సిద్ధిపేట కలెక్టర్ రైతులపై మాట్లాడిన మాటలు నియంతలా ఉన్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు దేవుళ్లతో సమానమని తెలిపారు. కలెక్టర్ వెంకట్రామిరెడ్డి రైతులకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ – బీజేపీ ప్రభుత్వాలు డ్రామాలు ఆడుతున్నాయన్నారు.
రైతుల పొట్టగొట్టి నడ్డి విరిచి రోడ్డు పాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని జగ్గారెడ్డి విమర్శించారు. వరి పంటకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరోసా ఇవ్వాలన్నారు. బండి సంజయ్, తెలంగాణ మంత్రులు యాక్టింగ్‌లు బంద్ చేయాలి. వరి పండించొద్దంటే పండించిన పంటను రైతులు ఏం చేయాలని జగ్గారెడ్డి ప్రశ్నించారు.
రైతులకు కాంగ్రెస్ అండగా ఉంటూ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని జగ్గారెడ్డి తెలిపారు. నవంబర్ 2న ఛలో సిద్ధిపేటకు పిలుపునిచ్చామన్నారు. రైతుల కోసం మాట్లాడిన ప్రతిపక్షాలను మంత్రులు బూతులు తిట్టడం పద్ధతి కాదన్నారు. రైతుల పొట్టలు గొడితే మీ వీపులు పగులుతాయ్ అని జగ్గారెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఎన్నికలు ముగిసిన తరువాత కలెక్టర్ల వీపులు పగులగొట్టే సమయం వస్తుందని, జగదీష్ రెడ్డి అత్యుత్సాహం ఆపాలన్నారు. ప్రతిపక్షాలపై అవాకులు చెవాకులు పెలితే నడి రోడ్డుమీద జగదీష్ రెడ్డి బట్టలు విప్పుతాం.
టీఆర్ఎస్, బీజేపీలు దొంగల పార్టీలన్నారు. హరీష్ రావువి అన్ని అబద్ధాలేన్నారు. ఎప్పుడు ఏదో ఒక అబద్ధం చెబుతూనే ఉంటాడని జగ్గారెడ్డి అన్నారు.సిద్ధిపేట కలెక్టర్ వ్యాఖ్యలు మంత్రి హరీష్ రావుకు సిగ్గని పించడం లేదా? కలెక్టర్లు బాగా బలిసి మాట్లాడుతున్నారు. ఓటు ద్వారానే రైతులు బీజేపీ, టీఆర్ఎస్ కు బుద్ధి చెప్పాలన్నారు. కేసీఆర్ పెద్ద కొడుకులా సిద్ధిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి వ్యవహరిస్తున్నా రన్నారు. కలెక్టర్ పదవి గౌరవాన్ని సీఎం కాళ్లు మొక్కి తగ్గిస్తున్నారు. కలెక్టరేట్లు దెయ్యాల కొంపలుగా తయారైయ్యాయి, బూజు పట్టి పోయాయని జగ్గారెడ్డి విమర్శించారు.