Ginna Movie Review: మంచు విష్ణు హీరోగా యాక్ట్ చేసి, ప్రొడ్యూస్ చేసిన మూవీ ‘జిన్నా’. దీని టైటిల్ అనౌన్స్ మెంట్ మోషన్ పోస్టర్ లో ఏడుకొండల వెనుక నుండి ‘జిన్నా’ పేరు పైకి రావడం కాంట్రవర్సీకి తెరలేపింది. అది తన మూవీ పబ్లిసిటీకి ఉపయోగపడుతుందని భావించి కావచ్చు, మంచు విష్ణు అప్పట్లో మౌనంగానే ఉండిపోయాడు. కానీ ఇప్పుడు రిలీజ్ టైమ్ లో మాత్రం ఎలాంటి వివాదాలకూ తావివ్వకుండా… హీరో ఎంట్రీ సీన్ లోనే ‘జై శ్రీరాం’ అనిపించేశారు. మరి గాలి నాగేశ్వరరావు ఉరఫ్ ‘జిన్నా’ ప్రేక్షకులను మెప్పించాడో లేదో తెలుసుకుందాం.
చిత్తూరు జిల్లా రంగం పేటకు చెందిన గాలి నాగేశ్వరరావుకు పూర్తి పేరుతో ఎవరైనా తనను పిలిస్తే కోపం. షార్ట్ కట్ లో ‘జిన్నా’ అని పిలవమని అందరికీ చెబుతుంటాడు. స్కూల్ టైమ్ లో అతనికి క్లాస్ మేట్స్ రేణుక, స్వాతితో చక్కని స్నేహం ఏర్పడుతుంది. బయటి ఊరి నుండి వచ్చిన రేణుక మూగ, చెవిటి అమ్మాయి. అయితే… పల్లెటూరిలో ఇమడలేక ఆమె తండ్రి నారాయణస్వామి, రేణుకను తీసుకుని విదేశాలకు వెళ్ళిపోతాడు. పెరిగి పెద్దయ్యాక చిన్నప్పటి స్వాతితోనే జిన్నా ప్రేమలో పడతాడు. బతకడానికి టెంట్ హౌస్ నడిపే జిన్నాకు… ఊరి నిండా అప్పులే! స్వాతి అతనికి సాయం చేసినా, ఆ అప్పుల నుండి బయట పడలేకపోతుంటాడు. అదే సమయంలో వాళ్ళ చిన్ననాటి స్నేహితురాలు రేణుక తన బాబాయ్ వీరాస్వామి కోసం ఊరికి వస్తుంది. ఆమె దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయని తెలిసి, ఆమె సాయంతో తన అప్పులు తీర్చడంతో పాటు ఊరి ప్రెసిడెంట్ కావాలనే తన కోరికనూ నెరవేర్చుకోవాలని జిన్నా భావిస్తాడు. అందుకోసం రేణుకను పెళ్ళి చేసుకోవడానికీ సిద్ధపడతాడు. మరి స్వాతిని ప్రేమించిన జిన్నా… రేణుక మెడలో తాళి కట్టాడా? తండ్రితో పాటు విదేశాలకు వెళ్ళిన రేణుకకు అంత డబ్బు ఎలా వచ్చింది? రేణుక గతం తెలిసివాళ్ళు ఆమెను చూసి ఎందుకు భయపడ్డారు? అనేదే మిగతా కథ.
‘జిన్నా’ మూవీ ట్రైలర్ చూసిన వాళ్ళు దీన్ని హారర్ కామెడీగా భావిస్తారు. కానీ థియేటర్ కు వచ్చిన తర్వాత అందుకు భిన్నమైన చిత్రమనే విషయం అర్థమౌతుంది. ఫస్ట్ హాఫ్ పరమ రొటీన్ గా ఉంది. ఎప్పుడైతే రేణుక పాత్రకు సంబంధించిన ట్విస్ట్ ఇంటర్వెల్ లో రివీల్ అయ్యిందో అక్కడ నుండి మూవీ గ్రాఫ్ పెరిగింది. అయితే ఆ తర్వాత కూడా హారర్ ఛాయలతో సినిమా సాగడంతో, ఇలాంటి సీన్స్ చాలా సినిమాల్లో చూశాం కదా! అనిపిస్తుంది. బట్.. ప్రీ క్లయిమాక్స్ లో ప్రేక్షకుల ఊహకు అందని విధంగా కథను మలుపు తిప్పారు కథకుడు నాగేశ్వరరెడ్డి. అదే ఈ సినిమాకు ఆయువు పట్టు. కానీ ఓవర్ ఆల్ గా చూసుకుంటే… పాత్రలు, వాటి ప్రవర్తన, వాటిని నడిపిన తీరు సగటు ప్రేక్షకుడిని మెప్పించలేవు. హీరోకు ఎలాంటి గొప్పతనాన్ని డైరెక్టర్ ఆపాదించలేదు. అతన్ని కూడా స్వార్థపరుడిగానే చూపించారు. ప్రేమించిన యువతితో కలిసి, చిన్ననాటి స్నేహితురాలిని మోసం చేయాలని ఆ పాత్ర భావించడం సబబుగా అనిపించదు. అలాంటి యాంటీ సెంటిమెంట్ సీన్స్ సినిమాలో చాలానే ఉన్నాయి. దీనికి మూల కథను అందించింది ప్రముఖ దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి. ఆయన తనదైన పంథాలో వినోదాన్ని బాగానే దట్టించాడు. స్క్రీన్ ప్లేను కోన వెంకట్ అందించారు. ప్రథమార్ధంతో పోల్చితే ద్వితీయార్థం కాస్తంత బెటర్ గా ఉంది. ఈ సినిమాకు సంబంధించిన మరో విశేషం ఏమంటే… ఇందులోని ‘ఇది స్నేహం…’ అనే పాటను మంచు విష్ణు కుమార్తెలు అరియానా, వివియానా చక్కగా పాడారు. అనూప్ రూబెన్స్ అందించిన స్వరాలలో కొత్తదనం లేకపోయినా… పాటలు వినడానికి, చూడటానికి బాగానే ఉన్నాయి. వీటికి ప్రభుదేవా, గణేశ్ ఆచార్య, ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ చేశారు. ‘వాటే బాడీ… ‘ పాటలో గణేశ్ ఆచార్య గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చారు. చిత్రం ఏమంటే… ఓ ఫైట్ లో హీరో ‘నువ్వు నన్ను ట్రోల్ చేయ్ ఎంజాయ్ చేస్తా… మా వాళ్ళ జోలి కొస్తే తోలు తీస్తా’ అంటూ అసందర్భంగా డైలాగ్ చెప్పేస్తాడు. మూవీ ప్రమోషన్స్ లో వాడుకోవడానికి ఇలాంటివి చెప్పించారని పిస్తుంది.
నటీనటుల విషయానికి వస్తే… మంచు విష్ణు కథను నమ్మి ఈ పాత్ర చేశాడు, సినిమా తీశాడు. నిజానికి ఇందులో అతని పాత్రకంటే కూడా సన్నీలియోన్ పోషించిన రేణుక పాత్రే ప్రధానమైంది. ఆమె పోషించింది మూగ చెవిటి అమ్మాయి పాత్ర కాబట్టి కొంత వరకూ ఎలాగో నెట్టుకొచ్చేసింది. కానీ ఆ తర్వాత మూవీలో అసలైన ట్విస్ట్ రివీల్ చేశాక, అమ్మడి నటన తేలిపోయింది. సన్నీలియోన్ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా అంత ఛార్మింగ్ గా లేదు. ‘కరెంట్ తీగ’లోని సన్నీకి ఇప్పటికీ చాలా తేడా కనిపిస్తోంది. పాయల్ రాజ్ పుత్ చేసిన స్వాతి పాత్ర రొటీన్ గా సాగింది. సెక్సీ హీరోయిన్స్ ఇమేజ్ ఉన్న పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ ఇందులో కీ రోల్స్ చేస్తున్నారంటే యూత్ ఆశపడేది వేరే ఉంటుంది. కానీ దాన్ని దర్శకుడు అందించలేదు. ఇతర ప్రధాన పాత్రలను సురేశ్, నరేశ్, రఘుబాబు, సునీల్, ‘సత్యం’ రాజేశ్, గౌతంరాజు, చమ్మక్ చంద్ర, ‘వెన్నెల’ కిశోర్, భద్రం తదితరులు పోషించారు. బిగ్ బాస్ ఫేమ్ దివి, త్రిపురనేని చిట్టి గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చారు. చోటా కె. నాయుడు సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. బట్ ప్రొడక్షన్ వాల్యూస్ ఏమంత గొప్పగా లేవు. యాక్షన్ సీన్స్ లో హీరో వెనక భాగంలో వేసిన రోప్స్ ఛాయలు క్లియర్ గా కనిపిస్తున్నాయి. ‘గ్యాంగ్ స్టార్ గంగరాజుస ఫేమ్ ఇషాన్ సూర్య… మంచు విష్ణు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదనిపిస్తోంది. కామెడీ థ్రిల్లర్స్ ను ఇష్టపడేవారికి ఈ సినిమా ఓ మేరకు నచ్చొచ్చు!!
రేటింగ్: 2.5 / 5
ప్లస్ పాయింట్స్
సైకో థ్రిల్లర్ కావడం
సన్నీలియోన్ క్యారెక్టర్
అనూప్ రూబెన్స్ మ్యూజిక్
మైనెస్ పాయింట్స్
ఆకట్టుకోని ప్రథమార్ధం
రొటీన్ కామెడీ
ప్రొడక్షన్ వాల్యూస్
ట్యాగ్ లైన్: సైకో సన్నీ!