CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్రాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం రూపొందించిన ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ డాక్యుమెంట్‌లో భాగంగా, హైదరాబాద్ నగర రూపురేఖలను మార్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరికొత్త ప్రణాళికను సిద్ధం చేశారు. ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ ఏరియాను (CURE) అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే పరిపాలనను మరింత క్షేత్రస్థాయికి తీసుకెళ్లేందుకు ‘క్యూర్’ పరిధిని 12 జోన్లు, 60 సర్కిళ్లు , 300 వార్డులుగా పునర్వ్యవస్థీకరించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన జోనల్ కమిషనర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి నగర ప్రక్షాళనపై అత్యంత స్పష్టమైన దిశా నిర్దేశం చేశారు. అధికారులు కేవలం కార్యాలయాలకే పరిమితం కాకుండా ప్రతిరోజూ ఫీల్డ్‌లో ఉండి ప్రజల సమస్యలను పర్యవేక్షించాలని, అప్పుడే పరిపాలన పట్టాలెక్కుతుందని ఆయన స్పష్టం చేశారు.
WhatsApp Scam: Happy New Year అనగానే క్లిక్ చేశారా..? డబ్బంతా మాయం!
నగరంలో అత్యంత సంక్లిష్టంగా మారిన చెత్త నిర్వహణ , కాలుష్య నియంత్రణపై ముఖ్యమంత్రి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించాలని ఆదేశించడమే కాకుండా, కాలుష్యాన్ని తగ్గించేందుకు డీజిల్ బస్సులు , ఆటోల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలను (EV) తీసుకురావాలని ప్రభుత్వం నిశ్చయించుకుంది. నగరంలోని చెరువులు , నాలాలను ఆక్రమణల నుండి కాపాడుకోవాల్సిన బాధ్యత అధికారులదేనని, అక్రమ ఆక్రమణలు లేదా వ్యర్థాల డంపింగ్‌ను అరికట్టడానికి ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. పారిశుద్ధ్యం విషయంలో రాజీ పడకూడదని పేర్కొంటూ, నెలకు మూడు రోజులు శానిటేషన్ కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని , ప్రతి పది రోజులకోసారి తప్పనిసరిగా గార్బేజ్ క్లియరెన్స్ చేపట్టాలని ఆదేశించారు. రోడ్లపై ఎక్కడా చెత్త కానీ, ప్రమాదకరమైన గుంతలు కానీ కనిపించకుండా చూసుకోవాల్సిన బాధ్యతను జోనల్ కమిషనర్లకు అప్పగించారు.
కేవలం భౌతిక అభివృద్ధి మాత్రమే కాకుండా, పరిపాలనలో పారదర్శకతను పెంచేందుకు టెక్నాలజీని పెద్దపీట వేయాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. జనన-మరణ ధ్రువీకరణ పత్రాలు, ట్రేడ్ లైసెన్సులు వంటి పౌర సేవలను ఆన్‌లైన్ ద్వారా పారదర్శకంగా అందించాలని, తద్వారా గుడ్ గవర్నెన్స్ నుంచి ‘స్మార్ట్ గవర్నెన్స్’ వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. కాలనీ , అపార్ట్‌మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లతో అధికారులు నిరంతరం కమ్యూనికేషన్‌లో ఉండాలని, ప్రజల ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబర్ల ద్వారా అత్యంత వేగంగా స్పందించాలని సూచించారు. రాబోయే ఐదేళ్ల కోసం పక్కా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని, జనవరి నుంచే హైడ్రా (HYDRAA), జీహెచ్‌ఎంసీ , వాటర్ వర్క్స్ విభాగాల సమన్వయంతో నాలాల పూడికతీత పనులు ప్రారంభించాలని ఆదేశించారు. దోమల నివారణ, అంటువ్యాధుల నియంత్రణ , వీధి దీపాల ఏర్పాటు వంటి మౌలిక అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి, అందరూ సమన్వయంతో పనిచేస్తేనే హైదరాబాద్ భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.