్తున్న వైఖరి నా లాంటి బలహీన వర్గాలకు చెందిన నాయకులకు స్థానం ఉండదని తేలతెల్లమైంది.” అని పేర్కొన్నారు.. ఇక, అనేక ఆశలతో.. ఆశయాలతో నేను బీజేపీలో చేరినప్పటికీ దిశాదిశాలేని నాయకత్వ ధోరణులు, నిర్మాణాత్మక రాజకీయాలకు కానీ, తెలంగాణ సమాజానికి కానీ, ఏ మాత్రం ఉపయోగకరంగా లేవని అనతికాలంలోనే అర్థమైందని లేఖలో పేర్కొన్నారు దాసోజు.. ప్రజాహితమైన పథకాలతో, నిబద్ధత కలిగిన రాజకీయ సిద్ధాంతలతో ప్రజలను మెప్పించడం కంటే.. మందు, మాంసం, విచ్చలవిడిగా నోట్ల కట్టలు పంచడం.. తద్వారా మునుగోడు ఉప ఎన్నికలో గెలుపు సాధించాలనుకుంటున్న మీ తీరు పట్ల నిరసన తెలియజేస్తూ.. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను.. అని స్పష్టం చేశారు.. కాగా, ఆగష్టులో బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జీ తరుణ్ చుగ్ సమక్షంలో బీజేపీలో చేరిన దాసోజు శ్రవణ్… రెండు నెలలో గడిచాయో లేదు.. కమలం పార్టీకి బైబై చెప్పి.. కారు ఎక్కెందుకు సిద్ధం అయ్యారు. ఇప్పటికే సీఎం కేసీఆర్‌ను కూడా కలిసిన ఆయన.. సాయంత్రం గులాబీ కండువా కప్పుకుంటారని తెలుస్తుంది.