యాదాద్రి నరసింహ స్వామి దర్శనాల కోసం ఎదురుచూస్తున్న భక్తులకు శుభవార్త.. గతంలో నిర్ణయించిన ప్రకారమే స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించనున్నారు. ఈ నెల 28వ తేదీ నుంచి బాలాలయంలో కాకుండా ప్రధాన ఆలయంలో స్వామివారిని దర్శించుకునేందుకు అనుమతి ఇస్తారు.. యాదాద్రి స్వామివారి స్వయంభువుల దర్శనాలు ఈ నెల 28న ఉదయం 11.55 గంటలకు నిర్వహించనున్న మహాకుంభ సంప్రోక్షణతో ప్రారంభం అవుతాయని తెలిపారు ఆలయ ఈవో గీతారెడ్డి.. ఈ నెల 21 నుంచి వారం రోజుల పాటు బాలాలయంలో పంచ కుండాత్మక యాగం నిర్వహిస్తామని.. 108 పారాయణ దారులు, ఆలయ అర్చక బృందంతో ఈ క్రతువు ఉంటుందన్న ఆమె.. మహాకుంభ సంప్రోక్షణలో సీఎం కేసీఆర్ పాల్గొంటారని వెల్లడించారు.. 21 నుండి 28 వరకు ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వేళల్లో బాలాలయంలో పూజా కార్యక్రమాలు ఉంటాయని.. 28వ తేదీన సంప్రోక్షణ అనంతరం బాలాలయంలోని స్వామివారి ఉత్సవ మూర్తులను శోభాయాత్రగా ప్రధానాలయంలోకి తీసుకెళ్లనున్నట్టు తెలిపారు..
Read Also: Holi: హోలీ వేడుకల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే.. కార్యకర్తలకు మందు పోస్తూ చిందులు..
ఎలాంటి హడావుడి లేకుండా అన్ని పూజలు పూర్తి అయిన తర్వాతే భక్తులకు దర్శనాలకు అనుమతి ఇస్తామని తెలిపారు ఈవో గీతారెడ్డి.. కల్యాణ కట్ట, పుష్కరిణిలను భక్తులకు అందుబాటులోకి తెచ్చాం.. దేవాదాయ శాఖ, జిల్లా యంత్రాంగం, ఇతర అన్ని శాఖల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.. ఇక, బాలాలయంలో యాగ శాల ఏర్పాట్లు రేపటితో పూర్తి అవుతాయన్న ఆమె.. దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడుకి జియో ట్యాగింగ్ చేస్తామని.. దీంతో, రోజు ఎంత మంది దర్శనాలు చేసుకుంటున్నారు అన్నది పక్కాగా తెలుస్తుందన్నారు ఈవో గీతారెడ్డి.