ముఖ్యమంత్రి కేసీఆర్ స్వప్రయోజనాలకు పాకులాడే వ్యక్తి అని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే విమర్శించారు. ఆదివారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన ఆయన కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. అక్కడే కేంద్ర పథకాల లబ్ధిదారులతో సమావేశం అయ్యారు.
రాష్ట్ర ప్రభుత్వానికి సెక్రటేరియట్ లేదు.. ఫామ్ హౌస్ నుంచి పరిపాలన కొనసాగిస్తున్నారని విమర్శలు గుప్పించారు మహేంద్ర నాథ్ పాండే. ఇక్కడ గెలవలేని వారు జాతీయస్థాయిలో వెలుగుతారా.? అని ప్రశ్నించారు. ఆయనతో దేశం ఎలా ముందుకు వెళ్తుందని అడిగారు. ఆయుష్మాన్ భారత్ వంటి పథకాల్లో రాష్ట్ర ప్రజలు చేరకుండా కేసీఆర్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏ ఒక్క పథకం లో కూడా అవకతవకలు లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు వచ్చి పడుతున్నాయని అన్నారు. ప్రపంచం మొత్తం మోదీ వైపు చూస్తుందని ఆయన అన్నారు.
ఈ సమావేశంలో నిజామాబాద్ ఎంపీ దర్మపురి అరవింద్ కూడా పాల్గొన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఎవరినైతే నెత్తిమీద పెట్టుకున్నారో వాళ్లే మైనర్లపై అత్యాచారాలు చేస్తున్నారని విమర్శించారు. గడిచిన నెల నుంచి ఇప్పటి వరకు ఏడుగురి మైనర్లపై అత్యాచారాలు జరిగాయని..రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దెబ్బతిందని అన్నారు. ఎన్నికల్లో గెలవాలంటే ప్రజల మనసుల్లో నిలిచిపోవాలి.. మంత్రి ప్రశాంత్ రెడ్డిలా చెక్క భజనలు చేయడం కాదని సూచించారు. మంత్రి నియోజక వర్గంలో ప్రజలు ఎక్కడి తిరగబడుతారో అని స్పెషల్ పోలీస్ ఫోర్స్ తో నియోజకవర్గంలో ప్యటిస్తున్నారని ఎద్దేవా చేశారు.