CMRF Record : తెలంగాణలో ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త రికార్డు సృష్టించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో గత రెండేళ్లలో పేద, మధ్యతరగతి ప్రజలకు ఎప్పుడూ లేని స్థాయిలో వైద్య సహాయం అందింది. 2023 డిసెంబర్ 7 నుంచి 2025 డిసెంబర్ 6 వరకు మొత్తం 3,76,373 మంది లబ్ధిదారులకు రూ.1,685.79 కోట్ల సహాయం అందజేశారు. గతంలో 2014 నుంచి 2024 వరకు సంవత్సరానికి సగటున రూ.450 కోట్లు మాత్రమే సహాయ నిధి ద్వారా పంపిణీ కాగా, ప్రస్తుత ప్రభుత్వం రెండు సంవత్సరాల్లో సగటున సంవత్సరానికి రూ.850 కోట్ల మేర నిధులు వెచ్చించడం గమనార్హం.
ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రజలకు రెండు విధాలుగా వైద్య సహాయం అందుతోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స కోసం ముందుగానే ఖర్చు భరించే లెటర్ ఆఫ్ క్రెడిట్ విధానం ద్వారా 27,421 మంది లబ్ధిదారులకు రూ.533.69 కోట్ల సహాయం అందింది. నిమ్స్, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రి, ప్రభుత్వ ఈఎన్‌టీ ఆసుపత్రి వంటి వైద్య కేంద్రాల్లో ఈ సహాయం నేరుగా చికిత్స ఖర్చులకు ఉపయోగపడింది. మరోవైపు ప్రైవేటు లేదా కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన వారు ఖర్చులు చెల్లించిన అనంతరం తిరిగి పొందే రీయింబర్స్‌మెంట్ విధానం ద్వారా 3,48,952 మందికి రూ.1,152.10 కోట్లు అందజేశారు.
ICC ODI Rankings: నంబర్-1 కుర్చీ ఎవరిది? RO-KO మధ్య రేర్ క్లాష్..
ప్రజలు ఆర్థిక భారం లేకుండా నాణ్యమైన వైద్యం పొందేలా ప్రభుత్వ ఆసుపత్రులకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారు. ముఖ్యంగా నిమ్స్‌లో ఎక్కువగా లెటర్ ఆఫ్ క్రెడిట్ కేసులు మంజూరవడం ద్వారా పేదలకు అత్యాధునిక చికిత్స అందుబాటులోకి వచ్చింది. ఈ మొత్తం ప్రక్రియలో దళారీల పాత్ర లేకుండా దరఖాస్తులను పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో స్వీకరిస్తున్నారు. ఆధార్ ధృవీకరణ తర్వాత లబ్ధిదారుడి పేరు, బ్యాంక్ ఖాతా వివరాలతో చెక్కులు జారీ చేస్తుండటంతో పారదర్శకత మరింత పెరిగింది.
తెలంగాణ రాష్ట్ర నివాసితులు, సాధారణంగా సంవత్సరానికి రూ.1.60 లక్షల లోపు కుటుంబ ఆదాయం ఉన్నవారు ముఖ్యమంత్రి సహాయ నిధికి అర్హులు. ప్రజాప్రతినిధుల సిఫారసుతో అధికారిక CMRF వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఆరోగ్యశ్రీ పథకానికి అదనంగా పనిచేస్తున్న ఈ సహాయ నిధి, అనారోగ్యం కారణంగా ఆర్థికంగా కుంగిపోయే కుటుంబాలకు పెద్ద భరోసాగా మారింది. గతంతో పోలిస్తే నాలుగింతల స్థాయిలో నిధులు వెచ్చించడం ద్వారా ప్రజల ఆరోగ్యం ప్రభుత్వం కోసం ఎంత కీలకమో ఈ గణాంకాలే స్పష్టంగా చూపిస్తున్నాయి.
Ponnam Prabhakar : ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన మంత్రి పొన్నం